Site icon Newsminute24

Movie: ‘పెద్ద ఆదిరాల’ రాజుగాడి విజయగాథ.. చూసి తీరాల్సిందే..!

Movie review: ‘పాతాళభైరవి’ సినిమా గుర్తుందా?(అసలు మర్చిపోతేకదా!) రాకుమారిని ప్రేమించిన తోటరాముడికి మహారాజు షరతు విధించాడు. సిరిసంపదలు తీసుకొస్తేనే రాకుమారితో పెళ్లి చేస్తానన్నాడు. సరే.. ఆ తర్వాత తోట రాముడు మాంత్రికుడి వద్ద కొలువు చేయడం, పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడం మనకు తెలిసిందే! ‘మిస్సమ్మ’ గుర్తుందా? అందులో కొలువున్నవారి మధ్య ప్రేమ. ఆ కొలువులు నిలుపుకునే క్రమంలో తగవులు, అభిమానాలు, అపార్థాలు. ‘మాయాబజార్’(వాట్ ఎ ఫిల్మ్)లో మరో రకం కథ. పాండవులు కొలువు తప్పి, అడవుల పాలైనందుకు శశిరేఖ, అభిమన్యుల ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడం.

మొత్తంగా తెలుగు సినిమా మొదటి నుంచే కొలువుల చుట్టూ తిరుగుతూ ఉంది. కొలువంటే ఉద్యోగమన్నమాట. ఒకచోట స్థిరంగా ఉండి చేసే పని. నెలకింత జీతం చేతికందే పని. ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకునేందుకు ధైర్యం ఇచ్చే పని. అదుంటే చాలు, జిందగీ ఇంక బిందాస్. ఇప్పుడు ‘పెద్ద ఆదిరాల’ పిలగాడు రాజుగాడిక్కూడా కొలువు కావాలి. సర్కారు కొలువు కావాలి. ఇప్పటికే నాలుగైదుసార్లు ప్రయత్నించి, ప్రయత్నించి విసిగిపోయిన రాజుకు ఇప్పుడు నౌకరీ తప్పనిసరి. తను ప్రేమించిన శిరీషని పెళ్లి చేసుకోవాలంటే సర్కారు ఉద్యోగం దక్కాలి. బస్తీమే సవాల్. ఉద్యోగం వస్తేనే పెళ్లి. లేకుండా ఇగ లొల్లి. మరి కొలువు వచ్చిందా, లేదా, దానికోసం బిడ్డ ఎంత ఆగమయ్యిండు అన్నది తెర మీది కథ.

తీయడానికి మహాభారతంలో బోలెడంత కథ, లెక్కకు మిక్కిలి పాత్రలు, అద్భుతమైన డ్రామా ఉంది. ఎటొచ్చీ, ఇట్లాంటి సింపుల్ అండ్ స్ట్రెయిట్ కథలు సినిమాలుగా తీసేటప్పుడే వస్తుంది అసలు తంటా. కథ చేతికి చిక్కింది సరే, దాన్ని తెర మీద పెట్టాలంటే డ్రామా పండాలి. సీన్లు కుదరాలి. పాత్రలు బలంగా నిలవాలి. అప్పుడు కదా నిండుతనం. ఈ సినిమాలో కథ ఉంది. ఆ కథను ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉంది. పాత్రలున్నాయి. వాటిని బలంగా నిలబెట్టే సన్నివేశాలకు అవకాశం ఉంది. నటులున్నారు. వారి నటనను అద్భుతంగా తెర మీద పండించే అవకాశం ఉంది. అన్నీ ఉన్న చోట అసలైనదేదో లేదు. విడిపూలెన్నున్నా దండ గుచ్చేందుకు దారం కావాలిగా! అది మిస్సయ్యింది. ఆ మిస్సవ్వడం సినిమాను సగంలో నిలిపేసింది. ఏంటది? ఎందుకది?

బాగున్న కథను ఆసక్తికరంగా నడిపే సన్నివేశాలు, పాత్రల్ని జనానికి కనెక్ట్ చేస్తూ కథను ముందుకు నడిపే కథనం…ఇవి రెండూ మిస్సయ్యాయి అనిపించింది. తెర మీద పాత్రలు మన దాకా చేరాలంటే ఇవి రెండూ చాలా అవసరం. లేకపోతే కథను బాగుందని అనుకోగలం కానీ, చాలా బాగుందని మనసారా భావించలేం. రాజు, రాణి జంటగా కలిస్తే ఏం మజా? మధ్యలో మాంత్రికుడు రావడం, రాణి చిలకగా మారడం, కత్తి యుద్ధాలు, రాకాసి మూకలు, గండభేరుండ పక్షులు.. ఇన్ని దాటుకొని రాజు రాణిని చేపడితేనే కదా మజా! అలా కథను ఆసక్తిగా మలిచే సన్నివేశాలు మరిన్ని పెట్టాల్సింది.

విప్లవ్ (ఆ పేరులో తగినంత హీరోయిజం ఉంది) నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారి తీసిన ఈ సినిమా గతేడాది విడుదలైంది. ఈ మధ్యే నా కళ్లబడింది. ‘ఈసారైనా!?’.. టైటిల్ కొత్తగా కనిపించింది. చూడటం మొదలుపెట్టాను. రాజు పాత్రలో అతనిది బెస్ట్ ఎఫర్ట్. సినిమాకు ఒక క్రాఫ్ట్ డీల్ చేయడమే చాలా పెద్ద టాస్క్. అలాంటిది ఒకేసారి ఎనిమిది విభాగాలు(నిజ్జంగా) డీల్ చేశాడితను. తెర మీద టైటిల్స్‌లో అన్ని విభాగాల కింద అతని పేరు కనిపించేసరికి కొంచెం కంగుతిన్నా, ఒక్క సెకనులో సర్దుకొని ‘లాజవాబ్’ అనుకున్నాను. ‘సినిమాలే మా జీవితం’ అనుకునేవాళ్లు ఇలా తమ సినిమా కోసం అన్ని విభాగాల్లో కష్టపడతారు. దాసరి నారాయణరావు గారే బతికుంటే, ఇతను ఇన్ని విభాగాల్లో పెట్టిన ఎఫర్ట్‌కి పిలిచి మరీ సన్మానం చేసేవారు. సత్యం.

సినిమాలో ఎవరి యాక్టింగ్‌కీ పేరు పెట్టలేను(వాళ్లకి ఆల్రెడీ పేర్లు ఉన్నాయ్ కాబట్టి). అందరూ తమ పరిధిలో చాలా బాగా చేశారు. కానీ ‘ఇదిగో ఈ సన్నివేశంలో వీళ్లు ఇరగదీశారు’ అనిపించేందుకు అవసరమైన షేడ్స్ లేవు. అవి ఉన్నప్పుడే ఆర్టిస్టుల ప్రతిభ తెలుస్తుంది. వాళ్ల డబ్బింగ్ కూడా అక్కడక్కడా కృతకంగా అనిపించింది. మహబూబ్ బాషా తన పరిధిలో చాలా బాగా చేశారు. మరిన్ని మంచి పాత్రలు పడాల్సిన నటుడు. ఈయనకు ఇంకొన్ని కామెడీ సీన్లు పెట్టుంటే బాగుండేది కదా అనిపించింది. మా గోరటి వెంకన్న రాసిన పాట సినిమాకు హైలెట్. సీన్లు ఇంకా బాగుంటే, సంగీతం మరింత బాగా వినిపించేది, గుర్తుండేది.

అదన్నట్లు కొలువు కోసం రాజుగాడి విజయవిహారగాథ. కథలో ఎండింగ్ మీరూహించేదే అయినా, మీరు ఊహించన రీతిలో ఉంటుంది. అదేంటో చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే. Airtel Xstream, TataPlay, Hungama ఓటీటీ యాప్‌లలో అందుబాటులో ఉంది.

– విశీ

Exit mobile version