Newsminute24

Telangana: సర్వేయర్లు లేరు భూదార్ కార్డు ఎలా?

వి.బాలరాజు (తహశీల్దారు రిటైర్డు):

భూములను సర్వే చేసి నవీకరణ చేస్తామని గత ప్రభుత్వం తెలిపింది.డిజిటల్ మ్యాప్ అఫ్ తెలంగాణ చేస్తామని ప్రకటించింది.కానీ, సర్వేపనిని పూర్తిగా విస్మరించింది. భూములతో ముడిపడి ఉన్న అవినీతి తగ్గాలంటే రికార్డుకు భూమికి లింకు ఉండాలని రెవిన్యూ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు, ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో అదేపనిగా చెబుతున్నారు. వాస్తవానికి జాతీయ భూముల నవీకరణ పథకం (ఎం.ఎల్.ఆర్.ఎం.పి) క్రింద సమగ్ర సర్వేకు 2014లోనే నిధులు మంజూరు చేసింది. అందుకు 400 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది .అందుకు కేంద్రం 83 కోట్లు విడుదల చేసింది. అయితే గత పది సంవత్సరాలుగా భూముల కొలతల విషయమై ఒక్క అడుగు ముందుకు పడలేదు. నిజాము కాలపు సర్ సాలార్ ఝంగ్ నాటి భూమి కొలతల 1923 చట్టానికి అదనంగా కొంత అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది. చట్టంలో మార్పులు లేకుండా సమగ్ర సర్వే చేపడితే ఎన్నో చిక్కులు వస్తాయనేది గతంలో మనకున్న అనుభవం చెబుతుంది. సరైన పద్ధతిలో అనుమతిస్తే రెండు సంవత్సరాలలో భూముల సర్వే పూర్తి చేస్తానని 2016లో అప్పటి సి.సి.ఎల్.ఏ రేమండ్ పీటర్ ప్రతిపాదించారు. అందుకు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించలేదు. ప్రభుత్వం కూడా ముందుకు తీసుకువెళ్ల లేకపోయింది .తెలంగాణ భూములకు సంపూర్ణ యాజమాన్య హక్కు చట్టం కంక్లూజివ్ టైటిల్ యాక్ట్ తెస్తామని తొమ్మిది సంవత్సరాలుగా అంటూనే ఉంది. అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2021 లోనే సమగ్ర సర్వేకు ముహూర్తం ఖరారు చేసింది. పూర్తి చేయలేక పోయింది. దేశంలో ఇప్పటికే గుజరాత్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 90 శాతం సమగ్ర భూ సర్వేలు నిర్వహించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ భూములకు సంబంధించి కీలక చట్టాలు తెచ్చారు. మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దేశానికి ఒక ఆదర్శవంతమైన భూ రికార్డుల
ప్రక్షాళన సర్వే చెపట్టింది.అందు
కోసం భూమి- కావేరి పేరిట గత 18 ఏళ్లుగా ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారు. అక్కడ ఎవరైనా భూమిని అమ్మాలనుకున్నా లేదా కొనుగోలు చేయాలన్న భూమికి సంబంధించి పూర్తిగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తుంది. అభ్యంతరాలు ఏమీ లేవని నిర్ధారించిన తర్వాత దాన్ని సరైన భూమిగా గుర్తించి వెంటనే మ్యాప్ తో డిజిటలైజ్ చేస్తారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇకమీదట అలాంటి భూమిని ఎన్నిసార్లు ఎవరు కొన్న, అమ్మిన వెంటనే మ్యుటేషన్ చేస్తారు. దాంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో 561 మండలాలు, 78 రెవెన్యూ డివిజన్లు,33 జిల్లాలు, 76 లక్షల కమతాలు 18 లక్షల వరకు సర్వే నంబర్లు ఉన్నాయి.ఈ మొత్తం విస్తీర్ణం రెండు కోట్ల 45 లక్షల 57 వేల 758 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల సర్వే పూర్తి కావాలంటే సరైన మానవ వనరుల, సర్వేయర్ టెక్నికల్ సిబ్బంది ఉండాలి. రెవెన్యూ చీఫ్ కమిషనర్ భూ పరిపాలన తెలంగాణ రాష్ట్రం, దీనికి అనుబంధంగా ఉండేది, భూమి కొలతల విభాగానికి కమిషనర్ సర్వే మరియు సెటిల్మెంట్ తెలంగాణ రాష్ట్రం .ప్రతి జిల్లాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే మరియు ల్యాండ్ రికార్డుల అధికారి ఉంటారు .అన్ని రెవెన్యూ డివిజన్లకు సర్వే ఇన్స్పెక్టర్లు ఉంటారు.ఒక రైతుకు మండల సర్వేయర్ పనితో అసంతృప్తి ఉంటే ఆ పై అధికారులకు, డివిజన్ మరియు జిల్లా స్థాయి అధికారులను సంప్రదించవచ్చు.. చివరగా సర్వే కమిషనర్ ఎంక్వయిరీ తో ఆ రైతు పని పూర్తి అవుతుంది. ఇది ఒక పెద్ద వ్యవస్థ రైతులకు సగానికంటే ఎక్కువ భూమి కొలతల సమస్యలే ఉంటాయి .ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రెవెన్యూ అనుబంధ శాఖకు సగానికి కంటే తక్కువగా శాశ్వత సిబ్బంది ఉన్నారు.పే స్కేల్ లేకుండా గత 13 సంవత్సరాలుగా అన్ని మండలాలలో ఒక
భూమి కొలతల ట్రైనింగ్ లేదా తర్ఫీదు పొందిన వీరిని ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్స్ గా గుర్తించింది. ప్రతి సంవత్సరం వీరి లైసెన్స్ రెన్యువల్ చేస్తే సరిపోతుంది.వీరికి ఎలాంటి జీతభత్యాలు లేవు.కాని, ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుందని వీరి ఆశ.వీరు కొన్ని ప్రైవేట్ సర్వేలు నిర్వహించి పొట్ట గడుపుకుంటున్నారు.

గత ప్రభుత్వాలు కూడా వీరితో పని చేయించుకున్నాయి. జీతం ఇవ్వకున్నా వారి లైసెన్సులను కొనసాగించమని (రీన్యువల్) చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎలక్షన్ వాగ్దానంగా భూముల సర్వే చేస్తామని కొత్తగా సర్వేయర్లను నియమిస్తామని ప్రచారం చేసింది. కొత్త చట్టం ప్రకారం అన్ని భూముల సర్వే చేయడానికి 5000 మంది ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్హత ఉన్న వారిని ప్రస్తుత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. ప్రస్తుతం వారు ట్రైనింగ్ పొందుతున్నారు. వారికి పూర్తిస్థాయి ఉద్యోగం ఇస్తారని హామీ అయితే లేదు. నైపుణ్యం ఉన్న లైసెన్స్ సర్వేయర్స్ ను గుర్తించడం లేదు. రెవిన్యూ మంత్రి లైసెన్స్ డు సర్వేయర్లను నియమించామని మీటింగ్ లలో చెబుతున్నారు.ఇక భూమి సమస్యలు దూరం అవుతాయి అంటున్నారు.ఇది వేచి చూడవలసిన ప్రక్రియ.

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ఆమోదంతో భూ భారతి చట్టం వచ్చింది. అందులో సెక్షన్ నైన్ లో పొందుపరిచినట్లుగా ప్రతి పార్సెల్ కు (ఎ)తాత్కాలిక భూదారు, (బి) శాశ్వత భూధార్,( సి )భూధర్ కార్డ్ ఉంటుందని తెలిపారు. భూ కమతం విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా రైతులందరికీ భూదార్ కార్డు ఇస్తామని, అది వచ్చె15 ఆగస్టు 2025 నాటికి పూర్తి అవుతుందని అంటున్నారు.ఇక ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతుల కష్టాలు దూరం అవుతాయని రెవెన్యూ సదస్సులలో చెబుతున్నారు. ఒక కమతం కొలవాలంటే రైతు, ఒక సర్వే ఉద్యోగి ,ఒక రెవెన్యూ ఉద్యోగి కలిసి పొలం సరిహద్దుల వెంబడి నడవాలి. ప్రతి భూమి పార్సెల్ కు నాలుగు మూలలు ఉంటాయి. నాలుగుకి మించి మూలలుంటే ప్రతి మూలకు వెళ్లి రిమోట్ ని క్లిక్ చేస్తే ఆ పొలం కోఆర్డినేట్ పాయింట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) రికార్డు అవుతాయ.అన్ని వైపులకు వెళ్లాలి. హద్దురాళ్ళను బిగించాలి. ప్రతి కమతంపై ఇరుగుపొరుగు రైతుల మధ్య ఎలాంటి గట్టు పంచాయతీ లేకుండా డిజిటల్ మ్యాప్ సిద్ధం చేయాలి. అప్పుడు ప్రతి రైతు తన కమతానికి ఒక భూదార్ కార్డు పొందగలుగుతాడు. అలా ఇవ్వగలిగితే ప్రతి రైతు భరోసా పొందగలుగుతాడు.చాలా సంతోషిస్తారు.పూర్తిస్థాయిలో భూమి కొలతలు చేయగలిగే సిబ్బంది లేకుండా ఈ పని పూర్తి చేయడం సాధ్యం కాదు.

చట్టం చేసినప్పటికిని విషయ పరిజ్ఞానం లేని సర్వే సిబ్బంది వలన మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.మంచి (తర్ఫీదు) స్కిల్ ఉన్న సర్వయర్స్ అవసరం ఉంది.మంచి సర్వే నైపుణ్యం ఉన్న టెక్నికల్ సిబ్బంది లేకుండా ఈ పని పూర్తికాదు. దశాబ్ద కాలంగా మండల స్థాయిలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లను రెగ్యులరైజ్ చేస్తే సరిపోతుంది.లేకుంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబడదు. భూ భారతి 2025 చట్టం ఆకాంక్ష నెరవేరదు. తెలంగాణ ప్రజలు గతకాలపు అనుభవాలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నారు . ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయవలసిన బాధ్యత మనలాంటివారు అందరిపై ఉంటుంది.

Exit mobile version