Site icon Newsminute24

Telangana: శ్వేతాప్రసాద్‌కు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కారం..

Telangana: తెలంగాణకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన 2022 సంవత్సరానికి  ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ యువ పురస్కార్‌ అవార్డు లభించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను మంగళవారం న్యూఢల్లీిలో ప్రకటించింది. సంగీత విభాగంలో తెలంగాణ నుండి శ్వేతాప్రసాద్‌కు కర్ణాటక మ్యూజిక్‌లో ఈ అవార్డు ప్రకటించారు.

శ్వేతాప్రసాద్‌ ప్రపంచ వ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా రెండు వేలకు పైగా గాత్ర ప్రదర్శలను నిర్వహించారు.  అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలకు సంబంధించి ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చారు. కర్ణాటక గాత్ర కచేరీలే కాకుండా దేశ విదేశాలలో భరతనాట్యం, ఆంధ్రనాట్యం, కూచిపూడి విభాగాలలో ప్రముఖ నాట్యకళాకారులకు ఆమె గాత్ర సహకారం అందించడంతో పాటు పలు నృత్య ప్రదర్శనలకు స్వరకల్పన కూడా చేశారు. అమెరికా, చైనా మలేషియా, టర్కీ, సిరియా, వియత్నాం దేశాలలలో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. 

ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనుమరాలైన శ్వేతాప్రసాద్‌ నాలుగేళ్ల ప్రాయం నుండి సంగీత అభ్యాసం చేశారు. కర్ణాటక సంగీతం, లైట్‌మ్యూజిక్‌లో అకాశవాణి ‘ఏ’ గ్రేడ్‌ కళాకారిణి అయిన శ్వేతాప్రసాద్‌ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఫీల్‌ చేస్తున్నారు.

Exit mobile version