Vandematram:
భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ‘వందేమాతరం’ గీతాన్ని వక్రీకరించింది. వందేమాతరం 150 ఉత్సవాల సందర్భంగా అవాస్తవాలతో అధికార బీజేపీ దేశ భావితరాలను తప్పుదోవ పట్టించేలా చరిత్రను తప్పుగా చిత్రీకరించేందుకు చేసిన కుట్రలను బాధ్యతగల పార్టీగా కాంగ్రెస్ వాస్తవాలతో ఎండగట్టింది.
వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను ఏకం చేసిన ఒక భావజాలం, ఒక మంత్ర శక్తి. దేశం కోసం త్యాగానికి సిద్ధపడిన కోట్లాది భారతీయుల హృదయ స్పందన. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రాణం పోసిన గీతం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రను వక్రీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం పవిత్రమైన ‘వందేమాతరం’ గీతాన్ని కూడా భావోద్వేగాలకు వినియోగించుకునే దురుద్దేశంతో మతపరంగా ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం దురదృష్టకరం. వందేమాతరం భావనను భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే స్వీకరించింది. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం నియంతృత్వ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయతకు సంకేతంగా నిలిచింది. వందేమాతరంతో భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ప్రోత్సాహించిన కాంగ్రెస్ పార్టీ ఎంతో బాధ్యతాయుతంగా మెలిగి ఆ గీతాన్ని సంకుచిత దృష్టితో దుర్వినియోగం చేయలేదు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సిద్దాంతాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ దేశభక్తి అనేది బలవంతంగా నినాదాలు చేయించడం కాదని, ప్రజల సంక్షేమానికి పనిచేయడమే నిజమైన దేశ ప్రేమ అని బలంగా నమ్ముతూ దేశ ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంలో చైతన్య పరిచింది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగ నిర్మాతలు దేశభక్తిని ప్రజాస్వామ్య విలువలతో ముడిపెట్టారు. వందేమాతరం జాతీయ గీతం కాకపోయినా, దానికి అంతే సముచిత గౌరవం, స్థానం కల్పించారు. ఇది దేశంలోని విభిన్న మతాలు, కులాలు, వర్గాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రాంతాలను గౌరవించే రాజ్యాంగాత్మక సమతుల్యానికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఈ సమతుల్యాన్ని ఎప్పటికీ కాపాడుతూనే వచ్చింది. అయితే ప్రస్తుతం బీజేపీ అవకాశవాద రాజకీయలతో పవిత్రమైన వందేమాతరం గీతంలోని ఉన్నతమైన భావనను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారులను ఉర్రూతలూగించిన పవిత్రమైన వందేమాతారం గీతాన్ని కూడా మత కోణంలోనే చూస్తున్న బీజేపీ తమ సిద్దాంతాలతో విభేదించే వారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. కాంగ్రెస్ పార్టీ ఈ నియంతృత్వ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దేశాన్ని ప్రేమించడంతో పాటు ఎవరు ఏమి చేయాలో, ఎలా వ్యవహరించాలో, ఏమి తినాలో, ఏ గీతం పాడాలో అంశాలను కూడా తామే నిర్ణయిస్తామన్నట్టు వ్యవహరిస్తున్న బీజేపీ పోకడలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సహించదు. వారి నుండి విద్వేష పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో దేశం లేదనే సత్యాన్ని ఆ పార్టీ గ్రహించాలి.
దేశం కోసం ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలను బీజేపీ విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. జవహర్ లాల్ నెహ్రూ ఒత్తిడికి తలొగ్గి వందేమాతరం గీతాన్ని కుదించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించి అవాస్తవాలు చెప్పారు. ఎవరికీ అభ్యంతరాలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యం ఉండేలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆర్‌ఎస్‌ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమక్షంలోనే వందేమాతరం గీతంలో చరణాలకు రాజ్యాంగ పరిషత్తు ఆమోదం తెలిపింది. ఈ సవరణలపై జాతీయ గీతం రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవ చరిత్ర ఇది అయితే బీజేపీ నేతలు మాత్రం ఉద్దేశపూర్వకంగా జవహర్ లాల్ నెహ్రూను లక్ష్యంగా చేసుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక వేళ నరేంద్ర మోదీ చెప్పినట్టే నెహ్రూ కావాలనే గీతాన్ని కుదిస్తే రాజ్యాంగ పరిషత్తులో ఇతర సభ్యులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదో ప్రశ్నకు సమాధానం బీజేపీ నేతల వద్ద లేదు. వందేమాతరం గీతం చరణాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న సమయంలో పార్టీ సభ్యులుగా మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారనే వాస్తవాలను తొక్కిపెట్టి కేవలం నెహ్రూ లక్ష్యంగా పవిత్రమైన పార్లమెంట్ వేదికగా బీజేపీ అసత్యాలను చెప్పింది.
దేశ స్వాతంత్య్ర సమరంలో ఏ పాత్ర పోషించని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు వందేమాతరంపై తమకే పేటంట్ హక్కులున్నట్టు వ్యవహరిస్తున్నారు. 1875లో బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతాన్ని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటి సారిగా కాంగ్రెస్ సమావేశంలోనే ఆలపించారు. కాంగ్రెస్ ఈ గీతాన్ని ఆలపించదని ఆరోపిస్తున్న బీజేపీ వారు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు..? అంతేకాదు నెహ్రూపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ దేశం స్వాతంత్య్రం కోసం నెహ్రూ 12 ఏండ్లు జైలు జీవితం గడిపారనేది వాస్తవం కాదా చెప్పాలి. సంఘ్ పరివార్ సభ్యులు, బీజేపీ నేతలెవరైనా స్వాతంత్య్రం కోసం జైళ్లకి వెళ్లారా..? వాస్తవాలు ఇలా ఉంటే కేవలం వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వందేమాతరం గీతంపై రాజకీయాలు చేస్తోంది. దేశ భక్తి అంటే అవాస్తవాలు చెప్పడం కాదు. ప్రజల బాగోగులను పట్టించుకోవడం.
పదకొండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను రూపొందిస్తోంది. వీరి పాలనలో నిరుద్యోగం రికార్డు స్థాయికి పెరిగిపోయింది. మహిళలకు భద్రత, సమానత్వం కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యింది. దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. మైనార్టీలు మోదీ పాలనలో అభద్రతాభావంతో జీవిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఆహార భద్రత, ఉపాధి హామీ, విద్యా హక్కు వంటి ప్రజా సంక్షేమ పథకాలు బీజేపీ పాలనలో నీరుగారిపోతున్నాయి. నిత్యవసర ధరలు ఆకాశనంటడంతో సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి. బీజేపీ ఒంటెత్తు పోకడల పాలనతో అన్ని వర్గాల, రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుడి చేతిలో అస్త్రం అయిన సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశారు. విదేశీ వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్వయం ప్రతిపత్తి గల ఈడీ, ఐటీ, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తోంది. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి తిలోదకాలిస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన దశలో దాన్ని పక్కదారి పట్టిస్తూ వందేమాతరం గీతంపై బీజేపీ ప్రభుత్వం వివాదాన్ని సృష్టిస్తోంది.
వందేమాతరం మతాల మధ్య విభేదాల కోసం కాదు. ఈ గీతం దేశంలోని గంగా జమునా సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. స్వాతంత్య్ర సమరంలో దేశ ప్రజలు దేశ భక్తితో మతాలకు అతీతంగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తే ఇప్పుడు బీజేపీ దీనికి మతం రంగం పులుముతోంది. వందేమాతరం గీతం దేశ భక్తి, మత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, భావ ప్రకటనకు ప్రతీకగా నిలిచింది. అయితే వీటిలో ఏ ఒక్కటినీ ఆచరించని బీజేపీ ఇప్పుడు వందేమాతరం గీతంపై రాజకీయాలు చేయడం హాస్యాస్పదం.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అధికారం చెలాయిస్తున్న బీజేపీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వందేమాతరం గీతాన్ని వివాదాస్పదం చేసే కుట్రలకు తెరలేపింది. వందేమాతరం అనేది దేశ ప్రజలందరికీ చెందిన భావన. ఈ గీతాన్ని దేశ విభజన కోసం కాదు. దేశ ప్రజల ఐక్యతకు స్ఫూర్తిగా తీసుకోవాలి. వందేమాతరాన్ని ద్వేషాల కోసం కాకుండా ప్రేమానురాగాలు పంచేందుకు వినియోగించుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితో, ప్రజాస్వామ్య విలువలతో, సమానత్వ భావనతో కలిసికట్టుగా సాగినప్పుడే ‘వందేమాతరం’ అర్థం సార్థకమవుతుంది.