Newsminute24

Castcensus: కులగణనపై మోదీ యూ-టర్న్ ఎవరికి లాభం?

Castcensus: దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కులగణన డిమాండ్లు వినిపిస్తున్నా… హిందువులంతా ఒక్కటే అని చెప్తూ వచ్చిన బీజేపీ, ఎవరూ ఊహించని విధంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జనాభా లెక్కలతోనే కులగనణ చేపట్టాలని తీర్మానించింది. కులగణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతిపక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనుందా? అనే చర్చ మొదలైంది.

మన దేశంలో మతం కన్నా కులమే బలమైనది. ఏ రాష్ట్రంలో చూసినా కులం చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. అందుకే, కులాల బలాలు ప్రజలకు తెలియనీయకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతూ వస్తున్నాయి. మన దేశంలో బ్రిటిష్ హయాంలో 1931లో చివరిసారిగా జనాభా లెక్కలతోనే కులగణనను నిర్వహించారు. స్వాతంత్య్రం తర్వాత 1951లో నిర్వహించిన జనగణనలో కులగణనను తొలగించారు. దీంతో 1931లో నమోదైన కులగణన ప్రకారమే ఇప్పటికీ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు! 2011లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కులగణన కోసం సామాజిక ఆర్థిక సర్వే చేపట్టింది. కానీ, రాజకీయ ఎత్తుగడల మధ్య ఆ డేటాను విడుదల చేయలేదు. తర్వాత అధికారం కోల్పోయిన కాంగ్రెస్… సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నా… బీజేపీ పట్టించుకోనట్టే వ్యవహరించింది.

బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆర్ఎస్ఎస్, ముందు నుంచి కులగణనను వ్యతిరేకిస్తోంది. కులాలకు అతీతంగా హిందువులను ఒకే గొడుగు కింద ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ఆర్జేడీ-జేడీ(యు) కూటమి ప్రభుత్వం బీహార్ లో కులగణను చేసినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన చేసినప్పుడు కూడా కుల ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యతిరేకించాయి. ప్రతిపక్ష పార్టీలు కుల విభజనలను రెచ్చగొట్టి ఎన్నికల లబ్ధి పొందుతున్నాయని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో “బటెంగే తో కటెంగే” (విడిపోతే… చంపబడతాం) అనే నినాదంతో కులగనణను డిమాండ్ తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి మోదీ కూడా ఈ ప్రచారంలోనే “ఏక్ హైం తో సేఫ్ హైం” (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అనే నినాదంతో కులగణనను వ్యతిరేకించారు.

కులగణనపై వ్యతిరేకత ఈ రోజు మొదలైంది కాదు. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వం కులగణన చేసిన సమయంలోనూ హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కులగణనను వ్యతిరేకించేవి. స్వాతంత్ర్యం తర్వాత జనాభా లెక్కల నుంచి కులగణన తీసేయడంతో… సోషలిస్టు పార్టీలు కులగణన డిమాండ్ ని కొనసాగిస్తూనే వస్తున్నాయి. 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించడానికి మండల్ కమీషన్ ఏర్పాటు చేసింది. 1980 నాటికి మన జనాభాలో 52 శాతం ఓబీసీలు ఉన్నట్టు ఈ కమీషన్ గుర్తించింది. ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసు ప్రకారం ఈ 27 శాతం కలుపుకుని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీల రిజర్వేషన్లు మొత్తం 49 శాతానికి చేరతాయని నివేదిక సమర్పించింది. కానీ, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోవడంతో తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు కాపాడుకోవడానకి ఈ నివేదికను ఆమోదించకుండా పక్కనపెట్టాయి.

1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం మండల్ కమీషన్ నివేదిక అమలు చేస్తామని ప్రకటించిగానే దేశ వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి తోడు అప్పుడే బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రామ రథయాత్ర, హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించి రక్తపాతాన్ని మిగిల్చాయి. దాంతో ఆ డిమాండ్ అక్కడే ఆగిపోయింది. 2011లో కులగణన తెరపైకి వచ్చాక డిమాండ్లు మరింత పెరిగాయి. అయినా బీజేపీ ఈ పదకొండేళ్లలో వెనక్కి తగ్గలేదు. 2024 లోక్సభ ఎన్నికల ముందు, కుల గణన డిమాండ్ చేస్తున్నవారిని “అర్బన్ నక్సల్” అని మోదీ విమర్శించారు. ఇప్పుడు తన యూ టర్న్ కి ఆయన ఏమని సంజాయిషీ చెప్పుకుంటారు? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, బీజేపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ కులగణన డిమాండ్ చేసేవారిని ఉగ్రవాదులతో సమానమని దాడి చేశాయి. దీనిని వాళ్లు ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు?

తెలంగాణ, కర్ణాటకలో చేపట్టిన కులగణనతో దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం డిమాండ్లు పెరిగాయి. దీనికి తోడు ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునేలా బీజేపీపై ఒత్తిడి పెరిగింది. బిహార్లో 2015లో నీతీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో మొత్తం జనభాలో 65 శాతం ఓబీసీలని తేలింది. ఈ నేపథ్యంలో ఓబీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ప్రతిపక్ష సామాజిక న్యాయ ఎజెండాను నియంత్రించడానికి బీజేపీ కులగణనకు ఒప్పుకుని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్న అనుమానం ఉంది.

ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయంపై సంయమనంతో స్పందిస్తూ, కులగణన రాజకీయ సాధనంగా మారకూడదని, శాస్త్రీయంగా, సామాజిక అసమానతలను తొలగించేందుకు మాత్రమే జరగాలని చెప్పింది. ఈ స్పందన వారి అంతర్గత అసౌకర్యాన్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు రోజే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి తన యూ-టర్న్ గురించి ఆయనతో చర్చించే ఉంటారు. కాబట్టి, ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక మార్పు కాదని, ఎన్నికల ఒత్తిడి వల్ల తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రమేనని స్పష్టమవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వైఫల్యాల నుండి దేశం దృష్టిని మళ్లించేందుకు ఈ ప్రకటన ఒక రాజకీయ ఎత్తుగడగా కూడా భావించవచ్చు.

2014 నుండి దేశంలో బీజేపీ తన బలం పెంచుకుంటూ వస్తోంది. కానీ, తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వెనుకబడిన వర్గాల మద్దతు చాలా కీలకం. బీజేపీలో అత్యధిక శాతం నాయకులు అగ్రవర్ణాలే ఉన్నారు. కాబట్టి, కులగణన వల్ల ఓబీసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు కూడా అధికారంలో తమ వాటాను డిమాండ్ చేస్తే, పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. 1990ల తర్వాత ఓబీసీలను హిందుత్వ గొడుగు కిందకు తీసుకురావడాన్ని అగ్రవర్ణాలు ఒప్పుకున్నప్పటికీ, అన్ని వర్గాలకు సమాన అధికార పంపకం అంటే మాత్రం వారు సుముఖంగా ఉండకపోవచ్చు.

కులగణన డిమాండ్ను కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలు గట్టిగా ముందుకు తీసుకెళ్లడంతో బీజేపీపై ఒత్తిడి పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజవాదీ పార్టీ ‘పీడీఏ’ (పిఛ్చడ, దళిత్, మైనారిటీలు) వ్యూహం బీజేపీని ఓడించడంలో విజయవంతమైంది. ఇండియా కూటమి ఎక్కువ కులాలు, సముదాయాలను ప్రాతినిధ్యం వహిస్తుందనే అభిప్రాయం బీజేపీకి ప్రతికూలంగా మారింది. బీజేపీ రోహిణి కమీషన్, రాఘవేంద్ర కుమార్ ప్యానెల్ వంటి ఓబీసీ ఉప-వర్గీకరణ ప్రయత్నాలు చేసినప్పటికీ, వాటి నివేదికలను విడుదల చేయలేదు. దీనికి విరుద్ధంగా, ప్రతిపక్షం కులగణనకు నిబద్ధత చూపిస్తూ… ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన జరిపించి, బీజేపీ శిబిరంలో రాజకీయ ఒత్తిడిని పెంచాయి.

ఈ నిర్ణయం బీజేపీకి స్వల్పకాలిక రాజకీయ లబ్ధిని ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కులగణన హిందుత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా, కుల ఆధారిత రాజకీయాలను మరింత బలపరుస్తుంది. ఇది మండల్ 3.0 ఆవిర్భావానికి దారి తీసే అవకాశం కూడడా లేకపోలేదు. కులం మన దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా కొనసాగుతోంది. దానిని మతం పేరు చెప్పి తొలగించలేం. ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక పునాదులను కదిలించి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలకు నైతిక విజయాన్ని అందించింది. అయినప్పటికీ, 2021లోనే నిర్వహించాల్సిన జనగణన ఇప్పటికీ జరగలేదు. ఈ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టత లేదు. కాబట్టి, ఈ నిర్ణయం అమలు పట్ల ఉన్న సందేహాలను కొట్టిపారేయలేం!!

==========


– *జి. శ్రీలక్ష్మి*
రీసెర్చర్, పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ

Exit mobile version