Site icon Newsminute24

Apnews: ‘గుడివాడ సంధి’ ఎప్పుడు గుడివాడ జంక్షన్‌ గా మారిందో ఎవరు చెబుతారిప్పుడు?

Nancharaiah merugumala senior journalist:

మా గుడివాడ మిత్రుడు మల్లవల్లి సత్యనారాయణ బాబు గంట క్రితం గుడివాడ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి ప్రణాళిక గురించి పెట్టిన పోస్టు చదివాక 56–57 ఏళ్ల క్రితం అంటే నాకు పదేళ్ల వయసు నాటి (1966–67) ముచ్చట గుర్తొచ్చింది. అప్పట్లో ఓ రోజు ఉదయం మా అమ్మ సంపూర్ణంతోపాటు నేను, మా చెల్లి నాగరత్నం గుడివాడ రైల్వేస్టేషన్‌ కు వెళ్లాం. బెజవాడ వెళ్లే ప్యాసింజరు రైలెక్కి ఉప్పలూరులో దిగి చుట్టాల (మా అమ్మ చిన్న నాయనమ్మ మాగంటి–లోయ సిరిదేవమ్మ) ఇంటికెళ్లడం మా ప్లాన్‌. అప్పుడు నేను స్టేషన్‌ ఆవరణలో పెట్టిన చెక్క బోర్డులపై గుడివాడ జంక్షన్‌ అని తెలుగు, ఇంగ్లిష్‌ అక్షరాలతో రాసిన మాటలు శ్రద్ధగా చదివాను. ఆ పసుపు పచ్చని పెయింట్‌ కింద ‘గుడివాడ సంధి’ అని చెక్కిన తెలుగు అక్షరాలను గమనించి గుర్తించాను. అంటే అంతకు ముందు జంక్షన్‌ అనే మాటకు కొంత కాలం రైల్వేవాళ్లు ఈ సైన్‌ బోర్డులపై సంధి అని తర్జుమా చేసి రాశారని అర్ధమైంది. ‘గుడివాడ సంధి’ అని చెక్కిన అక్షరాలపై కొత్త రంగేసి గుడివాడ జంక్షన్‌ అని ఆధునికీకరించారని అప్పుడు ఊహించుకున్నా. మరి ఈ రైల్వే సైన్‌ బోర్డుల్లో పదాల మార్పు సంగతి గురించి ఇప్పుడు ఎవరు వివరిస్తారు?

Exit mobile version