Newsminute24

‘రామోజీరావు’ యూనీఫాం సివిల్‌ కోడ్‌ వ్యతిరేకిస్తారేమో!

Nancharaiah merugumala senior journalist: 

“ఉమ్మడి పౌర స్మృతి వస్తే అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్యూఎఫ్‌) నడిపే సంస్థలకు పన్ను రాయితీలు రద్దవుతాయి..ఈ లెక్కన హెచ్‌ యూ ఎఫ్‌ ‘కర్త’ రామోజీరావు గారు కూడా మరి యూనీఫాం సివిల్‌ కోడ్‌ ను వ్యతిరేకిస్తారేమో!”

ఉమ్మడి పౌర స్మృతిని (యూనీఫాం సివిల్‌ కోడ్‌–యూసీసీ) కాంగ్రెస్, కమ్యూనిస్టులు మొదలు తీవ్ర లౌకికవాద పార్టీలమని చెప్పుకునే అన్ని రాజకీయపక్షాలూ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ముస్లిం మైనారిటీల కొంప ముంచుతుందని గగ్గోలు పెడుతున్నాయి. అయితే, ఈ లౌకిక పార్టీల వాదనలో పసలేదనీ, యూసీసీని వ్యతిరేకించకూడదని ప్రఖ్యాత రాజకీయ ఆలోచనాపరుడు, స్వరాజ్‌ ఇండియా స్థాపకుడు యోగేంద్ర యోదవ్‌ తన తాజా వ్యాసంలో రాశారు. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లోనే రాసుకున్నామని, 1947 నాటి దేశవిభజన కారణంగా యూనీఫాం సివిల్‌ కోడ్‌ తీసుకురాలేకపోయామని ఆయన గుర్తుచేశారు. ఈ పౌరస్మృతి వల్ల స్త్రీపురుష సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం వస్తుందని కూడా ఆయన సవివరంగా వాదించారు. గతంలో మాదిరిగానే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఉమ్మడి పౌర స్మృతి విషయంలో కూడా తిరోగమన, అభివృద్ధి నిరోధక వైఖరితో పాలకపక్షమైన బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తున్నాయనీ, హిందుత్వ శక్తుల వలలో ఇవి పడ్డాయని యోగేంద్ర విమర్శించారు. యూసీసీని ముస్లిం ఛాందస శక్తులేగాక, హిందూ సాంప్రదాయ శక్తులు కూడా వ్యతిరేకిస్తాయని ఆయన గుర్తుచేశారు. అవిభక్త హిందూ కుటుంబాల (హెచ్‌ యూ ఎఫ్‌) యాజమాన్యంలో నడిచే వ్యాపార సంస్థలకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎన్నో పన్ను రాయితీలు లభిస్తున్నాయి. మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీ రావు గారి నేతృత్వంలో నడిచే వ్యాపార సంస్థలన్నీ ఆయన ‘కర్త’గా కీలకపాత్ర నిర్వహించే అవిభక్త హిందూ కుటుంబ (హెచ్‌ యూ ఎఫ్‌) సంస్థలే. ఈ విషయం నాటి రాజమండ్రి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ 2006 నవంబర్‌ మొదటి వారంలో రామోజీరావు కర్తగా ఉన్న హెచ్‌ యూ ఎఫ్‌ సంస్థ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ (ఇప్పుడిది లేదు) బయటి వ్యక్తుల నుంచి డిపాజిట్ట సేకరణలోని లోటుపాట్లు, రిజర్‌ బ్యాంక్‌ నిబంధనల ఉల్లంఘనలపై పూర్తి వివరాలతో ఆరోపణలు చేసినప్పుడు తెలిసింది. ఈనాడు గ్రూప్‌ సంస్థలు హెచ్‌ యూ ఎఫ్‌ కర్త హోదాలో రామోజీరావు గారు నడిపే సంస్థలని అప్పటి వరకూ సామాన్య తెలుగు బ్రామ్మణ మేధావులకు సైతం తెలియదు. ఏమాటకామాట రాజమండ్రి చివరి బ్రాహ్మణ లోక్‌ సభ సభ్యుడు ఉండవల్లి ద్వారానే సకల తెలుగు ప్రజానీకానికి రామోజీరావు హెచ్‌ యూ ఎఫ్‌ ‘కర్త’ అనే సమాచారం అందింది. మరి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి రూపొందించే క్రమంలో అవిభక్త హిందూ కుటుంబాల వ్యాపార సంస్థలకు పన్ను రాయితీలు రద్దు చేస్తే రామోజీ కర్తగా ఉన్న మీడియా సంస్థలు ఎలాంటి వైఖరి తీసుకుంటాయో చూడాలి.

Exit mobile version