ఆర్. దిలీప్ రెడ్డి( పొలిటికల్, స్పోర్ట్స్ ఎనలిస్ట్, ): ఆటల్లో నాకు నచ్చే అనేకానేక విషయాల్లో… వింబుల్డన్ సెంటర్ కోర్ట్ ప్రేక్షకుల నిమగ్నత ఒకటి. మరచిపోయి మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నట్టు అప్పుడప్పుడు… లయగా కొట్టే చప్పట్లు తప్ప, ఎక్కువ మార్లు నిశ్శబ్దంగా, తదేకంగా అటనే చూస్తుంటారు. లీనమైపోతారు. కూచున్నచోటు నుంచి లేచి తిరిగే కదలికలూ తక్కువే! వారి ఓపికకు మెచ్చుకోవాలి…అత్యధికులు, ఆద్యంతం, ఆనందపు ముఖాలతో ఆటను ఆస్వాదిస్తూవుంటారు. వారిని అలరిస్తూ… ఇవాళ, కార్లస్ ఆల్కరజ్ ఆడిన ఆట ఓ అద్భుతం. వింబుల్డన్ తాజా ఎడిషన్ ఫైనల్లో అతగాడు ప్రపంచ మేటి ఆటకాడైన జొకోవిచ్ ను తొణక్కుండా ఎదుర్కొని, దీటుగా ఆడి, ధీరోదాత్తంగా ఓడించిన తీరు కడదాకా రసవత్తరంగా సాగింది. రోజంతా… నలభై కుటుంబాలతో ఓ ‘వనవిహార్’ తిరిగొచ్చి, నేనెంతో అలసటతో వున్నా, మన అర్దరాత్రి దాకా నన్ను ఈ ఆట కట్టిపడేసిందంటే నమ్మండి.
సెర్బియన్ వీరుడి సుదీర్ఘ అనుభవాన్ని ఆకళింపు చేసుకుంటూ, ఆ క్రమంలో తొలిసెట్ 1-6 తో ఓడినా, గొప్ప పోరాట పటిమతో…. రెండోసెట్ టైబ్రేకర్ 7-6(8/6) తో గెలిచి స్కోర్ సమం చేశాడు ఆల్కరజ్. అదే ఊపులో మూడోసెట్ 6-1 తో గెలిచి, ప్రతీకారం తీర్చుకున్నా…. జొకోవిచ్ తన అనుభవ సారాన్నంతా రంగరించి నాలుగోసెట్ 6-3 తో గెలిచి, మళ్లీ స్కోర్ ని (2-2 సెట్లు) సమం చేశాడు. దాంతో ఉత్కంఠ పెరిగింది. అప్పుడిక ఐదో నిర్ణాయక సెట్ కీలకమైంది. తొణకని దీక్ష, పట్టుదలతో తుది సెట్ 6-4తో గెలిచి…. ఆల్కరజ్ ఓ చరిత్ర సృష్టించాడు. పచ్చికపై ఓ కొత్త చాంపియన్ అవతరించాడు. అపార ప్రతిభ పునికిపుచ్చుకున్న క్రొన్నెత్తురు, వయసు పైబడుతున్న ఓ మలెవడ్డ అనుభవాన్ని క్యాలెండర్ లో పేజీ మారినట్టు… అధిగమించింది.
సెల్యూట్ ఆల్కరజ్ !
(ఫోటోలు: టీవీ స్క్రీన్ నుంచి గ్రాబ్ చేసినవే! )