telangana: బిఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్సీ కవిత సిద్ధమైనట్లు తెలుస్తోంది.మేడే సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేసీఆర్ ఫోటో కనపడకపోవడం.. ఆయన స్థానంలో ప్రోఫెసర్ జయశంకర్ ఫోటో దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇటీవల బిఆర్ఎస్ రజతోత్సవ సభలో ఎదురైన అవమానంతో తగ్గేదేలే అన్నట్లు రాజకీయ ప్రయాణం ఉండబోతోందని కవిత చెప్పకనే చెప్పిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వేరే పార్టీలో చేరతారా లేక తెలంగాణ జాగృతి పేరుతో ఒంటరి పోరాటం చేస్తారన్నది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా కవితపై బిఆర్ఎస్లో కుట్ర జరుగుతోంది. ఆమె చేపట్టిన ఏ కార్యక్రమాల్లోనూ పార్టీ నేతలు కనిపించడం లేదు. బిఆర్ఎస్ పార్టీ ఆదేశాలనుసారమే నేతలు సైతం ఆమె కార్యక్రమాలకు హజరుకావడం లేదు. రాజకీయంగా పొంచి ఉన్న ముప్పును గ్రహించిన ఆమె భవిష్యత్ పై దృష్టిసారించింది.తాజాగా కవిత నివాసంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలుచర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రం సిద్ధించినా.. సామాజిక తెలంగాణ రాలేదు. ఇందుకోసం మేడే స్ఫూర్తిగా తీసుకుని మరో ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం వెనుక ఆమె బిఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నట్లు తేలిపోయింది. తెలంగాణ వచ్చాకా పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉంది. అయినా సామాజిక తెలంగాణ ఏర్పడలేదనే కవిత మాటలు చూస్తుంటే బిఆర్ఎస్ కి అల్టిమేటం జారిచేసిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.