తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అధిష్టానం గరం గరంగా ఉందా? ఓపక్క రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరుగుతుంటే ..ఉన్నపలంగా ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కావడం వెనక దాగున్న మర్మం ఏంటి? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం కావడం.. నేతల మధ్య విభేదాలు వంటి అంశాలపై పార్టీ అధినాయకత్వానికి అందిన రిపొర్టులో ఏముంది?
బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం .. బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం.. నేతల మధ్య విభేదాలపై కమల దళపతి క్లాస్ పీకాడు అన్నదాంట్లో నిజమెంత?
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో కమల దళపతి , కేంద్ర హోమంత్రి అత్యవసర భేటిపై రకరకాల ఊహాగానాలు ఉపందుకున్నాయి. రాష్ట్ర పార్టీలో సమన్వయం,చేరికలు, భవిష్యత్ కార్యచరణ ప్రధాన అజెండాగా సమావేశం జరిగిందని పైకి కమలనాథులు చెబుతున్నా.. అధినాయకత్వం మాత్రం రాష్ట్ర నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని పదేపదే రాష్ట్ర ఇన్ చార్జులు బన్సల్ , తరుణ్ ఛుగ్ చెబుతున్నా.. నేతలు పెడచెవిన పెట్టడంపై అమిత్ షా గట్టిగానే క్లాస్ పీకినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కమలదళపతి మూడు నెలల పాటు ఏయే కార్యక్రమాలు ఎలా చేయాలో రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది.
అటు పార్టీలో నేతల మధ్య విభేదాలపై తనకు అందిన రిపొర్టు ఆధారంగా అమిత్ షా నేతలను కడిగిపారేసినట్లు తెలిసింది. వ్యక్తిగత అజెండాలు ఏమైనా ఉంటే పక్కనపెట్టాలని..15 రోజులకోసారి భేటి అవుతానని ..ఇక నుంచి నా దృష్టి అంతా తెలంగాణపైనే. అక్కడ పార్టీ గెలుపే లక్ష్యంగా మీరంత ముదుకు సాగాలి.. పాత కొత్త నేతలనే తేడాలు వద్దు.. అంటూ రాష్ట్ర నాయకత్వానికి షా ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
ఇక తెలంగాణలో అధికార బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాషాయం నేతలు మెతకవైఖరి ప్రదర్శించడంపై కమలదళపతి సీరియస్ అయినట్లు తెలిసింది. ముఖ్యంగా కేజీ టూ పీజీ ఉచిత విద్య, పోడు భూములకు పట్టాలు, ధరణితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎండగట్టకపోవడంపై ఆయన భేటిలో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రజాసమస్యలపై ప్రణాళిక ప్రకారం ఉద్యమించాలని అమిత్ షా చెప్పడం వెనక.. నేతల పనితీరు ఆయన అసంతృప్తికి కారణంగా భావించవచ్చు.
తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు.. రాష్ట్ర బీజేపీ నేతల పనితీరు.. ప్రజాసమస్యల వంటి విషయాలపై గట్టినిఘా పెట్టిన బీజేపీ అధినాయకత్వం.. సొంత సర్వే రిపొర్టు ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని కమలదళం గట్టి పట్టుదలతో ఉంది.