Newsminute24

‘బలగం’ కు ఉన్న బలమేమిటీ?

Narsim Cartoonist :  అటు ప్రేక్షకులు, ఇటు మేధావుల మెప్పుతో పాటు కలెక్షన్లలో కూడా ‘జయహో’ అనిపించుకుంటున్న “బలగం” చూస్తుంటే తెలుగులో చిన్న సినిమాకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం మిగతా అన్ని రకాల కళలు విజయాలు సాధించాలన్నా, కలకాలం నిలిచి ఉండాలన్నా ముఖ్యంగా అవి ప్రజలతో కనెక్ట్ కావాలి. “బలగం”- అట్లా కనెక్ట్ అయిన సినిమా, ఒక ఎమోషనల్ కనెక్షన్. తెలంగాణా మాండలికంలో, అచ్చంగా తెలంగాణ సినిమానే అయినా ఒక్క తెలంగాణాకే కాక అన్ని ప్రాంతాల ప్రజలకు కనెక్ట్ అయింది. ప్రజల సినిమా అయింది. బలగం గురించి చాలామంది మిత్రులు చర్చించారు, రాశారు. నేను ఈ సినిమా రెండుసార్లు చూశాను, కాస్త లేటుగా. నాకు అడవిలోకి వెళ్లడం అంటే ఇష్టం, అందుకే ‘వనవాసి’ నవల చాలాసార్లు చదువుతుంటాను. అలాగే ‘పల్లె’ అంటే ఇష్టం, ఈ బలగం అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఒకప్పుడు ‘లవకుశ’ సినిమాకి పల్లెటూర్ల నుండి బండ్లు కట్టుకొని టౌన్ కొచ్చి చూసే వాళ్ళని చెబుతుండేవాళ్లు, ఇప్పుడు బలగానికి అదే ట్రెండ్ వచ్చిందని వినపడుతుంది. థియేటర్ సౌకర్యం లేని చిన్న చిన్న ఊళ్ళల్లో, కావాలంటే స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రొజెక్టర్తో ఈ సినిమా చూపిస్తామని, ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా చెప్పినట్టు చదివాం. ఇంతగా ప్రజలు ఎగబడి ఈ సినిమాను ఎందుకు చూద్దామని అనుకుంటున్నారు? ఎందుకు ఇంతగా సొంతం చేసుకుంటున్నారు? అంటే, ఇది వాళ్ళ సినిమా, వాళ్ళ ఊరి కథ, వాళ్ళ యాసలో వాళ్ళ ఇంట్లోని కథే.

ఇటువంటి సినిమాలకు మొకమాచి పోయి ఉన్న జనాలు, టీవీలో ఓటీటీలలో వచ్చే సినిమాలు పక్కన పెట్టి, ధియేటర్ కెళ్ళి ఈ సినిమా చూడాలనుకోవడం ఈ సినిమాలో తమను, తమ స్థానికతను, మూలాలను గుర్తు పట్టుకోవడం వల్లనే. ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు తను ఏదో ఒక పాత్రలో ఉంటాడు. అదీ ఈ సినిమా గొప్పతనం. అందుకే ఓన్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా కథ, కథనం, పాత్రలు, పాత్రధారులు, సంగీతం, పాటలు, లోకేషన్లు… లాంటి సినిమా మేకింగ్ విషయానికొస్తే ‘వేణు’ ప్రాణం పెట్టి తీశాడని అనిపించక మానదు. స్క్రిప్టు రాసుకొని దానిని ఎంత ఫేర్ చేసుకున్నాడో, పకడ్బందీగా తెరమీద చూపించడానికి ఎన్నిసార్లు నగషీలు పట్టాడో, ఎంత టైం తీసుకున్నాడో తెలవదు గాని, ప్రతి ప్రేంలో, ప్రతి డైలాగులో, ప్రతి సన్నివేశంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడనిపిస్తది. గుండె నిండా ఊపిరి నింపే అందమైన పల్లెటూరు, ‘ఊరు పల్లెటూరు .. దీని తీరే అమ్మ తీరు..’ అంటూ చక్కని పాటతో సినిమా మొదలయ్యి, అక్కడి నుంచే ప్రతి పాత్ర క్యారెక్టరైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కథలోకి తీసుకెళ్తాడు. ప్రధాన పాత్ర కొమరయ్య చుట్టూతా కథంతా అల్లుకుని ఉంటది- ఆరవై ఉంటుండొచ్చు, ఎంతో చలాకీగా ఉంటడు. తనీడు ఆడోళ్లతో పరాచికాలాడుతూ, ఊరందరితో కలగొలుపుగా ఉండే పెద్దమనిషి (చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దేవరకొండకు పోతే, ‘కేశవులు తాత’ అని ఒక తాత , మాతో బాగా పరాచికాలు ఆడెటోడు, అచ్చంగా ఈ కొమరయ్యలాగానే ఉండెటోడు). కొమరయ్య పెద్ద కొడుకు, అయిలయ్య- వీడు షార్ట్ టెంపర్ అని, బుస్సున కోపం వస్తుందని, గొడవ పెట్టుకోవడానికి వెనక ముందు చూడడని, పొలం దగ్గర ట్రాక్టర్ సన్నివేశంతోనే తెలిసిపోతుంది. మనుమడు సాయిలు -ఊర్లలో పోరగాళ్లు చదువుకోమంటే సరిగా చదువుకోకుండా ఏదో ఒక వ్యాపారం చేసుకుంటానని, తండ్రి తో పొలం అమ్మించి, ఆ పైసలు తీసుకపోయి తగులబెట్టి, ఎక్కడ సెటిల్ గాలేక సతమతమయ్యే బాపతు క్యారెక్టర్- అప్పు చేసి మరీ అంత చిన్న పల్లెటూర్లో , పిజ్జా సెంటర్, తర్వాత కంప్యూటర్ సెంటర్, తర్వాత స్నూకర్ గేమ్ పెట్టడం అంటేనే, వాడు ఎంత తెలివిగల్లోడో అర్థమయితది. పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నంతో అప్పు తీర్చొచ్చులే అనే ఆలోచనలో ఉంటడు. అప్పిచ్చినోడు తన్నడానికి వస్తే ‘పెళ్ళి సెటిలయ్యింది, 15 లక్షలు కట్నం, రెండు రోజుల్లో వరపూజ ఉంటది, కట్నం పైసలు అట్లనే తీసుకొచ్చి నీ చేతులు పోస్తనన్న’ అని మాట ఇస్తడు. ఉన్నట్టుండి కొమరయ్య సచ్చిపోతడు. తాత చచ్చిపోయిండన్న వార్త తెలిసి కూడా ఆ రంధే లేకపోగా “ఈ ముసలోడు ఇప్పుడే చావాల్నా, రేపు గానికి పైసలియ్యక పోతే నా సావయితది” అంటూ కిందమీద పడే క్యారెక్టర్. ఇక కొమరయ్య రెండో కొడుకు మొగిలయ్య తాగబోతోడు, కూతురు లక్ష్మి, ఆమె పెనిమిటి నారాయణ, ఆమె బిడ్డ సంధ్య, నోరూరుకోని కొమురయ్య చెల్లెలు, సాయిలు స్నేహితులు, ఊరి జనాల్లో కొంతమంది ముఖ్యులు….ఇలా ఏ పాత్రకా పాత్ర మన మధ్య ఉన్న మనుషులే అన్నంత సహజంగా ఉంటాయి, ఎక్కడా అతి ఉండదు. చిన్న కథే, కొమరయ్య సావు కంటే ముందు, సావు తర్వాత అంతే. కొమరయ్య బతికి ఉండగా ఊర్లోని పరిస్థితులు, వ్యవసాయం, మనుషుల మధ్య సంబంధాలు, ఆర్థిక విషయాలు, వడ్డీలకు అప్పులిచ్చి, అప్పు కట్టకపోతే తన్నెటోడు, చిట్టీలు పాడుకోవడం, ఆర్ఎంపీ డాక్టర్…ఇలా అన్ని విషయాలు చూపించి ఊర్లోకి తీసుకెళ్తాడు, దర్శకుడు. కొమరయ్య పోయాక, ఆ సావు చుట్టూ ఆ కుటుంబంలో ఉండే ప్రేమలు, కొట్లాటలు, మనస్పర్ధలు, ఊరు కట్టుబాటు అన్ని ముందుకు తీసుకొస్తాడు. కొమరయ్య సావును సెంటర్ పాయింట్ గా చేసుకొని, చిన్న చిన్న విషయాల దగ్గర గొడవ పడి, ఈగోలతో దూరమైన కుటుంబ సభ్యుల్ని ఏకం చేసే దిశగా ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ఫ్రేము, ఒక్కొక్క సన్నివేశం..మధ్య మధ్యలో జనపదాల్లాంటి పాటలు.. చాలా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో, కథను ఎక్కడా తొట్రుపాటు లేకుండా నడిపించుకుంటూ పోతాడు.

ఎక్కడో జబర్దస్త్ వెకిలి ప్రోగ్రాంలో కొట్టుకుపోతున్న వేణు లో ఇంతటి గొప్ప దర్శకుడు ఉన్నాడా అనిపిస్తుంది.
కొమురయ్య దహన సంస్కారాలు అయ్యాక జరిపే మూడోద్దులు, ఐదొద్దుల ఖర్మకాండలో పెట్టే పిండాల్ని ‘పిట్ట’ ముట్టదు. పిట్ట ముట్టక పోతే, కొమరయ్యకేదో బాధ ఉందని, అందుకే పిట్ట ముట్టట్లేదని ఊరంతా అనుకుంటరు. (ఇది ఇప్పటికీ అంతటా, అన్ని కులాల, వర్గాల ప్రజలు పాటించే ఆచారమే.) పదకొండొద్దుల నాడు కూడా పిట్ట ముట్టక పోతే, కొమరయ్య ఆత్మ అక్కడే తిరుగుతుంటదని, అది ఊరికి అరిష్టమని, అందుకని ఆ కుటుంబాన్ని ఊరినుంచి వెలివేయాలని పంచాయితీ పెద్దలు తీర్మానించే దాకా పోతుంది. కొమరయ్యకున్న బాధల్లా చిన్న చిన్న గొడవలతో విడిపోయిన తన కుటుంబమంతా ఒక్క దగ్గరి వచ్చి, ఏకంగా ఉండాలనే కోరికతో అక్కడక్కడే తిరుగుతున్నాడని, ఈ పదకొండొద్దుల తంతులో భాగంగా చెప్పించే బుడగ జంగాల కథలో వినిపిస్తుంది. ఇంటి అల్లున్ని, దసర పండక్కి పిలిచి, సరిగ మర్యాదలు చేయలేదని, నల్లిబొక్క దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి పెద్దదై, బావ బామ్మర్దులు నువ్వెంతంటే, నువ్వెంత అనుకునేదాకా పోయి ఇరవై ఏండ్లు ఎవరికి వారు దూరమై పోతరు. ఉన్న ఒక్క ఆడపిల్లను ఇరవై ఏండ్ల సంది సూడకపోతిని, ఇచ్చుకపోయినోళ్లు ఇప్పటికైనా కలిసిపోండ్రి నాయనలారా అని కొమరయ్య బాధ, అంటూ పాడే బుడగ జంగాల కథ కన్నీళ్లు పెట్టిస్తుంది. అది విన్న కొడుకులు, కోడళ్లు, అల్లుడు ఒక్కొక్కరుగా కుటుంబమంతా ఒక్కదగ్గరికి వచ్చి ఏకం కావడంతో పిట్ట పిండం ముట్టుతుంది. కుటుంబం, ఊరు, అందరూ హ్యాపీ. మనం.. బరువెక్కిన గుండెలతో నలిగిపోయిన, పగిలి పోయిన, ఇచ్చుకపోయిన మన కుటుంబాల్ని ఏకం చేసుకునే పని మీద బయటపడ్తాం. బలగం చూసి చాలా కుటుంబాలు అలా కలిసిపోయాయని చెప్పుకుంటున్నారు. ఇదీ ఈ సినిమా అందుకున్న ఆస్కార్ అవార్డ్. నిజమైన ఆస్కార్ విజేత వేణు.


కాసర్ల శ్యాం రాసిన పాటలు, ఒగ్గుకథ, బుడగ జంగాల కథ, అసలు కథకు ఊపిరి పోసాయి. “ఊరూ పల్లెటూరు..దీని తీరే అమ్మ తీరు, కొంగులోనా దాచిపెట్టి, కొడుకుకిచ్చే ప్రేమ వేరు… తలకు పోసుకుందే నా నెల తల్లీ..నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా..గొడ్డుగోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టేరా..మామ, అత్త, బావ, బాపు వరసల్లే, ఊరంతా చుట్టాల ముల్లే” అంటూ సాగే మొదటి పాట నిండా, “బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో-బంగారు సావు నీది బలరామ నరసయ్యో, అగ్గిలోన తానంజేసి, బుగ్గి అయిపోతివి” అన్న తర్వాతి పాటలోనూ అబ్బురపరిచే కొత్త కొత్త పదబంధాల్ని అలవోకగా అల్లి వదిలాడు, కాసర్ల శ్యాం. ఊరు మీదా, ఆ మనుషుల మీదా ప్రేమ, గౌరవం పుట్టిస్తాయీ పాటలు. ధమాకా లాంటి రవితేజా మార్క్ సినిమాకు ధడధడలాడించే సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో, బలగానికి పిట్టలు, కోయిలలు పాడే ఊరి సంగీతం అద్ది, పాటల్ని అమృతంలో ముంచి తీశాడు మంగ్లీ, రాం మిరియాల, భీమ్స్, వేణు పాటల్ని పల్లెపదాల తీరులో పాడి జనరంజకం చేశారు. కొమరయ్య సావు సందర్భంగా పాడించిన ఒగ్గుకథ, బుడగ జంగాల కథ దేనికదే గొప్ప భావోధ్వేగాల్ని కలిగించిన కళారూపాలు. అవి విని కన్నీళ్లు ఆపకోలేక పోయామని ప్రేక్షకులు పలు చోట్ల చెప్పినట్టు విన్నాం. ఒగ్గుకథ చెప్పిన శ్రీకాంత్ టీం సిరిసిల్లకు, బుడగ జంగాల కథ చెప్పిన కొమరమ్మ, మొగిలి వరంగల్ దుగ్గోండి కి చెందిన జానపద కళాకారులు. ఇక మాటల విషయానికొస్తే తెలంగాణ పల్లెల్లో మాట్లాడే భాష, యాస సినిమాను జనాలకు మరింత దగ్గరగా తీసుకెళ్లింది. ఈ సినిమాలో నటించిన వాళ్లలో ఒక్క ప్రియదర్శి తప్ప ఎవరూ నటులు కాదు. నారాయణ పాత్రధారి మురళిధర్ గౌడ్ కు ఇది రెండవ సినిమా. కానీ అందరూ దిగ్గజాలే. ఇలా సినిమా మొదటి నుండి చివరిదాకా సహజత్వానికి, స్థానికతకు పెద్ద పీటవేసి ప్రజల సినిమాగా తీర్చిదిద్దిన వేణు, వేణు బృందానికి హాట్సాఫ్. వేణు రెండో సినిమాకి మరింత కష్టపడాల్సి వస్తది, బాధ్యత పెరిగింది. ఒక పెద్ద నిర్మాత ‘ఓకే’ చెబితే, టాప్ స్టార్లను పెట్టి, వందల కోట్ల బడ్జెట్ తో సుమోలు గాల్లోకి ఎగిరే సినిమాలు కాకుండా ప్రజల బాధల్ని అడ్రెస్ చేసే బలగం, జై భీం లాంటి సినిమాలు రావాలి.


ఇక ఆత్మ, పిండాలు, పిట్ట ముట్టడాల్లాంటివి మూఢనమ్మకాలే, కానీ ఈ సినిమా వాటిని మరింత ప్రచారం చేస్తుందని విమర్శించడం అన్యాయం. మనమింకా ఈ ఆచారాల్ని, మూఢనమ్మకాల్ని వదుకోలేదు, ఈ ఆధునిక సాంకేతిక యుగం లో కూడా , చిన్న పల్లె నుంచి మెట్రో సిటీల దాకా ఇంకా ఇవి కొనసాగుతూనే ఉన్నవి. ఒక కుటుంబాన్ని, ఒక ఊరిని మంచి మార్పు వైపు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఈ సందర్భాన్ని ఎన్నుకోవడం ఒక చక్కని స్ట్రాటజీ. ఎందుకంటే ఇటువంటి ఎమోషనల్ సందర్భంలోనే మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి. సినిమాలో కూడా ఎక్కడ నాటకీయత లేకుండా చాలా సహజంగా ఆ కుటుంబం కలిసిపోయినట్టుగా చూపిస్తాడు, దర్శకుడు. ఇటువంటి ఆచారాలు, కట్టుబాట్ల మధ్య పెరిగిన పల్లె ప్రజలకు, సమస్యను వాళ్ల పద్ధతిలో చెబితేనే అర్థం అవుతుంది, యూనివర్సిటీ ప్రొఫెసర్లు వచ్చి లెక్చర్లు, పాఠాలు, సిద్ధాంతాలు చెప్తే వాళ్ళకి ఎక్కవు. అందుకే గద్దర్ ప్రజల సమస్యలను వాళ్లకు తెలిసిన భాషలో, పల్లె పాటల రూపంలో బాణీలు కట్టి, గోచి గొంగడి కట్టుకొని ఆడి పాడితేనే ఆ పాటలు ప్రజల దగ్గరకు వెళ్లాయి. ఇక్కడ కూడా అంతే. ఇక ఈ సినిమా స్థలకాలాదుల దృష్ట్యా చూసుకున్న 20-25 ఏండ్ల కిందటి కథ. ఎందుకంటే కొమరయ్య శిలాఫలకం మీద జననం:1945 అనే ఒక్క సంఖ్యే లీలగా కనిపిస్తుంది, అంటే కొమరయ్యకు 55-60 ఉంటే 2000-2005 అవుతుంది. కొమరయ్య చిన్న కొడుకు సూరత్ కు వలస పోతాడు, టెక్స్ టైల్స్ మిల్లుల్లో పనిచేయడానికి సూరత్, పూనే కు మైగ్రేట్ అవుతున్న టైం కూడా అదే. అప్పటికి మన పల్లెలు కోకాకోలాలు తాగుతున్నవేమో కానీ మూఢనమ్మకాల నుంచి బయటపడేంత ప్రోగ్రెసివ్ కాలేదు.

PS: బలగంలో మూఢనమ్మకం పరిమాణం పిట్టంతే, కానీ ఫలితం ఊరంత పెద్దది. పిట్టను కాదు చూడాల్సింది-ఊరినీ,మనషులనీ. పుల్లలు పెట్టకుండా ఇటువంటి విలువలున్న, నిజాయితీగా తీసే చిన్న సినిమాలను ఆహ్వానిద్దాం..!

Exit mobile version