BJPTelangana:‘’14 వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు….కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? తెలంగాణ ఉద్యమ సమయంలో తిండికి లేక ముతక చొక్కాలేసుకుని తిరిగిన మీ కుటుంబానికి వేల కోట్లు ఎట్లా వచ్చినయ్. నీ దుర్మార్గపు పాలనలో తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్లెట్లా అయ్యారు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు గురువారం సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ నేతలు అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బండి.. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి బండి సంజయ్ తో కలిసి ఐబీ గెస్ట్ హౌజ్ నుండి పోతిరెడ్డిపల్లె చౌరస్తా వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు నడిచారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉండేది 5 నెలలే… ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వకుండా, 317 జీవో పేరుతో చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి అరిగోస పెట్టిండు… రుణమాఫీ ఇవ్వకుండా, ఫ్రీ యూరియా ఇవ్వకుండా పంట నష్టపోయినా పరిహారం ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నడు. రక్షణ లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు.