Newsminute24

Telangana: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు…!!

హైదరాబాద్, జూలై 13:
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక ఆర్డినెన్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు బీసీ సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర బీసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను వెల్లడించారు:

“శతాబ్దాల బీసీ ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఇది సాధ్యమైంది.బీసీ రిజర్వేషన్లు ఒక సామాజిక న్యాయ యజ్ఞం. గతంలో దళితులు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు బీసీలకు కూడా పూర్తి న్యాయం చేస్తోంది.”

రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర”లో కులగణన నిర్వహిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ:

“రాహుల్ గాంధీ మాట మాకు శిలాశాసనం. నాయకుడు మాట ఇస్తే, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిది. అన్ని విభాగాలతో చర్చించి, పారదర్శకంగా కులగణన పూర్తి చేశాం. ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించాం,” అని తెలిపారు.

“తెలంగాణ మోడల్ కులగణనను దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిపేలా రాహుల్ గాంధీ, ఖర్గే సూచిస్తున్నారు. బీజేపీ మాత్రం గతంలో సుప్రీంకోర్టులో కులగణనకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చింది.”

బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై దుయ్యబట్టిన సీఎం రేవంత్ రెడ్డి:

“బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని జంతర్ మంతర్ వద్ద 16 పార్టీలు మద్దతు తెలిపిన ధర్నా చేశాం. మన ఒత్తిడి వల్లే కేంద్రం 2026 జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయించింది.
బీజేపీకి చిత్తశుద్ధి లేదు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాల్సింది. మోదీ స్థానంలో రాహుల్ గాంధీ ఉంటే 48 గంటల్లోనే రిజర్వేషన్లు సాధించేవాడిని.”

“బీసీ రిజర్వేషన్ల కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం. అర్థరాత్రి అయినా మంత్రివర్గాన్ని సమావేశం చేస్తా. నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. నా నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు.”

హైకోర్టు నిర్ణయం ప్రకారం నెల రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన సందర్భంలో సీఎం స్పందించారు:

“ఇంత కాలం ఎన్నికలు వాయిదా వేసింది 42% రిజర్వేషన్ల కోసమే. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ చట్టం 50%కు మించి రిజర్వేషన్లను నిరాకరించింది.
అప్పటి మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ ఈ చట్టానికి బాధ్యులు. ఇప్పుడు కేసీఆర్ వారినే మాపైకి ఎగదోస్తున్నాడు.”

ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఆ నిబంధనను సవరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు.

“బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే వారిని సామాజికంగా బహిష్కరించాలి. కోర్టులో వాదించేందుకు ఢిల్లీ నుంచి ఉద్దండులైన న్యాయవాదులను నియమిస్తాం.
కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.
2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవ్వాలి, అప్పుడు మాత్రమే ఇది పూర్తి విజయంగా పరిగణించాలి,” అని సీఎం స్పష్టం చేశారు.

Exit mobile version