Tcongress: జనగామ నియోజక వర్గం నర్మెట్టలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పీపుల్స్ మార్చ్ లో భాగంగా భట్టి హన్మంతాపురం వస్తున్నారని తెలుసుకున్న రైతులు.. రహదారిపై నిలబడి.. కల్లాల్లో మా ధాన్యం పరిస్థితులు చూడాలని కన్నీటితో గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి భట్టి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చి పదిరోజులయింది.. వర్షానికి తడవడం.. ఎండకు ఆరబెట్టడం.. ప్రతి రోజూ ఇదే పరిస్థితని భట్టికి చెప్పుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.
కాగా ఓ మహిళా రైతు రేఖ మాట్లాడుతూ.. ధాన్యాన్ని ఎండబెట్టి సంచుల్లో నింపామని.. ఈ అకాల వర్షంతో మొత్తం ధాన్యం తడిసిపోయిందని చెప్పుకొచ్చింది. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసుంటే మా బతుకులు బాగుపడేవని ఆమె ఆవేదనగా చెప్పారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని.. వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని భట్టి విక్రమార్క మహిళ రైతుకు హామీ ఇచ్చారు.