BJPKarimnagar: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. స్వయం ప్రకటిత మేధావి గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించిందేమీలేదని.. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినప్పటికీ వినోద్ కుమార్ బుద్ది మారలేదని మండిపడ్డారు. జనం మెచ్చిన నాయకుడి పై విషం కక్కుతూనే ఉన్నారని.. బండి సంజయ్ తిట్ల పురాణం బంద్ చేయాలని పచ్చి అబద్దాలు వల్లిస్తున్నరని దుయ్యబట్టారు. బూతులకు, తిట్లకు కేరాఫ్ అడ్రస్ కేసీఆరే అయితే.. నీతులు చెప్పేది మీరా అని ప్రశ్నించారు? కమిషన్లకు కక్కుర్తి పడి కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని.. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినోద్ కుమార్ రాజకీయ దుకాణం బంద్ అయ్యిందని.. ప్రజలు ఎప్పుడో ఆయన రాజకీయ జీవితానికి గుడ్ బై చెప్పేశారని జోస్యం చెప్పాడు. జనం ఛీత్కరించుకోకముందే సగౌరవంగా రాజకీయాల నుండి తప్పుకుంటే మంచిదని ప్రవీణ్ రావు హితవు పలికారు.