Site icon Newsminute24

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది.

కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక ముగ్గురేసి చొప్పున అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైనట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 50 నుంచి 60మందితో కూడిన తొలి జాబితాను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో పోటీకి సంసిద్ధంగా లేని నేతలను లోక్‌సభ నియోజకవర్గాలవారీగా కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వచ్చే నెల 14 నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్దమవుతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అయితే ఆలోపే ఓ భారీ బహరంగసభను నిర్వహించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటు నియోజవకర్గ అభ్యర్థుల ఎంపిక కసరత్తు..అదే సమయంలో తమదైన వ్యూహ రచనతో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ఒత్తిడి పెంచాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని సంకేతాలు ఇస్తోంది. మొత్తం మీద తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పక్కా ప్రణాళిక తో ముందుకెళ్తోంది.

Exit mobile version