Site icon Newsminute24

ఆంధ్రాలో కులగణన..కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!

Nancharaiah merugumala senior journalist: (ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా..కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ‘రాజకీయ సాధికారత’కు అత్యవసరం!)

====================

ఆంధ్రాలో కులగణన.. గౌడ, గొల్ల సహా నూటికి పైగా ఉన్న బీసీ కులాల కన్నా ..తమకు ఇంకా చిక్కని రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరులకు ఎక్కువ అవసరం. ఈ నాలుగు కులాల జనాభాను విడివిడిగా లెక్కించాలా? లేక హోలు మొత్తంగా కలిపేసి గణించాలా? అనే విషయాన్ని ఆంధ్రప్రదశ్‌ ప్రభుత్వం నిర్ణయిస్తుందా? కాపు సంఘాలు తేలుస్తాయా? అనేది చాలా పెద్ద క్లిష్ట సమస్య కాకుండా కాపు సముదాయం జాగ్రత్తపడాలి. ఎప్పటికైనా ఏపీలో అన్ని కులాల జనాభా లెక్కలు సేకరించి, లెక్క తీస్తే తప్ప కాపుల సమస్య పరిష్కారం కాదు. లేకుంటే ఇది మరో ‘ఖలిస్తాన్‌’ సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. తెలుగునాట కులగణన చేస్తేనే…కాపులు, బలిజలు, తెలగలు, ఒంటరులు–ఈ నాలుగు వేర్వేరు కులాల ఉమ్మడి జనాభా ఎంతో లెక్క తేలుతుంది. ఏదేమైనా, ఓసీ కాపుల జనాభా మదించి చెప్పడం పెద్ద పనే. ఈ పని పూర్తి చేస్తేనే…కాపు జన సమూహాలకు సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక న్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం ఈ విశాల సముదాయానికి లేదా కాపు జనోద్ధారకుడు ముద్రగడ పద్మనాభం గారి మాటల్లో చెప్పాలంటే.. కాపు జాతి చేతికి 2033 తర్వాతైనా దక్కుతుంది. ముందు సకల కాపు సముదాయం జనాభా ఏపీలో ఐదు శాతమా? పదిహేను శాతమా? లేక 25 శాతమా? అనేది జనగణన లేదా కులగణనలో స్పష్టమైతే–ఆంధ్రప్రదేశ్‌ త్వరలోనే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణను దాటిపోయి..దక్షిణాదిన నంబర్‌ ఒన్‌ స్టేట్‌ స్థాయికి చేరుకుంటుంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రాలో అన్ని కులాల జనాభా వివరాలు సేకరించడం సాధ్యం కాకపోతే–కనీసం కాపులు అని విశాల అర్ధంలో చెప్పుకునే నాలుగు కులాల జనసంఖ్యనైనా లెక్కించడం ఏపీ సర్కారు నైతిక బాధ్యత.

Exit mobile version