Newsminute24

Unionbudget2024 : బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత హర్షణీయం: నాదెండ్ల మనోహర్

NadendlaManohar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు కేటాయించడం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించడంపై జనసేన పార్టీ శాసనసభ పక్షం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశించి 2020లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారో ఆ దిశగా అడుగులు పడటం శుభసూచకమన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఆయన మీడియా పాయింట్ లో విలేకర్లతో మాట్లాడారు.

“రాష్ట్రం అభివృద్ధి చెందాలి… ప్రజలకు మేలు జరగాలి… మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2020 జనవరిలో బీజేపీతో పెట్టుకున్నారని అన్నారు. ఆ రోజు పవన్ కేంద్ర నాయకత్వాన్ని కోరింది ఒక్కటేనని.. ‘వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయి… స్వలాభం కోసం వాళ్లు అనుసరించే విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది, అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. దయచేసి పట్టించుకోండి’ అని కేంద్రాన్ని కోరారని మనోహర్ స్పష్టం చేశారు.

మాట నిలబెట్టుకున్నారు ..

ఎన్డీయే (తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా ) కూటమిగా ఏర్పడిన తరువాత జరిగిన చర్చల్లో చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్ర నాయకత్వానికి… అమరావతి నిర్మాణానికి సాయం అందించాలని కోరినట్లు మనోహర్ తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపించిందనే భావన కలగకుండా మనందరం కలిసి పని చేద్దామన్నారు. దీనికి కేంద్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర వార్షిక బడ్జెట్ లో రాష్ట్రానికి మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాజధాని అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దడంతోపాటు ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అంకితభావంతో పని చేస్తామని మనోహర్ ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version