Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే తెలుగు రాష్ట్రాల జనం మధ్య మరింత దూరం పెంచినట్టే అవుతుంది, ఆలోచించండి–చంద్రబాబు !)
రేపొచ్చే డిసెంబర్ నెలలో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ గనక జాతీయపక్షం బీజేపీతో ప్రాంతీయపక్షం తెలుగుదేశం పొత్తుపెట్టుకుంటే కనక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ టీడీపీ ఎంతో కీడు చేసినట్టవుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజనతో ఆంధ్రోళ్లపై తెలంగాణ జనానికి కోపం కొంతైనా తగ్గింది. కాని నాలుగున్నరేళ్ల తర్వాత 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ రెండో శాసనసభ ఎన్నికల్లో ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ’ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పొత్తుపెట్టుకుని తెలంగాణకైతే మేలు చేయలేదు కాని, ‘ఈ కోస్తా–రాయలసీమోళ్లు ఇంతే. ఏపీ ముక్కలైనా వారికి బుద్ధిరాలేదు,’ వంటి మాటలు తెలంగాణ ఓటర్ల నోట వినిపించాయి. ఇలా అప్పటికి 40 ఏళ్లకు పైగా రాజకీయానుభవం ఉన్న చంద్రబాబు గారు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి ముందు తెలంగాణలో పెద్ద రాజకీయ తప్పిదం చేశారు. కాంగ్రెస్ పార్టీని గాయపరిచి నేలపై కూసోబెట్టడంలోనే టీడీపీ ఉనికి, అస్తిత్వం ఉందనే వాస్తవం బాబు గారు ఆనాడు మరిచారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాషాయపక్షం కాడి మోసే కార్యక్రమం పెట్టుకుంటే దక్షిణాదిన తెలివితేటలు, వివేకం, బుర్ర కాస్త తక్కువ ఉన్నోళ్లనే పేరు సంపాదించిన తెలుగు వారు ఆయనను క్షమిస్తారా?