దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిపత్యం అని పీపుల్స్ పల్స్ సంస్థ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్‌సైట్ కోసం నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. హోరాహోరీ పోరులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను గెలుపొంది మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. బీజేపీ 100 స్థానాలలోపే పరిమితం కావచ్చు. ఇదే సమయంలో జేడీ(ఎస్) తనకు పట్టున్న స్థానాల్లో అధిపత్యం కొనసాగిస్తుందని.. ఇతరులు 1 నుంచి3 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక శాసనసభలో అధికార పగ్గాలు చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దక్కించుకోవాలి.
2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ సారి 42 శాతం ఓట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బీజేపీఈ సారి 36 శాతం సాధించవచ్చు. 2018లో 18.3 శాతం ఓట్లతో కింగ్‌మేకర్ పాత్ర పోషించిన జేడీ(ఎస్) ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఏ సర్వేలోనైనా 2 శాతం ప్లస్ లేదా మైనస్ వ్యత్యాసాలు ఉండే అవకాశాలు ఉంటాయని ఇక్కడ గమనించాల్సిన అంశం.
ముఖ్యమంత్రి ఎవరు?
ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచినట్లు సర్వేరిపోర్ట్ చెబుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్పకు 14 శాతం మంది, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు 3 శాతం మంది ప్రాధాన్యతిచ్చారు.
‘ప్రాబబులిటీ ప్రెపోజిషన్ మెథడాలజీ’ (పీపీఎస్) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేద`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3360 శాంపిల్స్ సేకరించడం జరిగింది.
ఇరు పార్టీలకూ అగ్నిపరీక్షే
2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులు, జనం నాడీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర బిందువుగా చేసుకొని, పీపుల్స్ పల్స్ సంస్థ గత ఆరేడు నెలలుగా కర్ణాటక వ్యాప్తంగా పర్యటిస్తూ ‘సౌత్ ఫస్ట్’ కోసం మూడు ప్రీపోల్ సర్వేలు నిర్వహించింది. డేటాను శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి, రాష్ట్రంలో ‘పొలిటికల్ ట్రెండ్స్’ని ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ వచ్చింది. మొదటి ప్రీ పోల్ సర్వేను 2022 డిసెంబర్ 22 నుండి 31 వరకు నిర్వహించగా, రెండో ప్రీ పోల్ సర్వేను 2023 మార్చి 25 నుండి ఏప్రిల్ 10 వరకు చేపట్టింది. మూడో ప్రీపోల్ సర్వేను 2023 మే 1 నుండి మే 5 వరకు నిర్వహించింది. మొదటి ప్రీపోల్ చేపట్టినప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలా సంకేతాలు కనిపించినా ఏప్రిల్ మొదటివారం నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ నెమ్మదిగా పైకి పెరగడం మొదలైంది. అది కాస్త ఇప్పుడు కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.
కులాల చుట్టూ తిరిగిన రాజకీయం
కర్ణాటక ఎన్నికల్లో కులాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. రాష్ట్రంలో సామాజిక వర్గాల వారిగా చూస్తే 55% ఓబీసీలు, 17% ఎస్సీలు, 7% ఎస్టీలు, 11% ముస్లింలు, 3.5% అగ్రవర్ణాలు, 2% క్రిస్టియన్లున్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లు, అందులో చేసిన తాజా మార్పులు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి.
సామాజిక వర్గాలుగా విశ్లేషిస్తే నూతన ఓటు బ్యాంకింగ్‌ను సానుకూలంగా మార్చుకోవడంలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయి. రిజర్వేషన్లను మారుస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశం అయ్యింది. రిజర్వేషన్లు కోల్పోయిన ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పక్షంవైపు నిలబడ్డారు. కళ్యాణ్ కర్ణాటక కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా ఉండగా, ముంబాయ్ కర్ణాటక ప్రాంతంలో ఆ పార్టీ వెనకపడిరది. మధ్య కర్ణాటక, బెంగుళూరు ప్రాంతాలలో ‘నువ్వా నేనా’ అనేలా పోటీ ఉంది. పాత మైసూరు, కోస్తా ప్రాంతాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయి. పాత మైసూరులో జేడీ(ఎస్) కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉన్నా, జేడీ(ఎస్)కు కొంత ఆధిక్యత ఉంది. కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ బీజేపీ కొన్ని సిట్టింగ్ స్థానాలు కోల్పోయే అవకాశాలున్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.
బీజేపీ బలాలు, బలహీనతలు..
మొదటి నుండి లింగాయత్‌లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో బీజేపీకి ఆ వర్గం ప్రధాన బలం. ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ కురుబాలకు (సిద్దరామయ్య సామాజిక వర్గం), జేడీ (ఎస్) వొక్కలింగాలకు (దేవగౌడ సామాజిక వర్గం) ఇస్తుందని, బీజేపీ మాత్రమే లింగాయత్‌లకు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందనే ప్రచారంతో ఆ వర్గం ఓట్లను బీజేపీ తన వైపు తిప్పుకోవడంలో కొంతవరకు విజయం సాధించింది.
ఇక టిప్పు సుల్తాన్, ఈద్గా మైదాన్, బజరంగ్‌దళ్ అంశాలను బీజేపీ లేవనెత్తింది. ఇది కోస్తా కర్ణాటకలో మాత్రమే కొంతవరకు ప్రభావితం చేయగలిగింది. అయితే, 2018 ఎన్నికల ముందు జరిగిన పరేశ్ మిశ్రా హత్య ప్రభావం ఆ ఎన్నికల్లో చూపలేదనే కూడా ఇక్కడ గమనించాలి.
బీజేపీ మోడీ ప్రజాకర్షణపై ఎక్కువ ఆధారపడిరది. బీజేపీ ప్రచారం దాదాపు మోడీ, బజరంగ్ బలి చుట్టూనే తిరిగింది. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో అంతగా వ్యతిరేకత కనిపించకపోవడం సానుకూల అంశమే. అయితే, మోడీ ప్రభుత్వం పనితీరుపై 47 శాతం కంటే ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, రాష్ట్ర సర్కారుపై వ్యక్తం చేసిన అసంతృప్తి దానికి రెండిరతలు ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ బలాలు, బలహీనతలు
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ ‘40% సర్కారు’ కమీషన్ నినాదంతో కాంగ్రెస్ ప్రజల్ని చైతన్యపరచడం కలిసొచ్చింది. బీఎస్ బొమ్మై ఒక బలహీన ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పెద్ద ఎత్తు చేసిన ప్రచారం ఫలించింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పను బీజేపీ పదవి నుండి తొలగించిందనే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ లింగాయత్‌లలో విభజన ద్వారా బీజేపీకి నష్టం కలిగించాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అయితే, దీని ప్రభావం అంతగా కనిపించలేదు.
ఎన్నికల హామీలుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్నభాగ్య, యువనిధి వంటి పథకాలపై క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పెద్దఎత్తున ప్రచారం చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు ప్రజల నుంచి భారీగా అనుకూల స్పందన లభించింది.మతాల పేరుతో రాజకీయం చేసే సంస్థల్ని అని రాయకుండా, బజరంగ్ దళ్ లాంటి సంస్థలని నిషేధిస్తామని కాంగ్రెస్ మెనిఫెస్టోలో రాయడంతో చివరి నిమిషంలో బీజేపీ చేతిలో అస్త్రం పెట్టినట్టయింది. బజరంగ్‌దళ్ నిషేధ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ఓటర్ల వద్దకు చేర్చగలిగింది. అయితే, దీని ప్రభావం కోస్తా కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రభావం స్వల్పంగా ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.