తెలంగాణాలో కొందరి అధికారుల తీరు పై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తమ హోదాలను మరిచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రవర్తిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వైఖరే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇంతకు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చింది. దీని వెనక దాగున్న కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసిఆర్ ..ప్రగతి భవన్ వేదికగా వర్చువల్ ద్వారా మెడికల్ కాలేజీల్లో క్లాస్ లను ప్రారంభించారు. ఈ కార్యకమం ముగిసిన అనంతరం కేసిఆర్ వెళుతున్న సమయంలో .. శ్రీనివాసరావు ఆయన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవీడియోపై కేసీఆర్ మెప్పు పొందడం కోసం శ్రీనివాస్ రావు పడుతున్న పాట్లు పగవాడికి రావొద్దంటూ నెటిజన్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆశీర్వాదం తీసుకున్నట్లుగా లేదని.. సార్ సార్ నా టికెట్ కొంచెం చూడండి అంటు ఉన్నట్లుగా ఉందని మరికొందరూ కామెంట్స్ జోడిస్తున్నారు.
ఇక ఈ వీడియో చూసిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి.. శ్రీనివాస్ రావు పై మండి పడ్డారు. కొత్తగూడెం అసెంబ్లీ టిఆర్ఎస్ టికెట్ కోసమే డాక్టర్ శ్రీనివాస్ రావు, సీఎం కాలు పట్టుకున్నారని.. ఇలాంటి అధికారుల తీరుతో బ్యూరోక్రసి పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగూడెం పర్యటన వెళ్ళినప్పుడు.. టౌన్ నిండా వారి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయని.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు మురళి చెప్పుకొచ్చారు.
కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.వీడియో pic.twitter.com/VmX8DZYc5C
— Murali Akunuri (@Murali_IASretd) November 16, 2022
ఇదిలా ఉంటే.. ఈ విషయంపై బిజెపి కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం కాళ్ళు మొక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుతున్న వ్యక్తులను చూస్తుంటే ఏవగింపు కలుగుతోందని మండిపడుతున్నారు.