సిద్ధార్థ (జర్నలిస్ట్):
‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ నా చిన్నతనంలో తెలంగాణలోని కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై వాల్ రైటింగ్స్ కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా ఇలాంటి స్లోగన్స్ చూసేవాళ్ళం. మావోయిస్టులు మొన్నటి వరకు చేసి విరమిస్తున్న సాయుధ పోరాటం సరైనదేనా అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అయితే బుల్లెట్ కంటే బ్యాలెట్ నయమనే వాదనపై మాత్రం తప్పకుండా చర్చ జరగాలి.
ఎమ్మా గిల్డ్ మన్ అనే ఓ అమెరికన్ అనార్కిస్ట్ ఎన్నికలపై ఆసక్తికరమైన మాట చెప్పారు. ఎన్నికలనేవి ప్రజల జీవితాల్లో మార్పును తెస్తాయనేది నిజమే అయితే ఎన్నికలను చట్ట విరుద్ధమని ఎప్పుడో ప్రకటించేవారు అని గిల్డ్మన్ అభిప్రాయం. ఇక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా భారత ఎన్నికల వ్యవస్థపై నిర్థిష్టమైన అభిప్రాయాలతో ఉండేవారు. ఇండియాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇక్కడ సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ విజయవంతం అయితే తప్పా పొలిటికల్ డెమోక్రసీ విజయవంతం కాదని బాబాసాహెబ్ అభిప్రాయం. ఇండియా లాంటి దేశంలో సోషల్ డెమోక్రసీ విజయవంతం కావడం సాధ్యమేనా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
1985 జూలై 17 న ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ మాయని గాయం. ఆ గాయానికి ఈ దేశ ప్రజాస్వామ్యానికి నాలుగు స్థంబాలుగా చెప్పుకునే లెజిస్లేచర్, జ్యుడిషయరీ, అడ్మినిస్ట్రేషన్, మీడియా చికిత్స చేయలేకపోయాయి. కారంచేడు విషయంలో
ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ చేయలేని న్యాయాన్ని తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం సాధ్యమని నమ్మిన పీపుల్స్ వార్ రాజకీయాలు చేసి చూపెట్టాయి. దాంతో అప్పటి వరకు అన్యాయానికి గురవుతూ న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు పీపుల్స్ వార్ రాజకీయాలు ఒక భరోసానిచ్చాయి. తమకోసం ఒకరున్నారు అనే నమ్మకాన్ని కలిగించాయి. ఆ ఒక్క సంఘటనతో అప్పటిదాకా నోరు లేని కొన్ని వర్గాల ప్రజలకు తుపాకీ గొట్టం రాజకీయాలు గొంతుగా మారాయని చెప్పవచ్చు. ఆ రాజకీయాలు ఈ దేశంలో మగ్గిపోతున్న ప్రజలకు ప్రశ్నించడాన్ని, ఆత్మగౌరవంతో బతకడాన్ని నేర్పాయి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నది కులమే. కుల సమస్య పరిష్కారం కానంత వరకు ఎన్నికలు ఒక ఉత్సవమే తప్ప ప్రజలకు ఒరిగేది లేదు అనే భావన చాలా మందిలో స్థిరపడింది. కుల అహంకారంతో జరిగిన ఒక అట్రాసిటీకి పరిష్కారం చూపని ఈ దేశ వ్యవస్థను నమ్మాలా? పరిష్కారం చూపెట్టిన తుపాకీ గొట్టం వ్యవస్థను నమ్మాలా? అనే విషయాన్ని బాధితులు, నోరు లేని ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.
జల్, జంగల్, జమీన్ నినాదంతో ఈ దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం కాకుండా పోరాడుతున్న ఈ దేశ భూమిపుత్రులకు సైతం తుపాకీ గొట్టం రాజకీయాలే పరిష్కార మార్గంగా కనిపించాయి. దేశంలో పోరాడుతున్న, పోరాడలేని చాలామందికి, ప్రశ్నించలేని చాలా మందికి ‘ఎడారిలో ఒయాసిస్’లాగా విప్లవ రాజకీయాలు సమాధానంగా మారాయి.
బ్యాలెట్‌తో ఒరిగేదేమీ లేదని అనాటి పీపుల్స్ వార్ పార్టీ బుల్లెట్ బాట పట్టింది. ఆ తర్వాత ఏర్పడిన మావోయిస్ట్ పార్టీ కూడా అదే పంథాను కొనసాయించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం చేయలేమని, దాని నుండి పక్కకి రావడమే సరైందని మావోయిస్టులు అజ్ఞాతం వీడి వనం నుండి జనంలోకి వస్తున్నారు. మావోయిస్టులు అడవిలోనే ఉండాలి, సాయుధ పోరాటమే చేయాలి అనేది ఇప్పటి పరిస్థితులకైతే మూర్ఖపు వాదనే అవుతుంది. వ్యక్తిలో గానీ, సంస్థలో గానీ ఆలోచనలో మార్పు ఉంటే తప్పా మనుగడ సాధ్యం కాదు. మరోవైపు రాజ్యం పరిధి విస్తృతమైంది. రాజ్యపు డేగ కన్నులు, టెక్నాలజీ వలయాన్ని దాటి అడవిలో అజ్ఞాతంగా ఉండి సాయుధపోరాటం చేయడం అసాధ్యమని మావోయిస్టులు కూడా భావిస్తున్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం వారి కుటుంబాలకు సంతోషకరమైన విషయమే.
బయటకి వచ్చిన మావోయిస్టులు వారి భవిష్యత్తు కార్యాచరణపై తమ అభిప్రాయాలను పొడిపొడిగా చెప్తున్నారు. ఇన్ని రోజులు ప్రజల కోసం పని చేశామని, ఇకపై కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజల కోసం పనిచేస్తామని బయటకి వచ్చిన మావోయిస్టులు చెప్తున్నారు. అయితే బయటి సమాజం మాత్రం మావోయిస్టులు ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
బ్యాలెట్ వ్యవస్థ దారి తప్పిందనే బుల్లెట్ మార్గాన్ని ఎంచుకున్న మావోయిస్టులు మళ్ళీ బ్యాలెట్ బాట పట్టాలని కోరుకోవడం సరైనదేనా? అనే అంశంపై చర్చ జరగాల్సిందే. మావోయిస్టులు సాయుధపోరాట మార్గంలోనే కొనసాగితే అది విజయవంతం అయ్యేదో కాదో తెలియదు కానీ, ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ముమ్మాటికీ విజయవంతం కాదనే చెప్పవచ్చు. ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలను చూస్తూ ఉన్నాం. ‘మా గ్రామంలో ఓటుకు నాలుగు వేలు పంచారు. మాకు రెండు వేలు మాత్రమే ఇస్తున్నారు. మా ఓటుకు విలువ లేదా? మాకు కూడా నాలుగు వేలు ఇవ్వాల్సిందే’ అనే డిమాండ్ తో గ్రామ ప్రజలంతా ఏకమై ధర్నా నిర్వహించిన పరిస్థితుల్ని చూశాం. ఇది కేవలం ఒక్క గ్రామానికి పరిమితమైన సంఘటన కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల వ్యవస్థలోకి మావోయిస్టులు రావాలని కొందరు మిత్రులు కోరుకోవడం బాధాకరం.
విప్లవ రాజకీయాల నుండి, సాయుధ పోరాట వారసత్వం నుండి వచ్చిన అనేకమంది ప్రజా ప్రతినిధులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మావోయిస్టు రాజకీయాల నుండి బయటకు వచ్చిన సాంబశివుడు తెలంగాణ కోసమని టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. సాంబశివుడు తుపాకీ వదిలి ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగు పెట్టడంతో ఆయన్ని ఆహా ఓహో అంటూ కీర్తించారు. కొద్ది రోజుల్లోనే సాంబశివుడు హత్యకు గురయ్యారు. సాంబ శివుడు హత్యపై సొంత పార్టీ నేతలు కూడా కనీసంగానైనా స్పందించలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో సగానికిపైగా మంది విప్లవ రాజకీయాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పరిచయం ఉన్నవారే. కొందరికి దశాబ్దానికి పైగానే సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉన్నది. నకిరేకల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వేముల వీరేశంను గతంలో సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెట్టినట్టు ఆయనే చెప్పుకున్నారు. గతంలో దళ కమాండర్‌గా పని చేసిన సీతక్క ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చాక కక్షగట్టి ట్రోల్ చేశారు. ఈ సందర్భాల్లో బుల్లెట్ వదిలి బ్యాలెట్ మార్గంలోకి రావాలని ఆహ్వానించిన ఒక్కరు కూడా వాళ్ళకి మద్దతుగా నిలవలేదు. గ్రామాలకి తరలండి అనే నినాదంతో గ్రామాల్లోకి వెళ్ళి అద్భుతంగా పని చేసి తొలి మావో బ్యాడ్జి పొందిన నాటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు నారదాసు లక్ష్మణ్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కనుమరుగైపోయారు. తన పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గద్దర్ ఎన్నికల బాటలోకి వస్తున్నానని ప్రకటించి ఓటు నమోదు చేసుకున్న తర్వాత ఒంటరివాడయ్యాడు. ప్రజల జడ్జిగా గుర్తింపు పొందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడంతో చాలా వర్గాలు ఆయనకి దూరమయ్యాయి. సామాజిక ఉద్యమాల నేత మందకృష్ణ బ్యాలెట్ రాజకీయాల్లోకి వచ్చి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అట్టర్ ప్లాప్ అయ్యాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత చిరంజీవి మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, కృష్ణం రాజు, విజయశాంతి, కృష్ణా, దాసరి నారాయణ రావు, హరికృష్ణ, జయప్రద, జయసుధ ఇలా అనేక మంది తమ రంగాన్ని వదిలిపెట్టి ఎన్నికల రాజకీయాల్లో చేరి చేతులు కాల్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లో ప్రచారం చేసి అక్కడి సీన్ అర్థం కాగానే మళ్ళీ వెనక్కి వచ్చి సినిమాలు చేసుకుంటున్నారు. మణిపూర్ ప్రజల హక్కుల కోసం 16 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిల ఎన్నికల మార్గంలోకి వచ్చి పోటీ చేస్తే కేవలం 90 ఓట్లు వచ్చాయి.
తమ రంగాల్లో నిష్ణాతులైన వారు రాజకీయాల్లోకి వచ్చాక సక్సెస్ అయింది ఒకరిద్దరు తప్పా పెద్దగా లేరు. బయటికి వచ్చిన మావోయిస్టులు ఇలాంటి ఎన్నికల రాజకీయాల్లోకి రావాలని కొందరు కోరుకోవడం పిచ్చి చర్యనే అవుతుంది. పార్లమెంటరీ ఎన్నికల్లోకి మావోయిస్టులు రావాలని కోరుకుంటున్న, సోషల్ మీడియాలో రాస్తున్న వారెవరూ మావోయిస్టులు నిజంగా ఎన్నికల్లోకి వస్తే తమ రాజకీయ పార్టీలు వదిలి అన్నలతో కలిసి నడుస్తారా? ఇలాంటి పరిస్థితుల్లో పాలిటిక్స్ లోకి వస్తే మావోయిస్టులకు మరిన్ని గుణపాఠాలు ఎదురవ్వడం తప్ప ఒరిగేదేమీ ఉండదనేది వాస్తవం.
నిజానికి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వస్తామని బయటకి వచ్చిన మావోయిస్టులు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు మాట్లాడిన పొడిపొడి మాటల్లో, సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి పక్కకి వస్తున్నామని చెప్తున్నారు. కానీ వారి సొంత రాజకీయ విశ్వాసాలపై మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయట్లేదు. ఇంతకాలం తాము నమ్ముకున్న రాజకీయ అవగాహనతోనే ఇకపైన ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం సైతం హింస పద్ధతిలో పోరాటం చేయడం తప్పు అని అంటున్నది. శాంతియుతంగా ప్రజల కోసం కొట్లాడితే తమకేమీ ఇబ్బంది లేదని ప్రకటించింది.
దశాబ్దాల పాటు ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవిలో ఉండి కొట్లాడిన వాళ్ళకి ప్రజలపై అమితమైన ప్రేమ ఉంటుందని భావించవచ్చు. ఇన్ని రోజులు అజ్ఞాతంగా ఉంటూ ప్రజల కోసం పనిచేసిన మావోయిస్టులు బయటకి వచ్చిన తర్వాత కూడా ప్రజల గొంతుకగా నిలవాలని చర్చ జరుగుతోంది. ప్రజల తరపున ఒక ‘ప్రెజర్ గ్రూప్’గా ఉంటేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ సమాజం భావిస్తోంది. తాము సమసమాజం కోసం ఇన్ని రోజులు పని చేశామని చెప్తున్న మావోయిస్టులు బయట ఒక ప్రజాసంఘంగా మారి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నమ్మకంతో బయటకి వస్తున్న మావోయిస్టులపై ప్రభుత్వం సైతం లిబరల్ గా ఉండాలి. గతంలో చర్చల కోసం బయటకి వచ్చిన మావోయిస్టులను చర్చల మధ్యలోనే ఎన్ కౌంటర్లు చేసిన ఉదంతాలు చూశాం. ఇప్పుడున్న ప్రభుత్వం అజ్ఞాతంలో ఉంటున్న మిగతా మావోయిస్టులు కూడా బయటికి రావాలని, వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వమైనా ఇచ్చిన మాటతో చిత్తశుద్ధిగా ఉంటుందా? లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇక ఇదే సమయంలో బయటి సమాజం నుండి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి. ఆయా ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ పాలనలో జరుగుతున్న అనేక అన్యాయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు, టీచర్లు, ప్రజాసంఘాల నాయకులపై మావోయిస్ట్ అనే ముద్రలు వేసి కేసులు కట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వమైతే తమని వ్యతిరేకించిన ప్రతి మనిషిపై అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేసింది. రాజద్రోహం లాంటి కేసులను అనేకమందిపై అక్రమంగా పెట్టడం వల్ల ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి కేసులను కూడా ప్రభుత్వం ఎత్తేయాలని కోరుకుందాం.
బయటకి వచ్చిన మావోయిస్టులు గానీ, వాళ్ళని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్న వాళ్ళు గానీ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజా ఉద్యమాలు ప్రజలను ఏకం చేస్తాయి. ఎన్నికలు ప్రజలను విడదీస్తాయి.బయటకి వచ్చిన మావోయిస్టులు రాజ్యాంగ పరిధిలో ప్రజల కోసం ప్రజల తరపున పనిచేయాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఉద్యమంలో వాళ్ళు భాగం కావాలని కోరుకుందాం.
