Site icon Newsminute24

BJPTELANGANA: సీతయ్యకి బిజేపి చీఫ్ పదవి ఎలా ఇస్తారు..?

BJPTELANGANA: కొన్ని నియమాలకు కట్టుబడేవారు, కొన్ని సిద్ధాంతాలను తాము కచ్చితంగా లోబడి ఉన్నామంటూ బయటకి కనిపించేవారు రాజకీయాల్లో ఇమడలేరు. ఒక వేళ ఉన్నా నాయకుడిగా మారాలి తప్ప మరొకరి పంచన ఉండటం కష్టం. ‘దేశసంపదను కాంగ్రెస్ ముస్లింలకు దోచిపెడుతోంది’ అని ఆరోపించిన అదే కమలదళం పార్టీ 2018 ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ముసలివాళ్లకు ఉచిత జెరూసలేం ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేసింది. ‘ముస్లిం వ్యాపారులు తమ షాపు బోర్డుల మీద తమ పేరు రాయాలి’ అని హుకుం జారీ చేసిన అదే పార్టీ నేతలు, అరబ్ దేశాలతో మాత్రం వేలాది కోట్ల వ్యాపారానికి అగ్రిమెంట్లు చేసుకున్నారు. డబుల్ స్టాండర్డ్స్ ఇట్లా ఉంటాయి.

ఇట్లాంటి డబుల్ స్టాండర్డ్స్ పాటించే నేతలే రాజకీయాల్లో ఎదుగుతారు. ఆ ప్రాంతంలో ఓటర్లలో ఏ మతం వారు ఎక్కువగా ఉంటే ఆ మతం వారికి అనుకూలంగా మాట్లాడేవారే ఎదుగుతారు. పైవారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నట్లు నటించేవారే ఎదుగుతారు. ఊరికే సిద్ధాంతాలు అనుకుంటూ ఆవేశంతో రాద్ధాంతం చేస్తే పార్టీలోనుంచి తీసేయరు కానీ, వాళ్లే వెళ్లిపోయేలా చేస్తారు. అలా ఆవేశపడే వారికి ‘అన్నా.. అన్నా’ అంటూ సోషల్‌మీడియా నుంచి ఫాలోయింగ్ వస్తుంది కానీ, పార్టీ మాత్రం కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తుంది. రాజా_సింగ్ అయినా, మో_దీ తాత అయినా..అంతే! అందరూ ఇక్కడ పావులు మాత్రమే. టైం అయిపోగానే తీసి పక్కన పెట్టేస్తారు. మహా అయితే ‘భారతరత్న’ ఇప్పించి ఊరుకోబెడతారు.

అయినా తాము చెప్పిన మాట చెప్పినట్లు పాటించి, తమకు అనుకూలంగా ఉండేవాళ్లకు అధిష్ఠాన నేతలు పదవులిస్తారు కానీ, తమ మీదే తిరగబడే వాళ్లకు ఎందుకిస్తారు? అందరితో కలిసిపోయేవారికి పదవులిస్తారు కానీ, ‘ఎవరి మాటా వినడు ఈ సీతయ్య’ అనుకుంటూ బతికేవాళ్లకు ఎందుకిస్తారు? ఇంత చిన్న లాజిక్ అర్థం కాని నెటిజన్లు ‘అయ్యో..అన్యాయం జరిగింది’ అని కామెంటుతున్నారు. ‘హిందూత్వానికే అవమానం జరిగిందనే’ రేంజులో బాధ వెల్లగక్కుతున్నారు. ఆయనున్నా, మరెవరున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఆదేశాలన్నీ పైనుంచి రావాల్సిందే! వాళ్లు వచ్చినప్పుడు టీ, కాఫీలతో సహా అందించి, మర్యాదలు చేసి ప్రసన్నం చేసుకోవాల్సిందే! అవన్నీ చేసే బాధ ఆయనకు తప్పినందుకు సంతోషించండి.

_ విశీ

Exit mobile version