Janasenaparty: వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు ఎంతో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లని స్పష్టం చేశారు. ఇందులో ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు అని.. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటో.. ఆ సలహాల వల్ల తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల అందిన అభివృద్ధి ఫలాలు.. అసలు ఎవరికి ఎంత మొత్తం ఖర్చు చేశారో ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో సమాధానం చెప్పి తీరాలని అన్నారు. సుమారుగా 89 మంది సలహాదారులు ఉన్నారని… ఈ ముఖ్యమంత్రికి తన ప్రభుత్వంలో సలహాదారులు ఎంత మంది ఉన్నారో, వారి పేర్లేమిటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అసలు ఈ సలహాదారుల వివరాలను ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఎందుకు ఉంచుతుందో కూడా బయటపెట్టాలని మనోహర్ కోరారు.
సలహాలతో తీసుకువచ్చిన పాలసీలు ఏమిటి?
సలహాదారులు సైతం ముఖ్యమంత్రిని, ప్రభుత్వ అధికారులను కలవలేని దౌర్భగ్య పరిస్థితి ఉందని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ నియమించిన సలహాదారుల్లో కొందరు రాజీపడలేని వ్యక్తులు ఉన్నారని.. వారు రాజీనామా చేసి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. సుభాష్ గార్గ్, రామచంద్రమూర్తి, జుల్ఫీ లాంటి వారు ఈ ప్రభుత్వంలో తమ సలహాలు ఎవరూ వినేవారే లేరని తెలుసుకొని వెళ్లిపోయారని వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో తమ అనుకున్న వారి కోసం వేతనాలు, వారి ఖర్చులు, ఇతర సిబ్బంది ఖర్చుల కోసం రూ.680 కోట్లు వెచ్చించారని.. వీరి ఇచ్చిన సలహాలు ఏమిటో, దాని వల్ల తీసుకున్న పాలసీలు ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని మనోహర్ పేర్కొన్నారు.