Newsminute24

IPL2025: ఆట అంటే గెలుపేనా…?

 ఆర్.దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):

పొట్టి క్రికెట్ పోటీ పండుగ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ IPL సందడి మొదలైంది. 18వ తాజా ఎడిషన్ క్రీడాభిమానులకు కన్నుల పండుగే! వేలాది మండి స్టేడియాలలో క్రిక్కిరుస్తుంటే కొన్ని కోట్ల మంది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. ఇక ల్యాప్-టాప్ లు, ట్యాబ్ లు, మొబైల్ లలో చూడ్డం సరేసరి! అప్పుడూ ఇప్పుడూ క్రికెట్ ఆడటం కొన్ని దేశాలకే పరిమితమైనా… ఫుట్ బాల్ తర్వాత అంతగా ప్రపంచ జనావళిని ఆకట్టుకుంటున్న ఆట ఇపుడు క్రికెట్టే! క్రీడల్ని పెద్ద స్థాయిలో నిర్వహించడం వెనుక ఓ ఉద్దేశ్యం ఉంటుంది. క్రీడల ద్వారా మనుషుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఆ లక్ష్యాల్లో ఒకటి. ఫలితంగా మనుషుల్లో…. గెలుపోటముల్ని సమంగా స్వీకరిస్తూ జీవితంలో ముందుకు సాగే స్థితప్రజ్ఞత అలవడాలన్నది ఆశ! విజేతలకు రెండు ఆలివ్ ఆకులిస్తూ ఎప్పుడో ఏథెన్స్ లో మొదలైన ఆధునిక ఒలింపిక్స్ ముందు-వెనకల నుంచి… నిన్న ఇవాల్టి క్రీడా పండుగల దాకా ఆశ, ఆశయం ఇదే స్ఫూర్తి, ఇటువంటిదే లక్ష్యం కూడాను.

ఇక్కడొక చిక్కు సమస్య వచ్చిపడింది. అదేమంటే…. పరస్పర విరుద్ద ప్రయోజనాభిలాష (Conflict of interest) అనేదొకటి అడ్డొస్తుంది. Killer instinct లాంటి గెలిచి తీరాలనే తపన, take it easy అనే, ఓటమిని హుందాగా స్వీకరించే తత్వం. ఈ రెంటి మధ్య పొసగదు, అందుకే ఒక సంఘర్షణ. దాన్ని అధిగమించడమే అసలు విజయం. అందుకోసమే క్రీడాస్ఫూర్తి అవసరం.

చాలా యేండ్ల కింద, భారత్-ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య ఒక ప్రత్యేక టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. (Golden Jublee match or something like that సరిగా గుర్తు లేదు) గుండప్ప విశ్వనాథ్ భారత జట్టు కెప్టెన్. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ లో ఒక కీలక ఆటగాడు తక్కువ స్కోర్ కే కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుటై, నిరాశగా పెవిలియన్ వైపు వెళుతున్నాడు. స్లిప్స్ పొజీషన్ లో ఫీల్డింగ్ చేస్తున్న విశ్వనాథ్ నేరుగా ఎంపైర్ దగ్గరికి నడిచి, ‘మీరు తప్పు, బంతి బ్యాట్ కి కాకుండా ప్యాడ్ కి తాకి కీపర్ చేతుల్లోకి వచ్చింది, మీకన్నా అది నాకు స్పష్టంగా కనిపించింది. అతను అవుటవలేదు, మీరు నిర్ణయం మార్చుకోండి’ అని రెక్వెస్ట్ చేశాడు. ఇప్పుడున్నట్టు టెక్నాలజీ సపోర్టు, DRS లేని రోజులవి. రివ్యూ విధానమే లేదు. కానీ, విశ్వనాథ్ సూచనను ఎంపైర్ అంగీకరించాడు, బ్యాటర్ వెనక్కి వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు, ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, అది వేరే విషయం. ఆ గెలుపు ఎందరికి గుర్తుందో లేదో గానీ, ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ గా ఉండి విశ్వనాథ్ చూపిన క్రీడాస్ఫూర్తి గెలుపు తాలూకు వాసన… ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇలాగే ఒకసారి, గెలుపు ‘నీదా-నాదా’ అన్న తీవ్ర ఉత్కంఠలో …. పాకిస్తాన్ ఆఖరి వికెట్ జోడిని పడగొట్టే గోల్డెన్ చాన్స్ వెస్టిండీస్ బౌలర్ కి దొరికింది. అరివీర భయంకర బౌలర్ కోట్నీ వాల్ష్ ఆఖరి ఓవర్ బంతి పట్టుకొని, తన బౌలింగ్ మార్క్ నుంచి పరుగెత్తుతూ వికెట్లదాకా వచ్చాడు, బంతిని విసరకుండానే సడెన్ గా ఆగిపోయాడు… అప్పటికే బ్యాకింగ్ చేస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ వదిలి పిచ్ లో పావు దూరం వరకు ఉరికాడు. అది గమనించి ఆగిపోయిన వాల్ష్ బంతితో బెయిల్స్ చెదరగొట్టి ఔట్ చేస్తున్నట్టు ఫోజ్ ఇచ్చాడు. అది ఆఖరి జోడీ కనుక అవుట్ చేసుంటే, పాక్ ఓడి వెస్టిండీస్ గెలిచుండేదే! కానీ, అలా అవుట్ చేయకుండానే నవ్వుతూ తన బౌలింగా మార్క్ కి నడిచాడు వాల్ష్, ఫ్రెష్ గా బంతి వేయడానికి. వేశాడు కూడా, పాకిస్తాన్ బ్యాటర్ కొట్టాడు, విలువైన ఆ పరుగులతో….. పాకిస్తాన్ జట్టు గెలిచింది. కానీ, దొడ్డి దారిని గెలవడం ఇష్టం లేక రహదారి విజయం కోసం క్రీడా స్ఫూర్తి ప్రదర్శించిన వాల్ష్ ప్రపంచ హృదయాలనే గెలిచాడు.

నిన్న మంగళవారం (25.3.2025) పంజాబ్ కింగ్స్-PBKS, గుజరాత్ టైటాన్స్-GT మధ్య మ్యాచ్ సందర్భంగా ఓ విచిత్రం చోటుచేసుకుంది. మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ కొసల్లో జరిగిన రెండు పరిణామాలు ‘క్రీడా స్ఫూర్తి’కి సంబంధించి పరస్పర విరుద్ధ దృశ్యాల్ని ఆవిష్కరించాయి. మొదట పంజాబ్ జట్టు బ్యాటింగ్ చివర్లో…. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97 పరుగులతో నాన్ బ్యాటింగ్ ఎండ్ లో ఉన్నాడు. శశాంక్ ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్ స్ట్రైకింగ్ కి వచ్చాడు. సింగల్ తీసుకొని ఇవతలి ఎండ్ కి వస్తే, శ్రేయస్ సెంచరీ చేసుకునే అవకాశం ఉండేది. కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలు ముఖ్యమనే తలంపుతో తన జట్టు సభ్యుడిని ఒత్తిడికి గురిచేయలేదు. ‘సింగిల్ తీస్తాను, సెంచరీ చేయండి’ అంటే, “అలా ఏం వద్దు, నీ natural game ఆడు” అంటూ స్వేచ్ఛ ఇచ్చాడు కనుకే… ఆ ఒవర్ లో శశాంక్ 4-2-4-4-4-4 స్కోర్ చేశాడు. ఈ 22 పరుగుల్లో… గెలుపు-ఓటమి ల మధ్య వ్యత్యాసంగా నిలిచిన 11 పరుగులు సగం మాత్రమే! ఒక సద్యోచన (positive thinking) ఫలితమది. తృటిలో సెంచరీ మిస్సయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీడా స్ఫూర్తి తళుక్కున మెరిసింది. ఇందుకు పూర్తి విరుద్దంగా గుజరాత్ ఇన్నింగ్ చివర్లో… ఓ పరిణామం. అప్పటికే పీకలలోతు కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించే యత్నాల్లో బ్యాటర్ రూథర్ఫర్డ్ యత్నిస్తుంటే… అతనికి బాల్ అందనీకుండా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిందో ప్రయాస! పంజాబ్ బౌలర్ విజయ్ కుమార్ వైశాఖి వైడ్ వెనుక వైడ్ వేస్తున్నాడు. ఎంపైర్ కొన్నింటిని వైడ్ గా ప్రకటిస్తే, ఇంకొన్ని బంతుల్ని వదిలేస్తున్నాడు. వైడ్ అంటే పంజాబ్ రివ్యూ అడుగుతోంది, కాదంటే గుజరాత్ అడుగుతోంది. మొత్తానికి, ధాటిగా షాట్లు కొడుతూ, మూడ్ లో ఉన్న రూథర్ఫర్డ్ ఏకాగ్రత చెడింది. 11 పరుగులు వెనుకబడి గుజరాత్ ఓడింది. గెలుపు గుంజాటనలో, వరస వైడ్ బాల్స్ కుయుక్తుల్లో సాగిన దుర్యోచన (negative thinking) ఫలితంగా మ్యాచ్ పంజాబ్ గెలిచినా…. అసలు సిసలు క్రీడాస్ఫూర్తి తడబడింది.

ఇది ఒక పరిశీలన.
ఆట అంటే గెలుపేనా…? అంతకు మించిన క్రీడా స్ఫూర్తి ఉదాత్తత ఏమైనా ఉందా? ఇదొక ప్రశ్న!

Exit mobile version