Newsminute24

National: బీహార్ లో మళ్లీ కులాల కుంపటేనా..?

BiharElection:

ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగ ప్రవేశం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బీహార్ శాసనసభ ఎన్నికలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సవాళ్లుగా మారుతున్నాయి. 13 కోట్లకు పైగా జనాభాతో 243 స్థానాలున్న రాష్ట్రంలో ఈసారి కూడా రాజకీయాలు ఎప్పటిలాగే కుల సమీకరణాల చుట్టే తిరుగుతూ అన్ని పార్టీలకు కురుక్షేత్రంగా మారాయి. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ, ప్రతిపక్ష ఎంజీబీ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ప్రస్తుతం ఎమ్జీబీ కూటమిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) జేడీ (యూ)లో విలీనమైంది. ఈ రెండు కూటములను సవాల్ చేస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ కూడా బరిలోకి దిగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన ఏఐఎంఐఎం రాబోయే ఎన్నికల్లో కూడా మైనార్టీ ఓట్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎంజీబీ గట్టి సవాలు విసురుతున్న వేళ కుల సమీకరణాలు, చిన్న పార్టీలు రాబోయే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి.

దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నితీష్ కుమార్ పలుమార్లు ‘యూ’ టర్నులు తీసుకుంటూ కూటములు మార్చారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టిన నితీష్ కుమార్ అనంతరం విడిపోయి ఎంజీబీతో చేతులు కలిపారు. ఆయన తిరిగి 2024 లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీయేలో చేరడంతో బీహర్లోని మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 30 స్థానాలు ఆ కూటమి సాధించింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. నితీష్ కుమార్ తన పీఠం కాపాడుకుంటూ పలుమార్లు కూటములు మార్చారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పొటీ చేసి ముఖ్యమంత్రి అయిన నితీష్ 2017లో బయటకు వచ్చి బీజేపీతో కలిశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేసిన నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వస్తే, జేడీయూ 43 సీట్లకే పరిమితం కావడంతో ఆయన తన ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందని మరోసారి ఎంజీబీలో చేరారు. అయితే ఆశ్చర్యకరంగా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి కూటమి మారి తిరిగి ఎన్డీయేలో చేరారు. స్వప్రయోజనాలే లక్ష్యంగా నితీష్ కుమార్ ఇలా పదే పదే పొత్తులు, కూటములను మారుస్తుండడంతో ఆయన రాజకీయ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్పై విశ్వసనీయత అనేది జేడీ (యూ)కి, ఎన్డీఏకు సవాల్గా మారింది.


బీజేపీలో రెట్టించిన ఉత్సాహం..
లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ పొందలేకపోయిన బీజేపీ అనంతరం జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీలో ఉత్సాహం రెట్టింపయ్యింది. దీనికి తోడు బీహార్లో పలు ప్రాంతాల్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండడంతో అసెంబ్లీ ఎన్నికలపై ఆ పార్టీలో విశ్వాసం పెరిగింది. అయితే ఇటీవల వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేడీ (యు) మద్దతివ్వడంతో ముస్లిం మైనార్టీలు నితీష్ కుమార్పై కోపంగా ఉన్నారు. నితీష్కు మద్దతుగా ఉంటున్న ముస్లింలు, దళితులు ఈసారి ఎన్డీయే కూటమికి ఓట్లు వేయాలంటే బీజేపీ హిందుత్వ ఎజెండాను ప్రదర్శించడంలో సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. బీహార్ ఎన్డీఏ కూటమిలో పైచేయి సాధించాలని బీజేపీ చూస్తుంది. ఇటీవల జరిగిన మంత్రి మండలి విస్తరణలో కొత్తగా ఏడుగురిని చేర్చుకోగా, ఇందులో అందరూ బీజేపీ నేతలే ఉన్నారు. మొత్తం 36 మంత్రి పదవుల్లో 21 బీజేపీ వద్దనే ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోనే ఎన్డీఏ బరిలోకి దిగుతున్నా అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూటమి తరఫున కాబోయే సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత అధిష్టానం నిర్ణయిస్తుందని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు జేడీ (యు) వర్గాల్లో ఆందోళనతో పాటు కూటమిలోని లుకలుకలను స్పష్టం చేస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందే నితీష్ కుమార్ను ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జేడీ(యు) వర్గాలు పట్టుబడుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఇలాగే కొనసాగితే ఇరు పక్షాల మధ్య ఓట్లు చీలే అవకాశం ఉంది.


ఆర్ఎస్ఎస్ దూకుడు..
రాజకీయాల్లో బీజేపీకి వెనుదన్నుగా ఉండే ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ సంస్థ ఎన్నికల్లో తలదూర్చకుండా ఉంటే ఆ ఎలా ఉంటుందో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య దూరం పెరగడంతో జరిగిన నష్టం తెలుసుకున్న బీజేపీ, అనంతరం తిరిగి ఆర్ఎస్ఎస్కు దగ్గరైంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనుక ఆర్ఎస్ఎస్ వ్యూహారచన ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీహార్లోనూ బీజేపీకి తోడ్పాటు అందిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీ అధ్యక్షులు జేపీ నడ్డా బీహార్లో సందర్శించిన కొన్ని రోజులకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మార్చి 6న బీహార్లో పర్యటించారు. అయితే, బీహార్లో జరిగే రాజకీయ పరిణామాలు బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్కు కూడా అగ్ని పరీక్షలా నిలవబోతున్నాయి. సామాజిక న్యాయమే లక్ష్యంగా 2023లో జేడీ(యు), ఆర్జేడీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన కులగణనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించాయి. జేడీ(యు), ఆర్జేడీ సోషలిస్టు భావాలను గట్టిగా వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్కి ఈ ఎన్నికల్లో ఎన్డీఏలో జేడీ (యు) పార్టీ కీలకంగా ఉండడంతో ఎన్నికల వ్యూహరచన క్లిష్టంగా మారింది.
మహాఘట్బంధన్కి అంత ఈజీ కాదు
యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ స్థానికంగా పటిష్టంగా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీ ఈసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ హయాంలో ఆర్జేడీకి అంటిన అవినీతి మరకలను వదిలించుకునే ప్రయత్నంలో ఆయన సఫలం అవుతున్నారు. 35 ఏళ్ల తేజస్వీ ఉద్యోగాలు, అభివృద్ధి గురించి మాట్లాడుతూ యువతను ఆకర్షిస్తున్నారు. అయితే ఆయనకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో ఎంజీబీలో ఐక్యత సాధించడం సవాల్గా మారనుంది. ఎమ్జీబీ కూటమికి సంప్రదాయంగా ఉన్న ముస్లిం, యాదవ్ సామాజిక ఓటు బ్యాంక్కు అదనంగా ఇతర వర్గాలను కూడా ఆకర్షిస్తేనే ఎంజీబీకి కుర్చీ దక్కుతుంది. నిరుద్యోగం, అభివృద్ధి అంశాలను లేవనెత్తడం ప్రధానంగా యువత ఆర్జేడీ వైపు మళ్లే అవకాశాలున్నా, అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ మసకబారుతుండటం ఎంజీబీకి ప్రతికూలంగా మారుతుందనే ఆందోళన ఆర్జేడీ వర్గాల్లో ఉంది. ఇటీవల హర్యానా, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం.


జన సురాజ్కి జనాకర్షణ ఉందా?

వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను తాను అధికారంలో తెచ్చానని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సొంత రాష్ట్రం బీహార్లో జన సురాజ్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై బీహార్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన వ్యూహాలు రూపొందిస్తున్నారు. కులం ప్రస్తావన లేకుండా పారదర్శకమైన పాలనతో రాష్ట్రానికి అభివృద్ధిని అందిస్తానని ఆయన చెప్తున్నారు. కానీ, కులాల చుట్టే రాజకీయాలు నడిచే బీహార్లో ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పట్టణాల్లో మధ్యతరగతి యువత పీకే పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారుతాయా లేదా వేచి చూడాలి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తూ ఎన్డీఏ, ఎంజీబీ కూటముల ఓట్లు ఏమేరకు చీలుస్తుంది..? ఏ కూటమికి నష్టం జరగనుందో ఆసక్తిగా మారుతోంది.
గత ఎన్నికల లెక్కల ప్రకారం బీహార్ రాష్ట్రంలో బీజేపీ, ఆర్జేడీ పార్టీలకు చెరో 20 శాతం చొప్పున ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో జేడీ(యు) 14.5 శాతం, కాంగ్రెస్ 8 శాతం, కమ్యూనిస్టులు 6 శాతం ఓటు బ్యాంకు కలిగున్నాయి. బీహార్లో అధికారం దక్కాలంటే సుమారు 40 శాతం ఓట్లు సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. 2020 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన కూటములైన ఎన్డీఏ, ఎంజీబీ చెరో 37 శాతం ఓట్లు సాధించాయి.

బీహార్లో కులం చుట్టే ఎన్నికలు..

రాష్ట్రంలో 2023 కులగనణ ప్రకారం బీహార్లో మొత్తం 13.07 కోట్ల జనాభా ఉంది. ఇందులో అత్యంత వెనుకబడిన ఈబీసీలు 36.01 శాతం, ఇతర వెనుకబడిన తరగతులైన ఓబీసీలు 27.13 శాతం, ఎస్సీలు 19.65 శాతం, ఎస్టీలు 1.68 శాతం ఉన్నారు. అంటే మొత్తం 84.47 శాతం బడుగు, బలహీన వర్గాలే కావడం విశేషం. అగ్రకులాలు 15.52 శాతం ఉండగా, వీరిలో బ్రాహ్మణలు 3.65 శాతం, రాజ్పుత్లు 3.45 శాతం, భూమిహార్ 2.86 శాతం, కాయస్థ 0.6 శాతం ఉన్నారు. దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓబీసీల్లో యాదవులు అత్యధికంగా 14.26 శాతం ఉండగా, వీరి తర్వాత కోయిరీలు 4.21 శాతం ఉన్నారు. రాష్ట్రంలో ముస్లింలు 18 శాతంతో ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను ఎంజీబీ కూటమి భారీగా 76 శాతం పొందగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 5 శాతం ఓట్లే వచ్చాయి.
ఆర్జేడీ తన సాంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటర్ల మద్దతుతో పాటు ఇతర వర్గాల ఓట్లను కూడా పొందాలనే లక్ష్యంతో ఎమ్వై-బిఏఏపి వ్యూహాన్ని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చింది. ఎమ్-ముస్లిం, వై -యాదవ్లు, బి-బహుజన్లు, ఏ-అగ్డా (అగ్ర కులాలు), ఏ-ఆధీ ఆబాదీ (మహిళలు), పి-పూర్ (పేదలు) వర్గాలతో లబ్ది పొందాలని చూసింది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చిన పిడిఎ (పిచడ్, దళిత్, అల్పసంఖ్యాక) సూత్రం నుండి ప్రేరణగా ఈ వ్యూహాన్ని బీహార్లో ప్రయోగించారు. అయితే యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ప్రయోజనం చేకూర్చిన ఈ వ్యూహం బీహార్లో ఆర్జేడీకి అనుకూలంగా మారకపోవడంతో ఆర్జేడీ 4, కాంగ్రెస్ 3, సీపీఐ (ఎంల్) 2 ఎంపీ సీట్లు మాత్రమే సాధించగలిగాయి. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో బలపడిన యాదవ్-ముస్లిం ఆధిపత్యాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా లవ్కుష్ ఫార్ములాను రచించారు. లవ్కుష్లో భాగంగా కుశ్వాహా, కుర్మీ సామాజిక వర్గాలను ఏకం చేసి నితీష్ కుమార్ బీహర్లో తమ పార్టీని బలోపేతం చేసుకున్నారు. రాష్ట్రంలో ఆర్జేడీ ఆధిపత్యాన్ని ఎదుర్కొని నితీష్ వరుస విజయాలు సాధించడంలో లవ్కుష్ ఫార్ములా కీలక పాత్ర పోషించింది.

నవంబర్ 2024లో బీహార్లోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగగా రెండు స్థానాల్లో బీజేపీ, ఒకటి జేడీయూ, మరొకటి హిందుస్తానీ అవాస్ మోర్చా సెక్యూలర్ పార్టీ గెలుచుకుంది. ఆర్జేడీ కుల సమీకరణాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ప్రభావం చూపలేకపోయింది. అయితే, మూడు చోట్ల ఈ పార్టీ మూడో స్థానంలో నిలవగా, ఒక చోట నాలుగో స్థానంలో నిలిచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రోత్సాహంగా ఉప ఎన్నికల ఫలితాలు పీకే పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చాయి.

 

సీట్ల పంపకంలో సవాళ్లు..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎన్డీయే, ఎంజీబీ కూటములకు సవాళ్లుగా మారనున్నాయి. ఎన్డీయే సీట్ల పంపకంలో బీజేపీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నట్టు సంకేతాలు వెలువడతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 100కి పైగా సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో నితీష్ బలహీనపడే ప్రమాదం ఉంది. ఎన్డీయే కూటమిలో ఉన్న చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ (ఆర్వీ), జితన్ రామ్ మాంరీa హామ్ వంటి చిన్న పార్టీలు పాశ్వాన్లు, మహాదళిత్ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అధిక సీట్లు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఉన్నత వర్గాల ఓట్లను ఆకర్షించలేకపోతుండటం, వామపక్షాలు గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావడంతో ఆర్జేడీ ముస్లిం, యాదవ్ ఫార్ములాపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర వర్గాలను కూడా ఆకర్షించే వ్యూహాలతో అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కుల, వారసత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా వస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న జన సురాజ్ పార్టీ బలమైన, నమ్మకమైన అభ్యర్థులను ఎన్ని నియోజకవర్గాల్లో నిలబెట్టగలదనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నే.

అభివృద్ధి వర్సెస్ అసంతృప్తి..

పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, శాంతి భద్రతల విషయంలో ఎన్డీయే ప్రభుత్వంపై సంతృప్తి కనిపిస్తుంది. అయితే అధిక జనాభా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి కనిపిస్తుంది. సీమాంచల్, తిర్హుత్ ప్రాంతాల్లో వరదలు సంభవించినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడినప్పుడు నితీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం కనిపిస్తుంది. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ రైతులకు రుణమాఫీ, యువతకు ఉద్యోగాల హామీలతో గ్రామీణ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బీహార్ యువత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వలస కూలీలుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వి యాదవ్ ఇస్తున్న హామీలపై యువతలో చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో ఇంత భారీగా ఉద్యోగాలు సాధ్యామేనా అనే సందేహాలు కూడా ఉన్నాయి. జన సురాజ్ పార్టీ విద్య, వైద్యం నినాదం ఓటర్లను ఆకర్షిస్తున్నా ఆ పార్టీకి రాష్ట్రంలో కుల బలం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

మద్య నిషేధం తర్వాత రాష్ట్రంలో మహిళలు నితీష్ కుమార్ ఆర్మీగా మారారు. మద్య నిషేధం అంశాన్ని ఎన్డీయే సానుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ చేసినట్టుగానే బీహార్లో మహిళలకు ఆర్థిక సహాయం, ఉద్యోగాల కల్పన వాగ్దానాలను ఆర్జేడీ చేస్తోంది. ఆర్జేడీతో పోలిస్తే బీజేపీకి అధునాతన డిజిటల్ నెట్వర్క్ ఉంది. బీజేపీ తమ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో వాట్సాప్ నెట్వర్క్ ద్వారా పూర్తి అనుసంధానం చేసింది. ఈ విషయంలో ఆర్జేడీ బలహీనంగా ఉంది. పట్టణ యువతను ఆకర్షించడానికి జన సూరజ్ వైరల్ ఔట్రీచ్పై ఆధారపడుతోంది. అయితే రాష్ట్రంలో తక్కువ అక్షరాస్యత రేటు, అందరికీ సాంకేతక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల రాష్ట్రంలో డిజిటల్ వ్యూహాలు అంతగా పని చేసే అవకాశాలు లేవు.
గతంలో వలే 2025 శాసనసభ ఎన్నికల్లోనూ బీహార్లో కుల సమరమే ప్రధానం కానుంది. తగ్గిపోతున్న నితీష్ కుమార్ వైభవానికి బీజేపీ ఉత్సాహం ఔషధంలా పనిచేస్తుందా..? మహాఘట్బంధన్కు ప్రజాకర్షక హామీలు విజయం సాధించి పెడుతాయా…? నూతన జన సూరజ్ వినూత్న ఎజెండాకు ప్రజాదరణ దక్కుతుందా..? వేచి చూడాలి. బీహార్ ఫలితాలు దేశ రాజకీయాలపై కూడా ప్రభావితం చేయడం ఖాయం. ఫలితాలను బట్టి జాతీయ స్థాయిలో బలబలాలు, పార్టీలు కూటములు మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఎన్డీఏ గెలిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం పెరుగుతుంది. ఆర్జేడీ గెలిస్తే ‘ఇండియా’ కూటమి ప్రాబల్యం పెరుగడం ఖాయం.

=======


-ఆర్.దిలీప్ రెడ్డి,
డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

Exit mobile version