Nancharaiah merugumala:
==================
“భారత పార్లమెంటు భవనానికి నూరేళ్లు నిండకుండానే కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ నిజంగా గ్రేటేనా?”
బ్రిటిష్ ఇండియా సర్కారు 1927లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (ఐఎల్సీ–కౌన్సిల్ ఆఫ్ స్టేట్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ: కేంద్ర చట్టసభల ఎగువ దిగువ సభలు) కోసం నిర్మించిన భవనంలోనే 1947 ఆగస్ట్ 15 నుంచి భారత రాజ్యాంగ రచన పూర్తయ్యే వరకూ రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరిగాయి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించాక 1950 జనవరి నుంచి భారత పార్లమెంటు ఉభయసభల సమావేశాలు కూడా ఈ భవనంలోనే 70 ఏళ్లకు పైగా జరుగుతూనే ఉన్నాయి. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూట్యెన్స్, హెర్బర్ట్ బేకర్ రూపుదిద్దిన ఈ భవనం 2027లో నూరేళ్లు నిండక ముందే భారత బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ సెంట్రల్ విస్టాలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం పూర్తిచేయించారు.. 2023 నుంచి ఈ కొత్త భవనంలోనే కేంద్ర చట్టసభల సమావేశాలు జరుగుతాయంటున్నారు. పాత భవనంలోనే బడ్జెట్ సమావేశాల ఆరంభం సందర్భంగా పార్లమెంటు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారని కూడా వార్తలొచ్చాయి. మళ్లీ పాత భవనం విషయానికి వస్తే, 20వ శతాబ్దం సగం పూర్తయినప్పటి నుంచి అంటే 1950, జనవరి 26 నుంచీ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వేళ్లూనుకోవడానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ బీంరావ్ ఆర్ అంబేడ్కర్ తోడ్పాటుతో తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ తన వంత కృషి చేశారు. 1964 మే వరకూ పండిత్ జీ చేసిన ‘సేవ’కు పాత పార్లమెంటు భవనమే సాక్ష్యం. నెహ్రూ గారు కాస్త అటూ ఇటుగా భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని సార్లు అయిష్టంగానే నడిచారు. ‘నవభారత నిర్మాత’గా చరిత్రకారుల ప్రశంసలు సంపాదించారు.
కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన జవాహర్ సాహబ్ ఆయన కూతురు, మనవడు, ఇతర కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రధానులు అధికారం చెలాయించిన పార్లమెంటు భవనం స్థానంలో కొత్త ఆధునిక సౌధం నిర్మించడం ద్వారా కాషాయ ఓబీసీ ప్రధాని నరేంద్ర మోదీ ఆధునిక భారత చరిత్రలో చాలా కాలం నిలిచిపోతారు. అనేక కీలక విధాన నిర్ణయాల మాదిరిగానే– పాతదైపోతున్న బ్రిటిష్ వారి హయాం నాటి భవనం స్థానంలో కొత్తది నిర్మించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ (యూపీఏ) పాలనా కాలంలోనే వచ్చింది. మొత్తం మీద 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లలోనే నూతన పార్లమెంటు భవనంలో భారత సంసద్ సమావేశాలు జరగడం వినడానికి, చూడడానికి బాగుంటుందేమో.