Nancharaiah merugumala senior journalist:
మెదక్ జిల్లా మూలాలున్న ఈ ఇద్దరు తెలంగాణ బ్రాహ్మణ ‘జ్యోతిష్యుల్లో’ ఒకరు మాత్రమే దుర్బుద్ధిజీవా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్ కొన్ని దశాబ్దాలపాటు ఆంధ్రోళ్ల పెత్తనానికి వేదిక అయిందనేది తెలంగాణవాదుల ఆరోపణే కాదు. వాస్తవం కూడా. తెలుగు సినిమా రంగం హైదరాబాద్‌కు పూర్తిగా వచ్చాక రాష్ట్ర ‘సాంస్కృతిక, సినిమా’ రంగాల్లో కోస్తా జిల్లాలకు చెందిన ఉస్తాదులు లేదా వస్తాదుల ఆధిపత్యం సాగిన మాట కూడా నిజం. రవీంద్ర భారతి, శ్రీ త్యాగరాయ గానసభ వంటి పేరుమోసిన ‘సాంస్కృతిక వేదిక’లపై కోస్తాంధ్ర నేపథ్యం ఉన్న సభా సామ్రాట్ ‘ఎల్‌ఐసీ’ కేవీ భాస్కరరావు, అక్కినేని నాగేశ్వరరావు, తుర్లపాటి కుటుంబరావు వంటి వాళ్లు చానాళ్లు కనిపించి ప్రేక్షకులకు విసుగు పుట్టించేవారు. అలాంటిది బెజవాడ వేమూరి బలరామ్ గారి వారపత్రిక ‘స్వాతి’ ద్వారా తెలుగు వారందరికీ మొదట పరిచయమైన ‘న్యూమరాలజిస్టు’ దైవజ్ఞ శర్మ గారు పైన చెప్పిన రంగాల్లో తెలంగాణకు తనదైన వినూత్న, వినమ్ర శైలిలో ‘మంచి ప్రాతినిథ్యం’ తీసుకొచ్చారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మాదిరిగానే ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఈ సంఖ్యాశాస్త్రవేత్త (న్యూమరాలజిస్టు) ఒద్దిక గల సద్బ్రాహ్మణుడిలా అన్ని ప్రాంతాల వారికి, తెలుగు సినిమా రంగం పెద్దలకు సన్నిహితంగా ఉంటూ బతుకుతున్నాడు. ఏ కార్యక్రమంలో చూసినా గతంలో బాగా కనిపించిన దైవజ్ఞ శర్మ పిలవకుండానే వచ్చేస్తాడా? అనేంతగా అన్నిచోట్లా దర్శనమిచ్చేవాడు. ఏనాడూ వివాదాల్లో ఇరుక్కోకుండా కేసీఆర్‌కు తెలుగు నేర్పిన దుబ్బాక హైస్కూలు తెలుగు పండితుడు మృత్యుంజయ శర్మ గారి మాదిరిగా దైవజ్ఞ వర్మ అత్యంత గంభీరంగా కనిపిస్తారు. సంఖ్యాశాస్త్రం పేరుతో ఈ దైవజ్ఞుడు చెప్పేది కూడా జోస్యమే మరి. ఈయన అంకెల జోస్యాలు ఎందుకో మరి వివాదాలు, సంచలనాలు సృష్టించలేకపోయాయి. ఆదాయం కూడా ‘ఆస్ట్రోలజర్’ పరాంకుశం వేణుస్వామి స్థాయిలో సంపాదించి ఇవ్వలేకపోయాయి.
పాత మెదక్ జిల్లాకే చెందిన మరో బ్రాహ్మణ జ్యోతిష్కుడు పరాంకుశం వేణుస్వామి–
నిత్యం రంగురంగుల కుర్తా, అడ్డ పంచె కట్టుకుని ప్రశాంత వదనంతో కనిపించే దైవజ్ఞ శర్మ మాదిరిగానే పాత మెదక్ జిల్లాకు (శివ్వంపేట ప్రాంతానికి) చెందిన తర్వాతి తరం బ్రాహ్మణ దుర్బుద్ధిజీవి వేణుస్వామి పరాంకుశం అనేది కొందరి అభిప్రాయం. ఈ చిన్న స్వామి గత కొన్నేళ్లుగా రాజకీయ లేదా ఎన్నికల జోస్యాలు చెబుతూ సంచలనాల మీద సంచలనాలు సృష్టించి చివరికి ఈ మధ్య అంటే కొన్ని నెలల ముందు ఏపీ ఎన్నికల ఫలితాలపై తన జోస్యం పూర్తిగా తప్పడంతో ఖంగుతిన్నాడు. ఇక ఎలక్షన్ ప్రిడిక్షన్లకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. మొన్న శోభిత ధూళిపాళ్ల–నాగచైతన్య అక్కినేని బంధంపై జోస్యం చెప్పి నాలుక కరుచుకోవడమేగాక తెలుగు సినీ జర్నలిస్టులు, సినీరంగ ప్రముఖుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇకపోతే, దైవజ్ఞ శర్మ మొదట ఆంధ్రా వీక్లీ ‘స్వాతి’ ద్వారా తన సామర్ధ్యానికి మించి అడ్డగోలుగా ఎక్కువ ప్రచారం సంపాదిస్తే, తనకు తెలియని తెలుగు రాజకీయాలు, ఎన్నికల ఫలితాలపైన, తెలుగు సినీ ప్రముఖుల వ్యక్తిగత, వృత్తిగత జీవితాల పైన తన అంచనాలు, ప్రిడిక్షన్లు చెప్పి వేణుశర్మ ఈ మధ్య అంత కన్నా ఎక్కువ ప్రచారం, డబ్బు తన ఖాతాల్లో వేసుకోగలిగాడు. సినీతారల ఇళ్లకు పోయి మరీ పూజలు చేయించి పుణ్యంకట్టుకుంటున్నాడు. తన భార్యను కూడా తన వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అనుకూలంగా వాడుకోవడం వేణుస్వామి ప్రత్యేకత. చివరికి తన భార్య వీణా శ్రీవాణి (సత్యవాణి) లాగానే ఏపీ కోస్తా జిల్లాల్లో కుటుంబ మూలాలున్న శోభిత–నాగచైతన్య దాంపత్యంపై చెప్పిన జోస్యం వేణుస్వామి ‘కొంప ముంచిందని’ అప్పుడే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే..?
‘వైష్ణవుల ప్రత్యక్ష దైవం’ త్రిదండి శ్రీమన్నారయణ జీయర్ స్వామి మాదిరిగానే శ్రీవైష్ణవుడైన వేణుస్వామి కూడా– ఒకే మనిషిని, ఒకే సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడే వ్యక్తి కాదు. ఇన్నాళ్లకు హైదరాబాద్ పొరుగున ఉండే పూర్వపు మెదక్ జిల్లాలో కుటుంబ మూలాలున్న ఇద్దరు తెలంగాణ బ్రాహ్మణ ‘బుద్ధిజీవులు’ హైదరాబాద్‌లో తమ ఉనికిని, జేబుల్ని విస్తరించుకోవడం తెలంగాణ ఆవతరించిన పదేళ్ల తర్వాత మంచి పరిణామమే కదా. తెలంగాణకు ఇప్పుడు మరో వంద మంది దైవజ్ఞ శర్మలు, రెండొందల మంది వేణు స్వాముల అవసరం ఎంతైనా ఉంది. ఇది సాధ్యమైననాడు తెలంగాణ దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం అవుతుంది. అమెరికాకు తొలి నల్లజాతి–భారత ప్రెసిడెంట్ కమలాదేవి హారిస్‌ను అందించడానికి సిద్ధమౌతున్న‘సిలికాన్ వ్యాలీ’ కాలిఫోర్నియాను మించిపోతుంది!