APpolitics: ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మేము ఊహించిన దానికంటే దిగజారి మాట్లాడుతున్నాడని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భార్య అనే బంధాన్ని కించపరిచేలా.. సంబోధించే విషయంలో.. పెళ్లి గురించి మాట్లాడే సమయంలో.. మహిళల మనోభావాలు.. ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అత్యున్నత పదవిలో ఉన్న ఈ వైసీపీ ముఖ్యమంత్రి ప్రతిసారీ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “ప్రతి మాటకు పరిధి ఉంటుందని.. అలాగే ప్రతి వ్యాఖ్యను ఎదుర్కోవడానికి కూడా సహనం ఉంటుందని.. ఈ ముఖ్యమంత్రికి ప్రతిసారి బుద్ధి వస్తుందని ఇన్ని రోజులు ఎదురు చూశామని అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు.ముఖ్యమంత్రి ప్రసంగం స్ఫూర్తివంతంగా ఉండాలని.. రాష్ట్రం గురించి వివరించి.. సమస్యలను పరిష్కరిస్తూ ఎలా ముందుకు వెళతాం అనేది చెప్పాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ పదే పడే మాట్లాడుతూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నాడని గుర్తు చేశారు. ఈ ముఖ్యమంత్రికి పాలన చేతగాక.. మానసిక స్థితి సరిగాలేక ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో ఎంత మంది నష్టపోయారో, ఎంత మంది ఉపాధి లేక వలస వెళ్లిపోయారో లెక్క లేదని మనోహర్ పేర్కొన్నారు.
జగన్ సంతకం చేస్తే రూ.కోట్లలో అవినీతి
ప్రజాధనంతో నిర్వహించే సభలో రాష్ట్ర భవిష్యత్తుపైనా, యువతకు కల్పించాల్సిన అవకాశాలు, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల గురించి మాట్లాడాల్సిన జగన్.. వాటిని వదిలేసి జనసేన అధినేతని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మనోహర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని.. అందులోనూ మహిళలను కించపరిచేలా, వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి తీరును ఖండిస్తున్నట్లు నాదెండ్ల స్పష్టం చేశారు.
అహంకారంతో పేట్రేగిపోతున్నారు
సీఎం ప్రసంగించే వేదిక ముందు మహిళలు ఉన్నారా.. పిల్లలు ఉన్నారా అనేది చూడకుండా ఇష్టానుసారం, నోటికి ఎంత వస్తే అంత సీఎం మాట్లాడుతున్నారని మనోహర్ ఆరోపించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని కించపరుస్తున్నారని ..దీనిపై కచ్చితంగా వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని.. త్వరలో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా చేయబోయే కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగేలా ప్రయత్నం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. మహిళల పట్ల ఎంత హుందాగా నడుచుకోవాలో..ఎంత గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాలో తెలిసేలా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రతిసారీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూనే..మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవానికి సీఎం భంగం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలే ఈ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని నాదెండ్ల చెప్పకనే చెప్పారు.