Mancherial : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భాగంగా భట్టి.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా.. పదివేల కోట్లు ఖర్చుతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిపడ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్రజలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందే.. ఉద్యోగ అవకాశాల కోసమని అలాంటిది ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం వెనక దాగున్న మర్మమెంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా అందరికీ రూల్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించాడు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం మునక ప్రాంతాన్ని కాపాడుతూ… ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ చేపిస్తామని భట్టి స్పష్టం చేశారు.
ఇక సీఎం కెసిఆర్ మాయాలో పడి ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు కొంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా.. ఆస్తులు వెనక్కు తీసుకుంటుందని భట్టి హెచ్చరించారు. ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముతు.. విశాఖ ఉక్కు కొంటామని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.కెసిఆర్ ను ఇష్టానికి వదిలేస్తే.. అన్నిటినీ అమ్మేసినట్లే రాష్ట్రాన్నే అమ్మేస్తాడని భట్టి అరోపణలు చేశారు.