Newsminute24

కాంగ్రెస్ కి ఓటేద్దాం… బీజేపీని సాగనంపుదాం : గిడుగు రుద్రరాజు

APCONGRESS: 2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దానికి ఇంకా ఒక్క సంవత్సరమే మిగిలి ఉంది. కానీ, ఇప్పటి వరకూ కనీసం ఒక్క హామీ కూడా బీజేపీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకుని, 2014 సాధారణ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ ఆనాడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి దైవ సన్నిధిలో మాట్లాడుతూ…”ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకురావడంతో వెంకయ్యనాయుడిదే ప్రధాన పాత్ర, మేం దానిని అమలు చేస్తాం” అని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. కానీ, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై మాట మార్చారు. అది ముగిసిన అధ్యాయమని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా మోసం చేశారు. ఇదీ బీజేపీ ద్వంద వైఖరి…!

ప్రత్యేకహోదా మాత్రమే కాదు, విభజన చట్టంలో ఉన్న ఏ హామీనీ బీజేపీ సంపూర్ణంగా అమలు చేయలేదు. ప్రత్యేక హోదాకు బదులు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ ఎప్పుడు వస్తుందో, దానితో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో మానవమాతృలెవరికీ తెలియదు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పరిశ్రమ కూడా అడుగుపెట్టని దుస్థితి ఏర్పడింది. ఇక, రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటు నుంచి తెచ్చిన ముంత మట్టి.. చెంబుడు నీళ్లు ఇచ్చారు తప్ప, ఒక్క పైసా నిధులివ్వలేదు. ఇదీ ఆంధ్రప్రదేశ్ పై మోదీకి ఉన్న ప్రేమా…!

 

వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీకి కూడా దిక్కులేదు. రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామన్న జాతీయ హోదాను కూడా గోదావరిలో కలిపేశారు. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు పడకేసి, నత్తనడకన నడుస్తోంది. ఉత్తరాంధ్రకు ఇస్తామన్న రైల్వే జోన్, వైజాగ్ మెట్రో ప్రాజెక్టు కోసం ఈ తొమ్మిదేళ్లలో కనీసం ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. ఎప్పుడు అడిగినా పరిశీలిస్తున్నాం, అధ్యయనం చేస్తున్నామంటున్నారు తప్ప, ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం లేదు. ఇదీ బీజేపీ దొంగ నాటకం…!

విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సమాన విద్యావకాశాలు ఉండాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. ఈ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ అన్యాయం చేసింది. గిరిజన విశ్వవిద్యాలయానికయితే బీజేపీ ఒక్క ఇటుక పేర్చిన పాపన పోలేదు. ఇక ఈ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత సరేసరి. ఇదీ బీజేపీ విశ్వసనీయత…!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో వచ్చిన ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు అమ్మడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ప్రతిపక్షాలు ఆందోళనలు, దీక్షలు చేస్తున్నా బీజేపీ చోద్యం చూస్తోంది. ఇదీ బీజేపీ నిర్వాకం …!

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమీపంలో దుగరాజపట్నం ఓడరేవు నిర్మించాలి. కానీ, ఈ బాధ్యతను కూడా బీజేపీ గాలికి వదిలేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తూ, రాష్ట్రంలోనే అతిపెద్ద పోర్టులుగా ప్రఖ్యాతిగాంచిన గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను సైతం, వైఎస్సార్సీపీతో కుంబక్కై అదానీ చేతిలో పెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుంది. ఇలా ప్రజల సంపదను దోచుకుంటున్న మోదీ, అదానీల చీకటీ ఒప్పందాన్ని ప్రశ్నించింనందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై, బీజేపీ కక్ష సాధింపులు మొదలుపెట్టింది. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఇదీ బీజేపీ నియంతృత్వ వికృత రూపం…!

విభజన చట్టం ప్రకారం వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో కనీసం రూ.30,000 కోట్లు కేటాయించాలి. కానీ, ఈ తొమ్మిదేళ్లలో ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రామాయపట్నం పోర్టు కట్టలేదు. దేవుడి గురించి పదే పదే మాట్లాడే పార్టీ కనీసం తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ కూడా ఇవ్వడం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పిన బీజేపీ, భిక్షమేసినట్లు జిల్లాకు 50 కోట్ల చొప్పున మూడు సంవత్సరాలు నిధులిచ్చారు. ఇదీ బీజేపీ భాగోతం…!

దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధీ లేదు. 2022 పోయినా, దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. నోట్ల రద్దు చేసినా, పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలూ పడలేదు. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పెరగలేదు. పైగా, పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్ ధరల్ని పదే పదే పెంచుతూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ఇలా ఒక్కటీ కాదు, రెండు కాదు… ‘బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ ఒక మోసం! చెప్పిన ప్రతి మాటా ఒక ద్రోహం!’ అని ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలుగుతున్న కాలమిది. ఈ సమయంలో మొత్తం దేశానికి చేసిన ద్రోహం ఒక ఎత్తయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగువారికి చేసిన ద్రోహం మరో ఎత్తు! చరిత్ర మరవని ఈ ద్రోహం గురించి మనం చర్చించుకోవాల్సిందే, ద్రోహం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాల్సిందే.

పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై, కలలపై బీజేపీ మట్టికొట్టింది. మన దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన జన విరోధ బీజేపీని క్షమించకూడదు. ప్రజలను పీడిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పే అవకాశం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ద్వారా వచ్చింది. మే 10న జరిగే కర్ణాటక శాసనసభా ఎన్నికల్లో మన తెలుగువారంతా కలిసి ఓటు అనే వజ్రాయుధంతో బీజేపీని ఓడించి, విభజన హామీల అమలుపై, బీజేపీ చేస్తున్న అన్యాయలపై నిరంతంరం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. నియంతృత్వ పాలన నుంచి మన దేశానికి, రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి చేతి గుర్తుపై ఓటేసి, కాంగ్రెస్ తో చేతులు కలపండి.

===========================


గిడుగు రుద్రరాజు,
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అధ్యక్షులు

Exit mobile version