హైదరాబాద్, జూలై 12:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ ధర్నా చౌక్ వద్ద వారు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత ట్విట్టర్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని… ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
“కేసీఆర్ ప్రభుత్వంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచి, వారి జీవనోపాధికి భరోసా కల్పించాం. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీని ఈ ఉద్యోగులకూ వర్తింపజేశాం. కానీ ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం,” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు.