APpolitics: ముఖ్యమంత్రి బటన్లు నొక్కే కార్యక్రమం మానుకుని భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. వారానికి రెండు మూడు రోజులు మించి పనులు దొరక్కపోవడంతో ఆ కష్ట జీవులు పడే ఇబ్బందులను పాలకులు అర్ధం చేసుకోవాలన్నారు. పని కల్పించడమే ప్రభుత్వం నుంచి వారు కోరుకునే మార్పని తెలిపారు. జనసేన ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులను కాపాడుకునే విధంగా అన్ని విధాలా భరోసా కల్పిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి రోజు పని కల్పించే విధంగా మార్పులు తీసుకువస్తామన్నారు. శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాల్లో భాగంగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద భవన కార్మికులకు ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమంలో మనోహర్ పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని స్వయంగా వడ్డించారు. వారితో కలసి అల్పాహారం స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
భవన నిర్మాణ కార్మికులతో కలసి అల్పాహార స్వీకరిస్తూ మనోహర్ వారితో ముచ్చటించారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ.. మాకు పని దొరికితే చాలు.. మేము ఇంకా ఏమీ కోరం. రూ. 10 వేలు ఇచ్చి ఆదుకోమని మేము చెప్పం. మాకు పని కల్పిస్తే అదే పది వేలు. రోజూ పని కల్పిస్తేనే మా కడుపు నిండుతుంది. ఇప్పటికీ ఇసుక కొరత ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు మాత్రమే ఇసుక దొరుకుతుంది. సామాన్యులకి ఇప్పటికీ దొరకడం లేదు. వారానికి రెండు రోజులు మించి పని దొరకడం లేదు. ఎవరైనా పనికి పిలుస్తారా అని మధ్యాహ్నం వరకు వేచి చూస్తాం. ఎవరూ పిలవకపోతే వెళ్లిపోతాం. ఆ రోజు పస్తు పడుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం రాక ముందు పనులు బాగానే దొరికేవి. ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చాక మాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఒకప్పుడు బెంజి సర్కిల్ అడ్డాకి రెండు వేల మంది భవన నిర్మాణ కార్మికులు వచ్చే వారు. పనులు దొరక్క ఇప్పుడు వెయ్యి మంది కూడా రావడం లేదు. మాకు ఒక ఫిక్సడ్ వేతనం కూడా కల్పిస్తే బాగుంటుంది. కార్మిక సంక్షేమ నిధి ఈ ప్రభుత్వం పూర్తిగా తీసివేసింది” అంటూ తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అమ్మిశెట్టి వాసు, పోతిన మహేష్ పాల్గొన్నారు.