Newsminute24

పాలమూరుకు కొత్తగా ఆయకట్టు ఇచ్చింది లేదు: భట్టి విక్రమార్క

Tcongress: జడ్చర్ల నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్ట.. కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ మిగులు బ‌డ్జెట్ తో ధ‌నిక రాష్ట్రంగా తెలంగాణనే ఏర్పాటు చేసిందన్నారు సిఎల్పీ మల్లు భట్టి విక్రమార్క. తొమ్మిదిన్న‌ర ఏళ్ల‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఎటువంటి ఆస్తులును,  వ్య‌వ‌స్థ‌ల‌ను, బ‌హుళార్ధ‌క సాధ‌క ప్రాజెక్టును, సంప‌ద‌ను, ప్రాజెక్టుల‌ను సృష్టించ‌లేదని ఆయన తేల్చిచెప్పారు.

రాష్ట్ర బ‌డ్జెట్ తో పాటు ఇంకా రూ. 5 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి కూడా రాష్ట్రానికి ఎటువంటి సంప‌ద‌ను సృష్టించ‌లేదన్నారు.చివ‌ర‌కు రాష్ట్రానికి బ్యాంకులు కూడా అప్పు ఇవ్వ‌లేమ‌ని చెప్పేస్థాయికి కేసీఆర్ దిగ‌జార్చాడని దుయ్యబట్టారు. అప్పులు పుట్ట‌క‌పోవ‌డంతో రాష్ట్రాన్ని అమ్మ‌కానికి పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివ‌ర‌కు తిన‌డానికి తిండి లేని నిరుపేద‌ల‌కు , భూమిలేని వారికి ఆత్మ గౌర‌వంతో బ‌త‌కాల‌ని నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఇచ్చిన అసైండ్ భూముల‌ను వెన‌క్కు తీసుకుని లే అవుట్ చేసి అమ్మ‌కానికి పెట్టాడని భట్టి ఆరోపించారు.

కాగా ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోసం అసైండ్ భూములు తీసుకోవ‌డం అంటే ప్రాజెక్టులు క‌ట్ట‌డం, కాలువ‌లు త‌వ్వ‌డం కోసం, జాతీయ ర‌హ‌దారులు వేయ‌డానికి మాత్ర‌మే తీసుకోవాలన్నారు భట్టి విక్రమార్క.  అది 13 యాక్ట్ ప్రకారం డ‌బ్బులు చెల్లించి తీసుకోవాలన్నారు. ఇందుకు విరుద్ధంగా అసైండ్ భూముల‌ను వెన‌క్కు తీసుకుని క‌మ‌ర్షియ‌ల్ యాక్టివిటీస్ చేసి ప్లాట్లుగా మార్చి వేలం వేసే అధికారం ఈ ప్ర‌భుత్వానికి ఎవ్వ‌రూ ఇవ్వ‌లేదని స్పష్టం చేశారు. చ‌ట్టాల‌ను తుంగ‌లో తొక్కి పేద‌వాళ్ల‌ను బెదిరించి, భ‌య‌పెట్టి పేద‌లు, ద‌ళితుల‌తో బ‌ల‌వంత‌పు సంతకాలు పెట్టించుకుంటున్న‌ట్లు తెలుస్తోందన్నారు. దాదాపు 30 వేల ఎక‌రాలు సేక‌రించి అమ్మ‌కానికి మొద‌లు పెట్టిన‌ట్లు తెలిసిందన్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆనాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు పంచిన భూముల‌ను ఇప్ప‌టికే వెన‌క్కు లాక్కుని, అత్యంత సంప‌న్న బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు అప్ప‌నంగా ఇచ్చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమని అన్నారు భట్టి విక్రమార్క. పాల‌మూరు వెనుక‌బాటుత‌నం, నీళ్ల పేరు చెప్పి ప‌ద‌వులు అయితే పొందారన్నారు. కానీ ఈ పాల‌మూరుకు ఒక చుక్క నీరుకూడా కొత్తగా ఆయ‌క‌ట్టుకు ఇచ్చింది లేదని వాపోయారు. జూరాల ప్రాజెక్టునుంచి పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకుంటే.. ఎత్తునుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు పారేవి. నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు.. 263 టీఎంసీలు ఉన్న శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోగ‌లం కానీ.. 6 టీఎంసీలు ఉన్న జూరాల నుంచి నీళ్లు ఎలా తీసుకోగ‌ల‌మ‌ని అంటున్నాడు???  ఈ పెద్ద‌మ‌నికి నేను ఒక్క‌టే చెప్ప‌ద‌లుచుకున్నాను.. ఈ 263 టీఎంసీలు శ్రీశైలానికి వ‌చ్చేది.. జూరాల నుంచే.. వేరే ద‌గ్గ‌ర‌నుంచి రావ‌డం లేదని తేల్చి చెప్పారు. జూరాల‌నుంచి శ్రీశైలంకు 263 టీఎంసీలు నీళ్లు వ‌చ్చేమ‌ధ్య‌లో ఆంధ్ర‌ప్ర‌భుత్వం పోతిరెడ్డిపాడు, సంగ‌మేశ్వ‌రం లిఫ్ట్ నుంచి రోజుకు 11 టీఎంసీలు త‌ర‌లించేలా చేస్తోందన్నారు. అదే జ‌రిగితే శ్రీశైలంలో నీళ్లు ఎక్క‌డుంటాయి.. పాల‌మూరుకు ఎక్క‌డ‌నుంచి వ‌స్తాయని భట్టి ప్రశ్నించారు.

 

Exit mobile version