Newsminute24

Poetry: రాయడానికి ఒక చేయి చాలదు..!

Literature: 

రాయడానికి ఒక చేయి చాలదు.

ఈ రోజుల్లో రెండోది కూడా కావాలి.
చెప్పలేని సంగతుల వంచనను
చప్పున గ్రహించడానికి,
వచ్చే ప్రళయం తర్వాత ఉదయించే
తారక పేరును లిపిబద్ధం చేయడానికి,
మోహవస్త్రంలోని వేలాది దారపు పోగుల
అల్లిక తెగిపోకుండా చూడటానికి,
వ్యర్థాల పోగు నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి
రెండో చేయి కూడా కావాలి.

నిజానికి ఈ రోజుల్లో
రాయడానికి రెండు చేతులూ చాలవు.
కష్టాల తొక్కిడిలో నలిగిపోయి,
ఈ నీచాతినీచ మరుభూమికి
చేరుకోవలసిన అగత్యాన్ని రాయాలంటే,
మూడో నాలుగో చేతులు కావాల్సిందే!

దరీజా మూలం: అబ్దుల్‌ లతీఫ్‌ లాబీ
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Exit mobile version