Vikarabad: తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయా నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపిక పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. సర్వేల ఆధారంగా ఇప్పటికే కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజక వర్గాల అభ్యర్థులను హస్తం పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాండూరు అభ్యర్దిని సైతం ఎంపిక చేసినట్లు నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. రేవంత్ శిష్యుడిగా పేరొందిన పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి అభ్యర్ధిగా ఎంపికైనట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రజాభిమానం తోపాటు మజీ మంత్రి గడ్డం ప్రసాద్ అండదండలు కూడా ఉండటంతో ఆయన ఎంపిక లాంఛనమేనన్న అభిప్రాయం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.
కాగా గత ఎన్నికల్లో తాండూరు నుంచి పార్టీ గుర్తు మీద గెలిచిన రోహిత్ రెడ్డి.. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే బలమైన అభ్యర్ధిని రంగంలోకి దించి ఆయనను ఓడించాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలోనే సర్వేలో ముందంజలో ఉన్న పట్లోళ్ల రఘువీర్ రెడ్డి అయితే సరైన అభ్యర్ది అన్న భావనకు పార్టీ వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా యువతలో ఉన్న క్రేజ్ ఆయన ఎంపికకు ప్రధానం కారణంగా కనిపిస్తోంది.
మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ రంగా రెడ్డి జిల్లా డీసీసీబి చైర్మన్ మనోహర్ రెడ్డి సైతం తాండూర్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ పెద్దలను కలిసి టికెట్ కోసం లాభియింగ్ మొదలెట్టారు. అయితే సర్వేల్లో ముందున్న రఘువీర్ రెడ్డి వైపే అదిష్టానం సుముఖుంగా ఉన్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.