Janasenavarahi: వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. కష్టం చెప్పుకొంటే కక్షగట్టి మరి ఈ ప్రభుత్వం చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి., యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలని ఆకాంక్షించారు. గురువారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. “కత్తిపూడి జంక్షన్ లో వారాహి విజయయాత్రకు దిగ్విజయంగా శ్రీకారం చుట్టామన్నారు. అన్ని నియోజకవర్గాలు తిరిగి స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవడమే ఈ యాత్ర ముఖ్యోద్దేమని స్పష్టం చేశారు. సమస్య గురించి తెలుసుకోవడం కంటే… నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లి వారి ఆవేదన వింటే దానికి వచ్చే స్పందన వేరుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆ యువతి ఆవేదనే జనవాణికి శ్రీకారం…
జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి ఒక యువతి ఆవేదనే కారణమన్నారు పవన్ కళ్యాణ్. భద్రత పేరుతో తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి ఆనుకొని ఉన్న ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసిందని వాపోయారు. సరైన వసతి కల్పించకుండానే బాధితుల ఇళ్లు తొలగించారని.. ఈ విషయాన్ని వైసీపీ అభిమాని, ప్రభుత్వ వాలంటీర్ అయిన స్థానిక యువతి ఒకరు నాకు దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనిపై నేను స్పందించడంతో వారం రోజుల తరువాత కొంతమంది వ్యక్తులు వాళ్ల అన్నయ్య మార్కెట్ కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి నాలుగు రోజుల తరువాత చంపేశారని మండిపడ్డారు. చనిపోవడానికి ముందు రోజు ఒంగోలు ఉన్నానని చెప్పిన వ్యక్తి .. మరుసటి రోజు శవమై కనిపించాడన్నారు. కష్టం చెప్పుకుంటే ఈ ప్రభుత్వం చంపేసిందని.. ఆమె కార్చిన కన్నీరే జనవాణి కార్యక్రమం పెట్టడానికి కారణమైందన్నారు. కరోనా సమయంలో మాస్కులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్ గారిని చనిపోయేలా చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన ఓ తల్లిని మానసిక స్థితి బాగోలేదని నింద వేసి కాకినాడ ఆస్పత్రిలో పడేశారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలను వాడుకొని భయపెట్టడం ఆవేదన కలిగించిందన్నారు. చైతన్యవంతులైన ప్రజలు స్పందించకపోతే అరాచకం రాజ్యమేలుతుందని పవన్ హెచ్చరించారు.
జీతాలు కంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ ..
జనవాణిలో పంట కాలువలు, రిజర్వాయర్ ఆధునికీకరణ సమస్యలు, మట్టి మాఫియా ఆగడాలు, మత్స్యకార సమస్యలు, రెల్లి కార్మికుల సమస్యలు ఇలా దాదాపు 34 అర్జీలు వచ్చాయన్నారు పవన్. ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 2 వేలకు పైగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉంటే హైదరాబాద్ లో దాదాపు 1500కు పైగా కంపెనీలు ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో వంద కూడా లేవని చెబుతున్నారని.. వర్క్ ఫ్రం హోమ్ చేద్దామంటే తమకు వచ్చే జీతాలు కంటే కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి పిటిషన్ ను అధ్యయనం చేస్తామని.. సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించి సమస్యకు పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తామని జనసేనాని స్పష్టం చేశారు.