Varahivijayayatra4: ‘జనసేన – తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిపోవడం జరగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.పేదలు, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటున్న ఏ పథకం నిలిపివేయడం జరగదని.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు మరింత అదనంగా జోడించి వారిని ఆదుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. అప్పుల ద్వారా కాకుండా ఆదాయం సృష్టించి ప్రజలకు మరింతగా ఇవ్వాలన్నదే తమ ఆకాంక్షగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల వల్ల భవిష్యత్తు అంధకారం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకొని దాని ద్వారా ఆదాయాన్ని సృష్టించి ప్రజలకు సంక్షేమం ద్వారా అందించాలనే విధానానికి తాము కట్టుబడి ఉన్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసీపీ సలహాదారులు దుష్ప్రచారం..
జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాలేదన్నారు పవన్ కళ్యాణ్. వచ్చేసిందని వైసీపీ నాయకులు దేశమంతా దుష్ర్పచారం చేస్తున్నారని.. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నానని.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు . తన తరఫున వైసీపీ నాయకులు, సలహాదారులు కష్టపడనక్కర్లేదన్నారు. తాను బయటకు రావాలంటే అందరికీ చెప్పే వస్తాను తప్ప దొంగచాటుగా ఏ పని చేయనని.. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు.. బీజేపీ ఆశీస్సులతో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని జనసేనాని కుండ బద్దలు కొట్టారు. 2021 జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే చెప్పానని.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నదే జనసేన లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు.