సాయి వంశీ ( విశీ) :
ప్రణీత్ హనుమంతు అంశం కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి కామెంట్ చాలా విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అతని టాపిక్ కంటే ముందు స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక కీలక విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ మరో పురుషుడు/పురుషుల పట్ల, అలాగే ప్రతి పురుషుడు మరో స్త్రీ/స్త్రీల పట్ల Sexual Attractionకి లోనవుతారని నేను నమ్ముతాను. అది వివాహ వ్యవస్థ బయట కూడా జరగొచ్చు. ‘నాకెవరి మీదా క్రష్ ఏర్పడలేదు’ అని ఈ కాలంలో ఎవరైనా అంటే అది పూర్తిగా అబద్ధమైనా అయ్యి ఉండాలి. లేదా అతను/ఆమె ప్రస్తుత సమాజానికి దూరంగా ఉంటున్నారనైనా అనుకోవాలి.
‘Sexual Attraction’ అనేది అతి సహజమైన ప్రక్రియ. కానీ ఎన్పడైతే అది ‘Sexual Exploitation’, ‘Demanding Sexual Pleasure’, ‘Sexual Comments’ వరకూ వెళ్తుందో అది అవతలివారిని అవమానించినట్టు లెక్క! అది చట్టరీత్యా నేరం. ఈ నేరం అన్నిసార్లూ పటిష్టంగా చేయాల్సిన పని లేదు. పరోక్షంగా, పైపైన చేస్తూ పోయినా కూడా అది నేరం కిందే లెక్క.
ప్రణీత్ ఒక తండ్రికూతుళ్ల సంబంధాన్ని వక్రీకరించి కామెంట్ చేశాడని అందరూ ఖండిస్తున్నారు. అదే అతను బావామరదళ్ల మీదో, భార్యాభర్తల మీదో చేసి ఉంటే ఫర్లేదా!? ఒకరి వ్యక్తిగత జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపే అధికారం లేదనే కీలకమైన పాయింట్ గురించి కదా మనందరం గొంతు ఎత్తాల్సింది. ప్రణీత్ కామెంట్లపై హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాక ప్రభుత్వం స్పందించింది. ఈ విషయం మీద పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ యాంకర్ అనసూయ బట్టల మీద, గాయని సునీత పెళ్లి మీద, నటి సమంత విడాకుల మీద, సురేఖావాణి కూతురితో కలిసి దిగిన ఫొటోల మీద ట్రోల్స్ జరిగినప్పుడు ఇంత చర్చ జరగలేదు. ఎందుకు?
సో.. ప్రణీత్ హనుమంతులు మన చుట్టూనే పుడుతున్నారు. మన మౌనమే వాళ్లని చక్కగా పెంచి పోషిస్తోంది. అలాంటి అంశాల మీద ఒక్క ఖండన పోస్ట్ రాసినా అది మన నిరసనే! కానీ ఆ పని కూడా చేయక కూర్చుంటే అది వాళ్లకు మరింత బలం ఇచ్చినట్టే! తద్వారా మనలో మనమే ఒక ప్రణీత్ హనుమంతును దాచుకొని, బయటకు మాత్రం నైసుగా ఉంటున్నామా? అసలు మనలో ఎంతమంది మగవాళ్లు కనీసం ఒక్కరంటే ఒక్క స్త్రీని కూడా ‘అది’, ‘ముం_’, ‘లం_’ అని సంబోధించకుండా ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అంటే మన మాటలు రికార్డు కావు, ఆ మాటలు సాయిధరమ్ తేజ్ వినడు కాబట్టి మనం సుద్దపూసలం అయిపోయినట్టేనా?
మనలో ఉన్న ప్రణీత్ హనుమంతులను చంపనంత వరకు, మన చుట్టూ ఉన్న ప్రణీత్ హనుమంతులను ఖండించనంత వరకు.. ఇంకా ఇంకా వాళ్లు పుడుతూనే ఉంటారు.