Newsminute24

BIGALERT:ఆడవాళ్లు ఏ బట్టలేసుకుంటే నీకెందుకురా కుయ్యా?

BIGALERT:

మొత్తం చదవండి. చాలా విలువైన, కీలకమైన అంశం. మరీ ముఖ్యంగా మగవాళ్లంతా చదవండి.

బెంగళూరు నగరంలోని ‘Etios Digital Services’ అనే సంస్థలో పనిచేస్తున్నాడు నిఖిత్ శెట్టి. హాయిగా పనిచేసుకుంటూ ఉంటే సమస్య లేదు. ఖ్యాతిశ్రీ అనే వివాహితపై అతని దృష్టి పడింది. ఆమె వేసుకునే బట్టల మీద ఆ దృష్టి మరింత పడింది. ఆమె మీద వ్యక్తిగత కక్షో, లేక ఆమె బట్టలు కర్ణాటక రాష్ట్ర సంప్రదాయానికి అనువుగా లేవన్న ‘మతాధిపతి’ మనస్తత్వమో, ఆడవాళ్లు అణిగిమణిగి ఉండాలన్న పురుషాంహకారమో అతణ్ని రెచ్చగొట్టింది. వెంటనే అతని భర్త ఎవరో కనుక్కొని అతనికి మెసేజ్ చేశాడు.

‘రేయ్ బాస్టర్డ్! నీ భార్యకు సరైన బట్టలు వేసుకోమని చెప్పు. ముఖ్యంగా కర్ణాటకలో ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పు. లేదంటే తన ముఖం మీద యాసిడ్ పోస్తాను’ అని మెసేజ్ చేశాడు. విచిత్రమేమిటంటే, నిఖిత్ మాత్రం తన ఇన్‌స్టా‌గ్రామ్ ప్రొఫైల్‌లో తన శరీరాన్ని చూపిస్తూ ఫొటోలు పెట్టాడు. ఇదొక రకమైన మనస్తత్వం.

ఆ మెసేజ్ అందుకున్న ఖ్యాతిశ్రీ భర్త షాబాజ్ అన్సర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు. వెంటనే ఈ విషయాన్ని కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీలకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. వెంటనే అనేకమంది ఆయనకు మద్దతుగా నిలిచారు. ‘ఆడవాళ్ల బట్టల గురించి మాట్లాడే హక్కు వాడికేం ఉంది?’ అంటూ అతణ్ని తీవ్రంగా విమర్శించారు. మరికొందరు నిఖిత్ శెట్టి తమకు తెలుసని, అతను Etios Digital Servicesలో పనిచేస్తున్నాడని తెలిపారు. వెంటనే పోలీసులు అతని సంస్థకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు.

ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న సంస్థ వెంటనే అతణ్ని ఉద్యోగంలో నుంచి తీసేసింది. అక్కడితోనే విషయం అయిపోలేదు. మహిళపై యాసిడ్ పోస్తానని బెదిరించినందుకు అతనిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది.

సోషల్‌మీడియాలో భయపెట్టే, అసభ్యకర కామెంట్లు, మెసేజ్లు చేస్తే ఊరుకునే కాలం కాదిది. నిమిషాల మీద చర్యలు తీసుకునేంతలా టెక్నాలజీ ముందుకు వెళ్తోంది. ఇక్కడ బాధితురాలు సీనియర్ జర్నలిస్టు భార్య కాబట్టే ఇంత తొందరగా చర్యలు తీసుకున్నారన్న వాదన కూడా ఉంది. కానీ ముందుగా బాధితులు బయటకొచ్చి నిందితులను పట్టిస్తే, ఎక్కడో ఒక చోట కదలిక మొదలవుతుంది. ఇది తథ్యం.

ఈసారి ఎవరినైనా బెదిరిస్తూ, తిడుతూ కామెంట్లు, మెసేజ్లు పెడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ‘నిఖిత్’ని గుర్తు చేసుకోండి ఒకసారి. విచిత్రమేమిటంటే, అంత పెద్ద చదువు, చుట్టూ సమాజాన్ని చూసిన అనుభవం, లక్షల్లో జీతం.. ఏవీ నిఖిత్‌కు కనీస అవగాహన, విచక్షణ, సంయమం అందించలేదు. ఆడవాళ్ల బట్టల గురించి నేను ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా అనొచ్చు, యాసిడ్ పోయొచ్చు అనే ధైర్యం అతనిది.

అతనా మెసేజ్ పెట్టకుండా, నేరుగా యాసిడ్ పోసేసి ఉంటే? ఆపే పరిస్థితులు, అడ్డుకునే చర్యలు ఉన్నాయా మన దేశంలో?

– విశీ(వి.సాయివంశీ)

Exit mobile version