Janasena: ప్రతి కార్యకర్త బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని చెప్పడమే జనసేన క్రియాశీలక సభ్యత్వ లక్ష్యమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఒక్క రోజు అధికారంలో లేకపోయినా ఆపద సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పడమే కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. శనివారం విశాఖ జిల్లా, భీమిలి నియోజకవర్గం, కృష్ణాపురం గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుడు బొడ్డు పైడి నాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
పైడి నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నాదెండ్ల మనోహర్ కృష్ణాపురం గ్రామానికి వెళ్లి అతని కుటుంబాన్ని ఓదార్చారు. పైడి నాయుడు భార్య ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని తెలుసుకుని ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కును తండ్రి సూరీడుకి అందచేశారు. భవిష్యత్తులోనూ జనసేన పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, భీమిలి ఇంఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల, అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.