Newsminute24

cricket:“నీ పోటీ ప్రపంచంతో కాదు— నిన్నటి నీతో”

Sports:

క్రికెట్‌లో  కొన్ని ఇన్నింగ్స్‌లు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. కానీ సంకల్పంతో, సహనంతో, విమర్శల వర్షాన్ని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు మాత్రం అరుదు. టి20 ప్రపంచకప్ వేదికగా వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ అలాంటిదే.సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలబెట్టుకోవాల్సిన ‘చావో రేవో’ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మాటగా మార్చుకొని ఆడిన తీరు ప్రశంసనీయం.ఆ రోజు అతను శతకం నమోదు చేయకున్నా సహనం ఉన్న చోటే నిజమైన గెలుపు పుడుతుందని నానుడి నిజం చేస్తూ తన బ్యాట్‌ను మాటగా మార్చుకున్న తీరు ప్రత్యేకం. 

వెస్టిండీస్‌పై సంజు ఇన్నింగ్స్ చూస్తే…”ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలం గా కొడతాడు..వీడేంటిరా చాలా శ్రద్ధగా కొట్టాడు..ఏదో ఒక గోడ కడుతున్నట్టు …గులాబీ మొక్కకు అంటు కడుతునట్టు చాలా జాగ్రత్తగా.. పద్దతిగా కొట్టాడు…” అతడు సినిమాలో డైలాగ్ గుర్తుకు వస్తుంది.సంజు చేసింది 97 పరుగులే కానీ 150 కోట్ల భారతీయుల హృదయాలను గెలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆవేశం కన్నా అవగాహన ఎక్కువగా కనిపించింది. దూకుడు కన్నా బాధ్యత ముందుంది.తనదైన ఎటాకింగ్ గేమ్ సమయస్ఫూర్తి  ఇవన్నీ అతని సన్నద్ధతకు నిదర్శనం.

అసలు టి20 ఫార్మాట్  స్వభావం వేగం. కానీ ఆ వేగంలో స్థిరత్వం చూపించడం అసలైన నైపుణ్యం. సంజు అదే చేశాడు. మొదట కొన్ని ఓవర్లలో పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఓ  ఎండ్ లో వికెట్లు పడుతున్నా క్రీజులో కుదురుకున్నాక చెత్త బంతులను బాదుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాల్సిన ‘చావో రేవో’ పోరులో అతను ఒత్తిడిని జయించాడు. ఇలాంటి సందర్భాల్లో పరుగులు మాత్రమే కాదు, ఆత్మస్థైర్యమే అసలు కొలమానం. ప్రతి ఆటగాడి విజయవంతమైన ఇన్నింగ్స్ వెనుక కనిపించని కృషి ఉంటుంది. ఎవరూ చూడని నెట్ ప్రాక్టీస్, శ్రమ, ఎవరూ గుర్తించని సహనం ఇవే విజయానికి పునాది. ఆ కృషి ఒక్కరోజులో సాధ్యం కాదు. కానీ సరైన సమయంలో చరిత్రగా నిలుస్తుంది.

వెస్టిండీస్ పై బౌండరీ తో మ్యాచ్ ముగించాక హెల్మెట్ పక్కన పడేసి మోకాళ్లపై కూర్చుని ప్రాధేయ పడుతూ దేవుడిని స్మరిస్తున్న క్షణం అతనిలోని వేదన ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేస్తుంది. అతను బెంచ్‌లో కూర్చుని ఎన్నిసార్లు బాధపడ్డాడో మనకు తెలియదు. రాత్రుళ్లు ఎంతగా కుమిలిపోయాడో మనం ఊహించలేం.  జట్టు ఎంపికల్లో చోటు దక్కకపోయిన సందర్భాలు, వరుస అవకాశాల కోసం ఎదురుచూసిన రోజులు ఇవన్నీ ఒక ఆటగాడి మనోబలాన్ని పరీక్షిస్తాయి. అలాంటి వేళల్లో చాలామంది వెనక్కి తగ్గుతారు. కొందరు మాత్రం నిశ్శబ్దంగా తమను తాము మళ్లీ పుననిర్మించుకుంటారు. సంజు ఆ రెండో వర్గానికి చెందినవాడని ఈ ఇన్నింగ్స్ స్పష్టంగా తెలిపింది.
“నీ పోటీ ప్రపంచంతో కాదు— నిన్నటి నీతో” అనే జీవన సూత్రాన్ని అతను తన బ్యాటింగ్‌తో మరోసారి గుర్తు చేశాడు. నిన్నటి తప్పిదాలపై ఆలోచిస్తూ కుంగిపోవడం సులభం. కానీ వాటినే పాఠాలుగా మార్చుకొని ముందుకు సాగడం ధైర్యం. సంజు అదే చేశాడు.
సంజు కెరీర్‌ను వెనక్కి తిరిగి చూస్తే అది విరామాలతో నిండిన ప్రయాణం. అతని ప్రతిభపై ఎప్పుడూ సందేహం లేదు. స్ట్రోక్‌ప్లేలో సహజత్వం, టైమింగ్‌లో లయ, క్రీజ్‌లో ఆత్మవిశ్వాసం— ఇవన్నీ అతని సహజ లక్షణాలు. అయినా “స్థిరత్వం లోపిస్తోంది” అనే వ్యాఖ్యలు తరచూ వినిపించాయి.ఆటలో అత్యంత కఠినమైన పోరాటం ప్రత్యర్థితో కాదు మనసుతో. నువ్వు నీమీద నువ్వే సందేహపడే క్షణమే అసలు ఓటమి మొదలవుతుంది. సంజు ఆ దశను దాటాడు. వెనక్కి తగ్గలేదు. విమర్శలకు మాటలతో సమాధానం చెప్పలేదు. బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు.

అతని సంచలన ఇన్నింగ్స్ యువ క్రీడాకారులకు ఒక సందేశం లాంటింది. అవకాశాలు తరచూ రావు. కానీ వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకునే సన్నద్ధత ఉండాలి. వైఫల్యాలు ఎగతాళి చేసినా, ప్రపంచం సందేహించినా, మన సామర్థ్యంపై నమ్మకం కోల్పోవద్దు.క్రీడలోనే కాదు, జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఉద్యోగంలోనైనా, చదువులోనైనా, ప్రజా జీవితంలోనైనా… సహనం, క్రమశిక్షణ, నిరంతర శ్రమే విజయానికి మార్గం. గెలుపు ఒక్కరోజులో రాదు. కానీ నిశ్శబ్దంగా సాగిన కృషి ఒకరోజు ఘనంగా ప్రపంచానికి చాటుతుందని సంజూ నిరూపించాడు.

ఇక మున్ముందు సంజు బ్యాట్ నుంచి ఎన్నో శతకాలు జాలువారవచ్చు. రికార్డులు సృష్టించవచ్చు. కానీ ఈ 97 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్‌లో మలుపు తిప్పిన ఘట్టంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే అది కేవలం ఒక మ్యాచ్ విజయం కాదు కోట్లాది హృదయాలను గెలిచిన క్షణం.చివరగా చెప్పాల్సిన సందేశం ఒకటే…” ఓపికతో, నిజాయితీతో కష్టపడితే, ప్రపంచం ఎప్పటికైనా గుర్తిస్తుంది”.

*అమరవాజీ నాగరాజు*
*జర్నలిస్ట్*

Exit mobile version