Site icon Newsminute24

sankranti: సంక్రాంతి…సంస్కృతి… స్త్రీ..!!

మాలతి పల్లా:

పిండి వంటలు చేసి, ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి, పట్టు చీరలు కట్టుకొని ఇంటి సంస్కృతిని ఒక స్త్రీ కాపాడుతుండాలి. స్టేజి మీద అర్ధ నగ్న నృత్యాలు చేసి టెస్టోస్టీరాన్ని టెస్ట్ చేయడానికి ఇంకొక స్త్రీ బయట సంస్కృతిని కాపాడుతుండాలి. తన ఇష్టానికి స్థ(స్ఖ)ల కా(కొ)ల”మాన” పరిస్థితులను బట్టి కప్పుకోమని విప్పుకోమని ఇంకా చాతనైతే ఎంతెంత కప్పుకోవాలో, ఏది విప్పాలో, ఏమేం చూపించాలో పురుషుడు చెప్తుంటాడు. మగవాడు చెప్పినట్టు చేసి వాడు కరెక్ట్ అనుకున్న సంస్కృతిని ఇంటా బయట కాపాడేది స్త్రీలే. సంస్కృతి సంప్రదాయమని ఆడోళ్లకు నియమాలు పెట్టడం, ఏమాత్రం అతిక్రమించినా బూతులు తిట్టడం తప్ప మగవాళ్ళు చేసేదేమీ లేదు. ఒక్కసారి ఆడోళ్లను తీసేస్తే పురుషుడికి సంస్కృతీ లేదూ తిట్లూ రావూ.

కొంచం సేపు సంక్రాంతినీ సంస్కృతినీ పక్కన పెట్టి ఈ నృత్యాల గురించి మాట్లాడుకుందాం. లేకపోతె “ఇది మన సంస్కృతా? సంక్రాంతికి ఇట్లాంటి ప్రదర్శనలా?” అంటారు. అంటే సంక్రాంతి సమయంలో కాక ఇంకెప్పుడైనా అయితే ఓకే లేదా ఆ నృత్యాలు సంస్కృతి లో భాగం కాకపోతే ఓకే అని కదా. సినిమాలను కూడా పక్కన పెడదాం. ఎందుకంటే సినిమా ముందొచ్చిందా ఈ నృత్యాలు ముందొచ్చినయా, సినిమాలో అయితే యాక్షన్ కదా ఇవి నిజం కదా , యింట్లాంటి వాదనలొస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి చూడకపోతే సమస్య పక్క దారి పడుతుంది. సమస్యను పక్కదారి పట్టించడమంటే ఆ సమస్యలో ఉన్న పీడితులను అవమానించడం , వాళ్లను కేవలం వాదనలకు వాడుకోవడం.

శివాజీ, అనసూయ తదితరులను కూడా పక్కన పెడదాం. ఎందుకంటే ఇది స్త్రీ స్వేచ్ఛకు, ఆ స్వేచ్ఛలో భాగమైన వస్త్రధారణకు సంబంధించిన విషయం కాదు. అంత కంటే ఇంకా పెద్దదైన ఆకలి సమస్య. మానవ హక్కుల్లో మొట్టమొదటిది ఆహారం పై హక్కు. ఆకలి కోసం పోరాటాలుంటాయి కానీ ఆహారపు హక్కు కోసం దాదాపుగా ఉండవు. అందుకే విధి లేక పొట్ట కూటి కోసం వేశ్యా వృత్తి చేసినట్టే ఆత్మాభిమానం చంపుకోని అమ్మాయిలు ఈ నృత్యాలు కూడా చేస్తారు. ఇట్ల అంటూనే, ఈ సంక్రాంతి నృత్యాలు కనీసం కొందరికి తిండి పెడుతున్నాయి కదా అనే వాదన మొదలవుతుంది. విధి లేక పొట్టకూటి కోసం చేస్తారు అని జాలి పడడం సరే కానీ ‘మంచిదే కదా కనీసం పొట్ట నిండుతుంది’ అనీ తీర్మానించడం సరి కాదు.

దాని వల్ల ఆ నృత్యాలు సాధారణీకరణ చేయబడతాయి. అట్ల చేయడం వలన ఆ అమ్మాయిల జీవనాధారానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించడం పక్కన పెట్టడమే కాకుండా, వాళ్ల మీద పెత్తనం మొదలవుతుంది. ఈ నృత్యాలు చేసేవాళ్లు పీడిత సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడం వల్ల వాళ్లను అవమానించడానికి జనాలు ఏ మాత్రం వెనుకాడరు. పీడకులు వాళ్లను బహిరంగంగా బట్టలిప్పమని డిమాండ్ చేయడం తమ హక్కుగా భావిస్తారు. ఇప్పటికే మొద్దుబారి ఉన్న సమాజం వేశ్య వృత్తి చేసే వాళ్లకు, ఇట్ల స్టేజి పై నృత్యాల్లు చేసే వాళ్లకూ అవన్నీ అలవాటే అని నిర్ణయించేస్తారు. దాని వలన బహిరంగంగా బట్టలిప్పు అన్న వాడి మీద చర్య తీసుకోవడం అటుంచి విక్టిమ్ బ్లేమింగ్ మొదలవుతుంది. హక్కుల కార్యకర్తలు కూడా దీనిని మామూలు గా తీసుకునే ప్రమాదముంది.

వేశ్య వృత్తి చేసేవాళ్లు మరుగు కోరుకున్నట్టే, ఈ డాన్స్ చేసేవాళ్లు కూడా మరుగు కోరుకుంటారు. కాకపోతే మొదటి పనిలో మగవాడు కూడా వుంటాడు కాబట్టి ఆ మరుగును సమ్మతిస్తాడు. ఈ డాన్స్ లు స్త్రీ లే చేస్తారు కాబట్టి బహిరంగంగా బట్టలిప్పమని బలిసి కొట్టుకుంటాడు.అసలు పురుషుడు లోపల బనీను ఉన్నా కూడా స్టేజి మీద షర్ట్ విప్పమని డిమాండ్ చేస్తే ఊరుకుంటాడా?

అట్లాంటి దుస్తులే వేసుకొని స్టేజి మీద అవే పాటలకు అట్లాంటి డ్యాన్సులే సినిమా యాక్టర్స్ చేస్తే , డాన్స్ చేసింది చాలు ఇంక విప్పి చూపించమనే ధైర్యం ఎవరికుంటుంది? అంటే గింటే ఇప్పటికి ఎంతో యాక్టివిజం జరిగుంటుంది. ఆడవాళ్లతో అట్ల అసభ్యకర డాన్సులు ఆపించమని కాదు, విప్పి చూపించమని అవమానించినరని. నా ఉద్దేశ్యం వీళ్లని కూడా అనాలని కాదు.
వాళ్లూ స్త్రీలే, వీళ్లు స్త్రీ లే. డబ్బుల కోసం ఒకే రకమైన పని చేస్తున్నారు. ఇద్దరికీ ఆత్మాభిమానం ఉంటుంది. కానీ మన సమాజం లో వాళ్ల ఆత్మ గౌరవానికిచ్చే విలువ మాత్రం ఒకేలా వుండదు.

చెప్పేదేమిటంటే, తిరిగి తిరిగి ఇదంతా వచ్చి చేరేది ఒక చోటనే. వర్గ వివక్ష, పురుషాధిపత్యం, పురుష సంస్కృతి, అన్నిటికన్నా ప్రమాదకరమైన సామాజిక మొద్దుబారుడుతనం.

ఆలోచించండి !

Exit mobile version