Newsminute24

సిద్దార్థ్‌ లూథ్రా గొప్ప ఫార్సీ వాక్యం పరిచయం చేసినందుకు ఆనందించాలేమో!

Nancharaiah merugumala senior journalist:(సిద్దార్థ్‌ లూథ్రా– 300 ఏళ్ల క్రితం గురు గోవిందసింగ్‌ రాసిన గొప్ప ఫార్సీ వాక్యం  పరిచయం చేసినందుకు మనం ఆనందించాలేమో!జఫర్‌ నామా గురించి తెలియని తెలుగోళ్లు ఈ పంజాబీ వకీలుకు సదా రుణపడి ఉంటారు!)

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న దిల్లీ పంజాబీ హిందూ ఖత్రీ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా బుధవారం మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా సైట్‌ ఎక్స్‌ లో చేసిన సంక్షిప్త వ్యాఖ్య సంచలనం సృష్టించడంతోపాటు తెలుగు మహాజనులు కొందరిలో ఆగ్రహావేశాలకు కారణమైంది. బాబు గారికి రిమాండ్‌ విధించకుండా ఆపలేకపోయాననే బాధతో ఈ వకీల్‌ సాబ్‌ చేసిన వ్యాఖ్యగానే అందరూ అర్ధంచేసుకున్నారు. ‘కనుచూపు మేరలో న్యాయం కనపడనప్పుడు కత్తి పట్టుకోవడమే కర్తవ్యం’ అనే అర్ధం వచ్చే రీతిలో పదో సిక్కు గురువు గోవింద్‌ సింగ్‌ రాసిన మాటలను సాటి పంజాబీ (హిందూ) ఖత్రీ అయిన లూథ్రా తన ‘ట్వీట్‌’లో (మరో పదం ఇంకా కనిపెట్టలేదని) ఉటంకించడం ఎందరో తెలుగు వారికి బాధ కలిగింది. అంతేగాని పంజాబీలకు మన తెలుగు వారి కంటే ఉన్నత సాంస్కృతిక, ధార్మిక సంపద, వారసత్వం ఉందని, వారు అవసరమైనప్పుడు పంజాబీ హిందూ, ముస్లిం, సిక్కు కుటంబాల్లో పుట్టిన సాధు సంతులు, బాబాలు, ఫకీర్లు చెప్పిన గొప్ప వాక్యాలను కోట్‌ చేస్తుంటారనే కనీస పరిజ్ఞానం మన తెలుగోళ్లకు లేకపోవడం లేకపోవడం నిజంగా దురదృష్టం. మత ప్రాతిపదికన విశాల పంజాబ్‌ రాష్ట్రం పాకిస్తాన్, ఇండియాల మధ్య పంపిణీ అయిపోయింది. దాని రాజధాని లాహోర్‌తోపాటు మూడొంతులకు పైగా భూభాగం మన దాయాది రాజ్యం పాక్‌ అంతర్భాగమైంది. అయినా మతాలకు (ధర్మాలకు) అతీతంగా రెండు దేశాల పంజాబీలూ గురు నానక్‌ నుంచి పది  మంది సిక్కు గురువులు, గొప్ప సూఫీ సెయింట్‌ బాబా ఫరీద్‌ ఇంకా కాశీకి చెందిన (చర్మకారులు ఆరాధించే గురువు) సంత్‌ రవిదాస్‌ వారసత్వాన్ని తమదిగా భావిస్తారు. దీన్నే ‘పంజాబియత్‌’ అని అంటారు. పాకిస్తాన్‌ పంజాబ్‌లోని అన్ని కులాలకు చెందిన ముస్లింలూ గురు నానక్‌ అంటే ఎంతో గౌరవంతో ఆరాధిస్తారు.

గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం అన్ని మతాల పంజాబీలకూ సొంతమే

దేశ విభజన ఫలితంగా అవిభక్త పంజాబ్‌లోని ఇప్పటి పాక్‌ ప్రాంతాలు లాహోర్, రావల్పిండీ, బహావల్‌ పూర్, ఫైసలాబాద్‌ నగరాల నుంచి, ఇతర ఊళ్ల నుంచి దిల్లీ తదితర ఉత్తరాది, హైదరాబాద్‌ వంటి దక్షిణాది ప్రాంతాలకు వలసొచ్చిన పంజాబీ సిక్కులు, హిందువులూ తమ ఉమ్మడి ధార్మిక, సాంస్కృతిక వారసత్వాలను మర్చిపోలేదు. లూథ్రా ‘ఎక్స్‌’ కామెంట్‌ ఫలితంగా– 1705లో అంటే దాదాపు 318 ఏళ్ల క్రితం వర్ణింప అలవికాని సమస్యలు, నాటి ముగల్‌ పాలకుల నుంచి తీవ్ర ప్రతిఘటన, అణచివేత ఎదుర్కొంటున్న సమయంలో గురు గోవింద్‌ సింగ్‌ నాటి దిల్లీ ప్రభువు ఔరంగజేబ్‌కు రాసిన జఫర్‌ నామా (విజయ పత్రం) అనే లేఖ రాశారనే గొప్ప విషయం తెలిసింది. సిక్కుల గొప్ప గ్రంథాల్లో ఒకటైన ‘దశమ గ్రంథ్‌’లో ఇది ఉంది. ముగలుల కాలం నాటి రాజభాష ఫార్సీ (పార్సీ లేదా పర్షియన్‌)లో చివరి సిక్కు గురువు ఈ లేఖ రాశారు. ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం ఉండబట్టే పంజాబీ హిందూ ఖత్రీ (క్షత్రియ) అయిన బహుత్‌ బడా వకీల్‌ సాబ్‌ సిద్ధార్థ్‌ లూథ్రా తాము ఎంతో గౌరవించి, పూజించే గురు గోవింద్‌ సింగ్‌ (అసలు పేరు గోవింద్‌ దాస్‌ అట, సిక్కులు పేరు చివర సింగ్‌ అనే మాట పెట్టుకోవడం గురు గోవింద్‌తోనే మొదలైంది. ఆయన ముందున్న 9 మంది గురువుల పేర్ల చివర సింగ్‌ ఉండదు) ఫార్సీ వాక్యాన్ని తన ‘ఎక్స్‌’ కామెంట్‌ లో ఉంటంకించారు. ఎప్పుడో మూడు దశాబ్దాల కిందటి భారత చారిత్రక ఘట్టాన్ని ఇలా మనకు గుర్తుచేసినందుకు తెలుగోళ్లుగా మనం సంతోషపడాలి. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ కేసులో చంద్రబాబూ జీ నుంచి భారీ ఫీజు తీసుకున్నాగాని,  తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఎంతో విలువైన గురు గోవింద్‌ సింగ్‌ జీ వాక్యాన్ని మనకు ఉచితంగా పంచినందుకు ఈ దిల్లీ పంజాబీ సిద్ధార్థునికి మనం ఎంతో రుణపడి ఉంటామనే అనుకుంటున్నా. ఈ లేఖ ఉన్న దశమ గ్రంథ్‌ను గోవింద్‌ సింగ్‌ రచించారు.

Exit mobile version