Newsminute24

telangana: తేలని తెలంగాణ బీజేపీ గమనం..!!

BJPTELANGANA:

తెలంగాణలో బీజేపీది సంక్లిష్ట పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నట్టే కనిపిస్తుంది, కానీ, ఏదీ తేల్చుకోలేని సందిగ్దస్థితి నుంచి పార్టీ నాయకత్వం బయటపడట్లేదు. కొత్త రాష్ట్రాధ్యక్షుడ్ని ఖరారు చేయలేని అశక్తత! అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలంగా, లోక్సభ ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు సాధించిన బీజేపీ పరిస్థితి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమిటి అంటే, ‘ఇదీ’ అని సమాధానం చెప్పలేని అయోమయం. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందమనే రాజకీయ విమర్శల నుంచి బయటపడే గుంజాటన ఓ వైపు. ఏపీలో లాగా రేపు టీడీపీ-జనసేనలతో తెలంగాణ బీజేపీ కూటమి కడుతుందని రాజకీయ క్షేత్రంలో పుకార్లున్నా, తెలంగాణ సెంటిమెంట్ దెబ్బదీస్తుందేమోనని జడుస్తోంది ! త్రీ ‘ఎమ్’ (ముదిరాజ్, మున్నూర్కాపు, మాదిగ) ఫార్ములాతో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని గట్టి ఆశ! అట్టడుగు స్థాయి వరకు పార్టీని పటిష్టపరచి, స్థానిక ఎన్నికల్లో బలోపేతమవడం వినా పార్టీకి మార్గం లేదు.

కాంగ్రెస్ ను ‘కప్పల తక్కెడ’ అని విమర్శించే బీజేపీ, తెలంగాణ విభాగం పార్టీ అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్ను మించింది. కమలంలో ఎన్ని పువ్వు రెఖలున్నాయో అంతకన్నా ఎక్కువ గ్రూపులున్నాయని పార్టీ వర్గాలే నర్మగర్భ వ్యాఖ్య చేస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి! ఉన్న ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో… అత్యధికులు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ పడేవారే! ఒకరంటే మరే ఇతరులకు పడదు. అయితే నేరుగా తామే అధ్యక్ష స్థానం ఆశించడమో లేదంటే ఒకరికి వ్యతిరేకంగా మరికొందరు జట్లు కట్టడమో పార్టీ అధినాయకత్వానికి చికాకు కలిగిస్తోంది. పలువురు అధ్యక్ష పదవిని ఆశించినా, ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు చేసుకున్నా, పార్టీ జాతీయ బాధ్యులు మాత్రం కుదించిన రెండు, మూడు పేర్ల జాబితాల్ని అధిష్టానానికి సమర్పించినట్టు సమాచారం. ఒకరిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాలని అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినా…. అది పార్టీ నియమావళికి లోబడి లేదు. ఏకంగా రెండు నిబంధనల ఉల్లంఘణ అవుతోంది. ఈ విషయమై ఇదివరకే తమిళనాడులో పెద్ద రగడ అయిన నేపథ్యంలో అంత తేలికగా నియమావళిని ఇక్కడ సడలిస్తారా? అన్నది ప్రశ్న!

‘త్రీ-ఎమ్ ఫార్ములా’తో గద్దెనెక్కాలని
పోయినసారి ఎన్నికల్లోనే వెనుకబడిన వర్గాల (బీసీ) వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం, అదే ఒరవడిలో బలమైన బీసీ సామాజికవర్గాలను మచ్ఛిక చేసుకునే ‘సోషల్ ఇంజనీరింగ్’కు యత్నిస్తోంది. ముదిరాజ్, మున్నూరు కాపు (బీసీ), మాదిగ (ఎస్సీ) సామాజికవర్గాలకు ప్రాధాన్యతతో ‘త్రీ-ఎమ్ ఫార్ములా’ను ముందుకు తోస్తోంది. వివిధ సమీకరణాల్లో రాష్ట్రాధ్యక్ష స్థానానికి ఎంపీలు డి,కె.అరుణ (మహబూబ్నగర్), డి. అరవింద్ (నిజామాబాద్), రఘునందన్రావు (మెదక్), డాక్టర్ లక్ష్మణ్ (రాజ్యసభ), ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ (ఆదిలాబాద్), మహేశ్వరరెడ్డి (నిర్మల్), మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ల పేర్లు ప్రచారంలో ఉన్నా…. సీరియస్గా పార్టీ అధినాయకత్వం పరిశీలనలోకి తీసుకున్నవి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ (కరీంనగర్) పేర్లు మాత్రమే! ఒకరు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందితే మరొకరు మున్నూరు కాపు సామాజికవర్గం. బండి సంజయ్ ఇదివరకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నందున ఈటల రాజేందర్వైపు అధినాయకత్వం కొంత మొగ్గింది. పార్టీలో తరచూ రగిలే పాత (తొలినుంచి పార్టీలో ఉన్న), కొత్త (ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన) నాయకుల మధ్య ఉండే స్పర్ధ ఒక అడ్డంకిగా మారింది. పార్టీ పాత నాయకులు పలువురు ఈ ఆలోచనను వ్యతిరేకించారు. దానికి తోడు పార్టీ నియమావళి ప్రకారం పదిసార్లకు తగ్గకుండా సాధారణ సభ్యుడిగా, కనీసం మూడు పర్యాయాలు క్రియాశీల సభ్యుడిగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షుడిగా నియమించాలని ఉంది. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా అన్నామలైని నియమించే విషయంలో లోగడ ఇటువంటి అడ్డంకే వచ్చింది. ఆయన 2017 లో ఏఐఏడిఎంకే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. పార్టీ నియమావళిని సడలించడం, పాత నాయకులకు నచ్చజెప్పడం ద్వారా అధిష్టానం ఒక నిర్ణయం చేయవచ్చు. అలా చేస్తుందా? అన్నది ప్రశ్న. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ (సంస్థాగత వ్యవహారాలు), సునీల్ బన్సల్ (రాష్ట్ర ఇంచార్జీ) లు వారివైన నివేదికలు పై వారికి (మోది-ఫా ద్వయం) ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ విభాగం జాతీయ ప్రతినిధులు కూడా పరిస్థితులు, మంచి-చెడులు వివరిస్తారే తప్ప నిర్దిష్టంగా వీరికివ్వండి అని పేర్లు చెప్పే సంప్రదాయం లేదు.


సంస్థాగతంగానూ ఇబ్బందే!
తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, ఒక్క రాష్ట్రాధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై రెండు, మూడు మాసాలవుతున్నా…. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడివడి ఉండటం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు. మండల స్థాయి కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థాగతంగా బలోపేతం చేసి, గ్రామ స్థాయివరకు పార్టీని పటిష్టపరచి, స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడానికి వీలవుతుంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీల్లోనూ ‘త్రీ`ఎమ్ ఫార్ములా’కు ప్రాధాన్యత ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో నలుగురు ప్రధాన కార్యదర్శులు (సంస్థాగత ప్ర.కా కలుపుకొని), ఎనిమిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యదర్శులుంటారు. జిల్లా స్థాయిలో 3/6/6, మండల స్థాయిలో 2/4/4 చొప్పున కార్యవర్గ ప్రతినిధులుంటారు. వీరికి తోడు ఒక్కొక్క కోశాధికారి, పెద్ద సంఖ్యలో కార్యవర్గ సభ్యులుంటారు. అన్ని స్థాయిల్లో మూడో వంతు మహిళలుండాలి. రాష్ట్రాధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఈ అన్నీ ఓ కొలిక్కివస్తాయి. బండి సంజయ్ను మార్చినపుడు, ఎన్నికల ముందు ఆపద్దర్మంగా నియమించామని పార్టీ అధినాయకత్వమే ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి కొనసాగింపును పార్టీలోని కొందరు ఇష్టపడటం లేదు. ‘ఇష్టం లేని వారిని కొనసాగిస్తూ, కొత్తవారిని నియమించకుండా ఇంకా ఎంతకాలం?’ అనే అర్థంలో ఇటీవల బహిరంగంగా మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్ అభిప్రాయంతో ఏకీభవించే వారి సంఖ్య పార్టీలో ఎక్కువగానే ఉంది.


వ్యూహాలు ఫలిస్తున్నాయా? వికటిస్తున్నాయా?
అంచనాల స్థాయిలో బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజుకోవట్లేదని భావిస్తున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్నాయి. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా… ఆ పరిస్థితిని సానుకూలంగా మలచుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ‘త్రీ`ఎమ్ ఫార్ములా’లో భాగమైన మాదిగలను ఆకట్టుకోవడానికి గత ఎన్నికల్లోనే మంద కృష్ణ మాదిగను అక్కున చేర్చుకొని ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలత ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిళా, సదరు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో ఆ మేర చట్టం తీసుకురావడం జరిగిపోయాయి. ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ) రాజీనామా చేసిన ఖాళీ నింపడం ద్వారా, మంద కృష్ణ మాదిగను రాజ్యసభకు పంపాలని నాయకత్వం యోచించినట్టు సమాచారం. మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గారు. బీసీలను ఆకట్టుకునే క్రమంలో తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య ను ఏపీ నుంచి రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేస్తే, ఆయనేమో పార్టీ వ్యతిరేకించిన తెలంగాణ బీసీ కులగణనను పొగడుతూ మాట్లాడటాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు జీర్ణించుకోలేదు. పార్టీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల ప్రకటన చేస్తూ, సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్రాధ్యక్షుడిని కారణం చెప్పుకుండా అధిష్టానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. అదే సమయంలో, నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని నివారించి బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి, ఏడాది తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ముఖాముఖి తలపడి ఆధిక్యత తీసుకోవడం పార్టీ వ్యూహమని, అందుకే అలా చేశారని చెప్పే వాళ్లూ ఉన్నారు. వ్యూహాలు ఎత్తుగడల సంగతెలా ఉన్నా…. ఢిల్లీ నాయకత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పనిచేయటం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంటు కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోదీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇంచార్జీ బన్సల్ మందలించింది కూడా అందుకే! ‘గోడమీద రాతల నుంచి చిన్న పోస్టర్ అతికించడం వరకు…. అన్నీ డబ్బుమయం అయిపోయాయి తప్ప తెలంగాణలో ఆశించన ఫలితాలు రావట్లేద’ని ఆయన మండిపడటం వెనుక ఎంత నిజముందో పార్టీ రాష్ట్ర నాయకత్వం బేరీజు వేసుకోవాలి.

=============

ఆర్. దిలీప్ రెడ్డి,

సీనియర్ జర్నలిస్ట్

Exit mobile version