Newsminute24

MalathiChandur: తెలుగు వారి గూగులమ్మ “సాహితీ” మాలతీ..!

సాయివంశీ:

మాలతీ చందూర్ గారి గురించి చెప్పాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల పుణ్యమా స్వాతి సపరివార పత్రిక అనగానే సమరం గారి ‘సుఖ సంసారం’ శీర్షిక టక్కున నెనపుకొచ్చేలా మారింది కానీ, నా దృష్టిలో ఆ రోజుకీ, ఈ రోజుకీ స్వాతి వాళ్లు వేసిన The Best Coloum అంటే మాలతీ చందూర్ గారి ‘నన్ను అడగండి’.

18 నవలలు, ‘చంపకం-చెదపురుగులు’ కథా సంపుటి, పాత కెరటాలు పేరిట నవలల పరిచయం, ‘ప్రమదావనం’ అనే గట్టి శీర్షిక.. ఇవ్వన్నీ ఆమె ఖాతాలోనివి. అబ్బే! నాకివన్నీ ఎక్కడ తెలుసు? ఇప్పటికీ మాలతీ చందూర్ అంటే ‘నన్ను అడగండి’ శీర్షికే. అందులో జనాల ప్రశ్నలు, దానికి ఆమె ఇచ్చే సమాధానాలు. ఇప్పుడంటే టపీమని గూగులమ్మ ఒడిలో లెక్కకు మిక్కిలి సమాచారం దొరుకుతుంది కానీ, తెలుగు వారికి అసలైన గూగులమ్మ మాలతీ చందూర్ గారే. అతిశయోక్తి కాదు. అసలు సిసలు సత్యం. నడిచే Encyclopedia అనేది ఆమెకు సరిపోయే మాట. దాదాపు దశాబ్దానికి పైగా ఆ శీర్షిక నడిచింది. ఆమె లేరు కాబట్టి ఆ శీర్షిక ఆగింది కానీ ఉంటే ఇంకా నడిపేవారే! తెలుగులో ఒక రచయిత్రికి దక్కిన అరుదైన గౌరవం అది.

నాకు పదో యేడు ఉన్నప్పుడు తొలిసారి చదివానా శీర్షికని. తెలుగు సాహిత్యం, ఇంగ్లీషు నవలలు, ప్రపంచ సినిమా, రాజకీయాలు, చరిత్ర, సైన్స్, సోషియాలజీ, పండగలు, హేతువాదం, పురాణాలు, పిల్లల పెంపకం.. ఒకటేమిటి, ఈ ప్రపంచంలో సమస్త అంశాలూ అందులో ప్రశ్నలయ్యేవి. వాటికి ఆమె సమాధానం ఇచ్చేవారు. మొక్కుబడిగా కాదు. చాలా దీటుగా, పెక్కు సమాచారంతో. పెర్ల ఎస్ బక్ నాకు అక్కడే తెలిసింది. షీనా అయ్యంగార్ పేరు అక్కడే విన్నాను. మల్లాది రామకృష్ణశాస్త్రి గారి పాటల పుస్తకం ‘వినువేడుక’ గురించి అందులోనే చదివాను. సోమనాథ్ గుడి గురించి, గురజాడ కుటుంబం గురించి, క్రిస్టియానిటీ మూలాల గురించి.. ఎంతెంత సమాచారం. అంత చదివా కాబట్టి కొంత నేర్చుకోగలిగా. అంత చదివా కాబట్టి కొంతైనా అందుకోగలుగుతున్నా. అంత చదివా కాబట్టే కొంతైనా పొగరుగా ఉండగలుగుతున్నా. ఆనాటి పేపర్ కటింగ్స్ నేటికీ నా దగ్గర భద్రంగా ఉండబట్టే ఇవన్నీ చెప్పగలుగుతున్నా.

కొంతమంది చాంతాడంత పొడుగాటి ప్రశ్నలు వేసేవారు. ఆమె రెండు ముక్కల్లో సమాధానం చెప్పేవారు. మరికొందరు రెండు ముక్కల్లో ప్రశ్న అడిగితే పేజీ సగానికి ఉండేది సమాధానం. వింతగా అనిపించేది వాటిని చూస్తే! దేనికి ఎంత చెప్పాలో తెలిసిన మేధావిని ఆమె. దేన్ని ఎలా అర్థం చేయించాలో ఎరిగిన గడసరి ఆమె. ఎవరో ఒకావిడ ‘కైలాస గౌరీ వ్రతం’ గురించి చెప్పమంటే దాని బదులు క్రిస్టియానిటీ గురించి చెప్పారు. ఆ తర్వాత సంచికలో అడగనే అడిగారు మరో పాఠకుడు.. ‘కైలాస గౌరీ వ్రతం గురించి అడిగితే క్రిస్టియానిటీ గురించి చెప్పడం సబబా?’ అని. “నాకు తెలిసింది నేను చెప్పాను. ఈ నోములు, వ్రతాలు మనుషుల్ని మాయలో పడేసేవే” అని దీటుగా సమాధానం చెప్పారామె.

కొందరు వ్యక్తిగత సమస్యలు కూడా అడిగేవారు. ఒప్పించక తానొవ్వక అన్నట్టు కాకుండా సూటిగా తనకు తోచిన సమాధానం చెప్పేవారు. ఒకావిడెవరో అడిగింది..’నేను వంటల పుస్తకాలు రాసి ప్రచురించాను. వాటిని అమ్ముకోవడం ఎలా?’ అని. అడిగినావిడది హైదరాబాద్. “రాష్ట్ర రాజధానిలో ఇంత అమాయకులు ఉన్నారా? పుస్తకాలు రెండు రకాలు. ఒకటి కొనేవి. మరొకటి పంచేవి” అని మాలతీ చందూర్ సమాధానమిచ్చారు. ఆమెకు భయం లేదు. ఇబ్బంది లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే తెలుసు. తెలియని విషయాలు ఉన్నప్పుడు ‘నాకు తెలియదు’ అని చెప్పడమూ ఆమెకు తెలుసు.

మాలతీ చందూర్ గారిది కృష్ణా జిల్లా నూజివీడు. 1947లో భర్త చందూర్ గారితో కలిసి మద్రాసు వెళ్లిపోయి చివరిదాకా అక్కడే ఉన్నారు. చదువుకున్నది SSLC. చదివి, నెమరేసింది బోలెడు సాహిత్యం, జీవితానుభవం. ఆంధ్రప్రభ వారపత్రికలో 1952 నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా ‘ప్రమదావనం’ శీర్షిక ఆమె ఆధ్వర్యంలో నడిచింది. మరే తెలుగు రచయిత్రీ అంత సుదీర్ఘమైన కాలమ్ నడపలేదనుకుంటా. ఆమె సొంతంగా కథలు, నవలలు రాయడమే కాకుండా 300 ఇంగ్లీషు రచనలను తెలుగువారికి పరిచయం చేశారు. మూడు వందలు. Not a Joke. 1970లో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగానూ పనిచేశారు. డి.జయకాంతన్ గారి ప్రసిద్ధ తమిళ నవల ‘సిల నేరంగలిల్.. సిల మనిదరంగల్’ను ‘కొన్ని సమయాలలో.. కొందరు మనుషులు’ పేరిట తెలుగులోకి అనువదించారు. ప్రముఖ నటి భానుమతి గారిని మాలతీ చందూర్ ‘గురూజీ’ అని పిలిచేవారు. ఇద్దరికీ అంత స్నేహం. 2013లో ఆమె మరణించారు. ఆమె శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేశారు.

మనం ఇవాళ రాస్తున్నాం అంటే మనకంటే ముందు అనేకులు రాశారు కాబట్టే! మనం ఇవాళ చదువుతున్నాం అంటే మనకంటే ముందు రాసిన వారు చదివించేలా రాశారు కాబట్టే! ‘మనం’ అనే మాట ఉందంటే మనకన్నా ముందున్న వాళ్లు దాన్ని మనకు అందించబట్టే! మనం వారిని గౌరవించాలి. స్మరించుకోవాలి. అది మన ధర్మం.

Exit mobile version