Newsminute24

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయ డేటాకే భద్రత లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో సాక్షాత్తు  ముఖ్యమంత్రి డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేస్తే దిక్కులేదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న డేటాకే రక్షణ లేకపోతే, సామాన్యుడి కుటుంబాల డేటాకి భద్రత ఎక్కడ ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రజల డేటా చోరీ చేస్తోందన్నారు. ప్రజల వివరాలు తెలుసుకుని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థకు ఇచ్చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి రోడ్డు వేయాలో కూడా ఆ సంస్థే నిర్ణయిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నొక్కే బటన్లతో ఈ ముఖ్యమంత్రి ఎవరి జీవితాలు బాగు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు శివారు లాలుపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వాలంటీర్ల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. మాట్లాడితే 360 డిగ్రీస్ డేటా ఫైలింగ్ అని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఫించన్లు ఇవ్వలేదా? పథకాలు ప్రజలకు అందలేదా? ఏనాయకుడి దగ్గరకు వెళ్లి చెప్పుకున్నా లబ్దిదారులకు పథకాలు అందేవి. ఇప్పుడు ఈ డేటా మొత్తం సేకరించి ఎవరి చేతుల్లోనో పెడుతున్నారు. మాట్లాడితే పేటీఎం బ్యాచ్ తో సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. మీరు ఏం చేసినా జనసేన పార్టీ సామాన్యుడి కోసం స్పందిస్తూనే ఉంటుంది. జనసేన పార్టీ కచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. జనసేన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాట ఇవ్వదు.. ఇచ్చాక పార్టీ ఆ మాటకు కట్టుబడి నిలబడుతుందని మనోహర్ స్పష్టం చేశారు.

నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వం చేసింది శూన్యం..

జనసేన పార్టీ చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటుందన్నారు మనోహర్. దశాబ్దాల తరబడి పాలించిన పార్టీలు చేయలేని కార్యక్రమం మనం క్రియాశీలక సభ్యత్వం ద్వారా చేశామన్నారు. కష్టంలో క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్న ఏకైక పార్టీ జనసేన అని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తుంటే.. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రూ. లక్ష కూడా ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్  మానవత్వంతో స్పందించి అండగా నిలిచారన్నారు. స్వయంగా రూ. 5 కోట్లు ఇచ్చి ఆదుకున్నారని.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అద్భుత కార్యక్రమం చేసి 223 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం చేశామని వివరించారు. అదే నియోజకవర్గంలో గెలిచిన మంత్రి అయిన ఓ మహానుభావుడు ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు వస్తే అందులో రెండున్నర లక్షలు కాజేయాలని చూశాడని మనోహర్ మండిపడ్డారు.

 

Exit mobile version