Telangana: మన తెలంగాణ రాష్ట్రం ఐ.టి. రంగంలో అగ్రగామిగా పేరు గడించింది. ఐ.టి. రంగంలో దేశంలో తలమానికంగా ఎదుగుతున్నది. కోట్లాది రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులను చేస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. భాగ్యనగర కాంతులను విరజిమ్ముతుంది.
ఐతే కాంతి రేఖలు నగరాల నుండి అనేక రంగాలకు వెదజల్లాలి అప్పుడే ఆధునిక సాంకేతికత దన్నుతో నూతన జవసత్వాలతో ప్రగతి పతాక ఎగురుతుంది. ఐ.టి.. విద్యారంగంలో వెలుగులు పూయించాలి.
ఇప్పటి అనేక ఆఫీసుల్లో ముఖ్యంగా విద్యారంగంలో రాతపూతల పని తప్పడం లేదన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే అనేక పత్రాలు, టి.సి, బోనఫైడ్ మొదలగు పత్రాలు చేతివ్రాతలో వ్రాయడం జరుగుతున్నది. రాసేవారు. ఎంతో జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. అనేక తప్పులు దొర్లుతుంటాయి. అప్పుడు వాటిని సవరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా తగినంత కార్యాలయ సిబ్బంది కూడా లేనిచోట కార్యాలయ అధిపతులకు ఈ సమస్య భారంగా మారుతుంది. కొన్ని వందల మంది పాఠశాలలు, కళాశాలలు విడిచి వెళ్ళేటప్పుడు ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. టి.సి. పుస్తకాలలో ప్రతులు అయిపోయినప్పుడు అవి అందుబాటులోకి వచ్చేదాకా విద్యార్థులు నిరీక్షించాల్సి ఉంటుంది. అట్లాగే బోనఫైడ్ పత్రాలు రాయడం కూడా, ఇట్లా సాంప్రదాయ పద్ధతులలోనే విద్యారంగంలో ఏళ్ళుగా కొనసాగుతుంది. కాబట్టి మన వ్యవస్థల్లో ముఖ్యంగా విద్యారంగంలో ప్రాథమిక పాఠశాల మొదలుకొని ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులు సత్వరం సేవలు పొందే విధంగా ‘ఈ’ ఆఫీసు సృష్టి జరగాలి. సౌలభ్యంగా ఆధునిక సాఫ్ట్వేరు విద్యాసంస్థలకు అందజేయవలసి ఉంటుంది, ఇంతే గాకుండా విద్యార్ధుల ప్రగతి నివేదికలను రూపొందించే వీలుగా ఎప్పుడంటే అప్పుడు ఇచ్చే విధంగా రూపొందించవచ్చు. విద్యార్థులు రాసే పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి గణాంక శాస్త్ర పట్టీలను రూపొందించవచ్చు. ఎస్.పి.ఎస్. సాఫ్ట్వేర్ ద్వారా పరిశోధనకు దత్తాంశాలను రూపొందించవచ్చు. అనేక రకాల గ్రాఫ్ ద్వారా చూడగానే విద్యార్ధుల ప్రగతి, పాఠశాలలు, కళాశాలలు, వివిధ బోధనా, క్రీడా, వైజ్ఞానిక రంగాలలో కనబర్చిన అత్యుత్తమ ప్రతిభను నమోదు చేసి భద్రపరచవచ్చు. స్కూల్ రికార్డను మొత్తం డిజిటలైజ్ చేయడానికి వీలుంటుంది. పుస్తకాలలో రాసిన టి.సి.లు, అడ్మిషన్ సంఖ్యలు పాడైపోతాయన్న బెంగ లేకుండా కంప్యూటర్లలో, హార్డ్ డిస్క్లలో భద్రపరచవచ్చు. ఎప్పటికీ కూడా డేటా లభ్యమయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చును.
అదే విధంగా విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బంది వివరాలను కూడా డిజిటల్ రూపంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కావల్సింది ప్రతి విద్యాసంస్థలో అది ప్రభుత్వ, ప్రైవేట్ ఏదైనా అన్ని సంస్థల్లో ‘ఈ’ ఆఫీసులను నెలకొల్పుకొనే విధంగా ఐ.టి. శాఖ చొరవ చూపాలి. దీనికి కావాల్సిన సాంకేతిక దన్నును ఇచ్చి సిబ్బందికి శిక్షణ కూడా ఇప్పిస్తే విద్యారంగంలో ఆధునిక వెలుగులు సంతరించుకొంటాయి.
మూల్యాంకనంలో కూడా కంప్యూటర్ వాల్యుయేషన్ అన్ని స్థాయిల్లో జరగాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా మూల్యాంకన ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. ఉపాధ్యాయులు ఎక్కడ వున్నా పని సులభతరం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర దేశానికి ఒక ఆదర్శ నమూనా అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
============
వ్యాస రచయిత
డా॥ సుంకర రమేశ్
ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులు,
సెల్ :9492180764