Newsminute24

‘సంఘ్‌’ పరివారానికి ఇందిరమ్మ వారసులతో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవు!

Nancharaiah merugumala senior journalist:

దేశంలోని హిందుత్వ శక్తులకు పూర్వపు జర్మన్‌ నాజీలు, ఇటలీ ఫాసిస్టులకు ఉన్న తెలివితేటలు కాని, రాజకీయ సామర్ధ్యంగాని నేడు లేవు. తమకు నిజమైన శత్రువైన గుజరాతీ మహాత్ముడు మోహనదాస్‌ కం గాంధీ హత్యకు ఈ హిందూ మతోన్మాదులు పాల్పడ్డారు. అంతేగాని, తమకు రాజకీయంగా, సైద్ధాంతికంగా అసలు శత్రువులే కాని నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల జోలికి సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఎన్నడూ పోలేదు. ఈ ‘నయా ప్రజాతంత్ర రాజరిక’ కుటుంబానికి చెందిన మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ‘అమరులు’ కావడానికి హిందుత్వవాదులు ఏమాత్రం దోహదం చేయలేదు. హంతకులకు సాయపడలేదు. హిందూ మతోన్మాద శక్తుల ప్రతాపం అంతా ‘శాంతి దూత’, జాతిపిత గాంధీ వంటి వారిపైనే. సోనియా, రాహుల్, ప్రియాంకా తదితర సభ్యులతో కూడిన ‘గాంధీ డైనాస్టీ’ అవసరం భారత ప్రజల కన్నా, బీజేపీ, ఇతర సంఘ్‌ పరివార్‌ సంస్థలకే ఎక్కువ ఉంది. మతతత్వం, ధర్మనిరపేక్ష లౌకికవాదంపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య జరిగేది ఎన్నికల పోరాటమేగాని సైద్ధాంతిక సమరం కాదు. 2014 నుంచీ కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం, ఇందిరమ్మ రాజకీయ వారసల పోకడలు చూస్తుంటే ఇలాంటి అభిప్రాయం కలుగుతోంది అనేక మందికి.

Exit mobile version