Newsminute24

పాఫం కమ్యూనిస్టులు..చివరికి ఇలా మిగిలారు…!!

Telanganapolitics:  తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వామపక్షాల పరిస్థితిని చూస్తే ప్రముఖ సాహితీవేత్త చలసాని ప్రసాద్‌ ఎంతో ఆవేదనతో చెప్పిన ‘‘చివరికి ఇలా మిగిలాం…’’ అనే మాటలు గుర్తుకొస్తున్నాయి. గతంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించిన కమ్యూనిస్టులు నేడు ఉనికి కోసం పోరాడుతున్నారు. ‘‘ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా…’’ పాటలోని మొదటి వరుసను ‘ఎవరో పిలుస్తారని…’ అని మార్చితే తెలంగాణ వామపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్‌ పిలుస్తారని ఎదురుచూసిన వీరికి భంగపాటు ఎదురైంది. వామపక్షాలంటే ప్రజల్లో ఇప్పటికీ ఆదరాభిమానాలు ఉన్నా ఆ పార్టీలు ప్రజాకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకుండా అవకాశవాద రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై సానుభూతిపరులు ఆవేదన చెందుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం పొత్తుల వైపుకు మళ్లాయి. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ సీపీఐ 4, సీపీఐ(ఎం) 5 స్థానాల్లో గెలిచాయి. అనంతరం 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు టీడీపీతో జతకట్టాయి. 1999 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వామపక్షాలు ఒంటరిగా పోటీ చేయగా సీపీఐ(ఎం) రెండు స్థానాలను పొందింది. సీపీఐకి ఒక స్థానం కూడా రాలేదు. 2004లో ఎన్‌డీఏకి వ్యతిరేకంగా యూపీఏతో జతకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ 6, సీపీఐ(ఎం) 9 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాలతో 2009 ఎన్నికల్లో ‘అవినీతి కాంగ్రెస్‌’, ‘మతతత్వ బీజేపీ’లకు వ్యతిరేక నినాదాలతో టీడీపీ, బీఆర్‌ఎస్‌ కూటమితో వామపక్షాలు జతకట్టగా సీపీఐ 4, సీపీఐ(ఎం) ఒక స్థానం సాధించింది. తెలంగాణ ఉద్యమంతో వామపక్షాలకు కష్టాలు ఎదురయ్యాయి. ప్రత్యేక రాష్ట్రానికి సీపీఐ మద్దతివ్వగా, సీపీఐ(ఎం) వ్యతిరేకించింది. ఈ నిర్ణయాలతో ఏదో ఒక రాష్ట్రంలో వారు బలపడ్డారా అంటే అదీ లేదు. అనంతరం పరిణామాలతో రెండు రాష్ట్రాల్లోనూ ఉభయ పార్టీలు ఎదురీదుతూనే ఉన్నాయి.

2014 ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ(ఎం) వైఎస్‌ఆర్‌సీపీతో కలిసి, సీపీఐ కాంగ్రెస్‌తో జతకట్టి చెరో స్థానం సాధించాయి. ఏపీలో ఒంటరిగా పోటీ చేసిన వీరికి ఒక్క స్థానం కూడా రాలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో అతలాకుతలం అయిన సీపీఐ(ఎం) తెలంగాణకు వ్యతిరేకమనే ముద్ర చెరిపేసుకొని, 2018 ఎన్నికల్లో బలపడాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ‘మహాజన’ పాదయాత్ర చేపట్టి, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేసింది. మరోవైపు సీపీఐ బీఎల్‌ఎఫ్‌లో చేరకుండా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌ మహాకూటమితో జతకట్టింది. వామపక్షాలు ఈ ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించక ఘోరమైన ఓటమిని పొందాయి. మరోవైపు ఏపీలో 2019లో జనసేనతో పొత్తుపెట్టుకున్నా కమ్యూనిస్టులకు అక్కడా భంగపాటు తప్పలేదు. గతంలో ఒక వెలుగువెలిగిన వామపక్షాలకు ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లోనూ ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడమే. 

నాయకత్వం విఫలం..

కమ్యూనిస్టు సిద్ధాంతాలను యువతకు చేరవేయడంలో నాయకత్వం విఫలమవుతోంది.  పార్టీలలో సభ్యత్వం, చేరికలు కరువైనాయి. పార్టీ విధానాలు నచ్చక కొందరు సభ్యత్వాలను రెన్యువల్‌ చేసుకోవడం లేదు. కార్యకర్తలు ఎంత సేపు పార్టీతో లాభం పొందాలనే చూస్తున్నారే కానీ, పార్టీ అభివృద్ధికి కృషి చేయడం లేదని పాతతరం నేతలు బాధపడుతున్నారు. ప్రెస్‌మీట్లు, సోషల్‌ మీడియా పోస్టర్లు, ఫోటోల కోసం ధర్నాలకే పార్టీలు పరిమితమయ్యాయి. పార్టీకి మీడియాలో ప్రాధాన్యతుండాలని ప్రింట్‌, టీవీ, సోషల్‌ మీడియాలను సొంతంగా ప్రారంభించగా అవీ  వివాదాస్పదమయ్యాయి. గతంలో ఏ మీడియా లేకపోయినా ప్రాచుర్యం పొందిన వామపక్షాలు ఇప్పుడు సొంత మీడియాలను ఏర్పాటు చేసుకున్నా లాభం లేకుండా పోయింది. పార్టీలోని కీలకనేతలు, మేధావులు రాజకీయ విశ్లేషణల పేరుతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నా, వారి స్వప్రయోజనాలే తప్ప పార్టీలకు ఒరుగుతుందేమీ లేదనే వ్యాఖ్యలు ఆ పార్టీలలోఉన్నాయి.

ఒకప్పుడు కమ్యూనిస్టు నేతలు, కార్యకర్తలు నిప్పులా ఉండేవారు. ఇప్పుడు ఆ నిప్పుకు చెదలు పడుతున్నాయి. పార్టీ కేంద్ర నాయకత్వమే నేతలు, కార్యకర్తల బ్యాంక్‌ అకౌంట్స్‌, బ్యాలెన్స్‌ షీట్లను తనిఖీ చేస్తుందనే గుసగుసలు ఆ పార్టీలలో వినిపిస్తున్నాయి. పార్టీలోని కీలకనేతల కుటుంబ సభ్యులు అమెరికా వంటి దేశాలలో ఉంటారు కానీ, కిందస్థాయి నేతల పిల్లలు విదేశాలకు వెళ్తే మాత్రం పార్టీలో విచారణలు చేపడుతారనే అసంతృప్తి ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉంది. సీపీఐ(ఎం) జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలో ఉన్న ఒక తెలుగు నేత పార్టీ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించలేనని పార్టీకి తెలియజేసినట్టు వార్తలొచ్చినా ఎటువంటి ఖండన రాకపోవడం అంతర్గతంగా ఏదో జరుగుతోందని ప్రచారానికి తెరలేపింది. కుల రాజకీయాలు కీలక పాత్ర పోషించే ఆంధ్రప్రదేశ్‌లో కులాలకు అతీతం అని చెప్పుకునే వామపక్షాల నేతల రాజకీయాలు కులాల చుట్టే తిరుగుతున్నాయి. పార్టీల నేతల్లో కొందరు వారివారి ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్‌ఆర్పీకి, టీడీపీకి పరోక్షంగా మద్దతిస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ బలపడుతున్న దశలో వామపక్షాలకు మునుగోడు ఉప ఎన్నికలు వరంగా మారాయి. ఈ ఎన్నికల్లో వామపక్షాలతో జతకట్టేందుకు కాంగ్రెస్‌ చొరవతీసుకుంటున్న సమయంలో సీపీఐ(ఎం), సీపీఐ పోటీపడి బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారనేది బహిరంగ రహస్యమే. మునుగోడులో సీపీఐకి ఐదుసార్లు గెలిచిన చరిత్ర ఉందని, ఇక్కడ దాదాపు పాతికవేలకు పైగా ఓటు బ్యాంకు వామపక్షాలకు ఉండడంతో పొత్తు వద్దని, సొంతంగా బరిలోకి దిగుదామని కార్యకర్తలు ఎంత చెప్పినా అగ్రనేతలు పెడచెవిన పెట్టారు. మునుగోడులో పోటీ చేసి, కేసీఆర్‌కు వారి బలాన్ని చూపించే అవకాశాన్ని కమ్యూనిస్టులు జారవిడుచుకున్నారు. మునుగోడులో గెలిచిన అనంతరం కేసీఆర్‌ వామపక్షాలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోయినా ఆయన వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన కమ్యూనిస్టు కీలక నేతలు వారికి సంబంధించిన కనీసం రెండు సీట్లు ఇచ్చినా సరిపుచ్చుకుందామనుకున్నారు.  వామపక్ష నేతల బలహీనతలను గుర్తించిన కేసీఆర్‌ చివరికి వీరిని చీపురుపుల్లాలా తీసివేశారు. కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను చూసి ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల కంటే మిత్రపక్షంగా చేప్పుకున్న వామపక్షాలు షాక్‌తిన్నాయి. భంగపాటుకు గురైన కమ్యూనిస్టులు ‘బీఆర్‌ఎస్‌ను ఓడిరచడమే లక్ష్యం’, ‘కేసీఆర్‌కు మా తడాఖా చూపిస్తాం’ వంటి గంభీర డైలాగులు వదులుతున్నారు.

ఉద్యమాలకు మారుపేరైన వామపక్షాలు ఎప్పుడైతే బీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం తహతహలాడాయో అప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడాన్ని మర్చేపోయారు. వామపక్షాలు ‘ఇండియా’ కూటమిలో ఉండడంపై గతంలో జరిగిన చర్చల్లో బీఆర్‌ఎస్‌ అసంతృప్తి వ్యక్తం చేసిందని కమ్యునిస్టు నేతలు ఇప్పుడు బయటపెట్టారు. అప్పటి సమావేశ వివరాలను రహస్యంగా ఉంచడంలోనే నాయకుల లోగుట్టు ఉంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కూటమిలో వామపక్షాలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా ఇక్కడ నేతలు మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న బీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం పాకులాడడమే వ్యూహాత్మక తప్పిదం. కాంగ్రెస్‌తోనైనా పొత్తు పెట్టుకుంటే అసెంబ్లీలో కనీసం ప్రాతినిధ్యం వస్తుందనే ఆలోచనలో ఇప్పుడు వామపక్షాలున్నట్లు వార్తలొస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ తిరస్కరించడంతో కమ్యూనిస్టులు కాళ్లబేరానికి రాకతప్పదనే భావనతో కాంగ్రెస్‌ వీరికి బలం లేని సీట్లు కేటాయిస్తే లాభం ఉండదు కాబట్టి ఇప్పటికైనా పట్టున్న స్థానాల్లో కష్టపడితే కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వగలుగుతారు. 

కేసీఆర్‌ అవకాశవాద రాజకీయాలతో మిత్ర ద్రోహం చేశారని కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్‌ అవకాశవాదం గురించి వామపక్షాలకు గతంలో తెలియవా..? కమ్యూనిస్టుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడే వామపక్షాలకు కేసీఆర్‌ వ్యవహారశైలిపై జ్ఞానోదయం కావాల్సింది. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలోని నవతెలంగాణ పత్రికపై కేసీఆర్‌ కక్షకట్టడంతో ఎదురైన ఇబ్బందులను వామపక్షాలు మర్చేపోయాయా..? లేదా వారి స్వప్రయోజనాల కోసం పార్టీ భవిష్యత్తును తాకట్టు పెట్టారా..? అనే సందేహాలొస్తున్నాయి. రాజకీయాల్లో అవకాశవాదం, మిత్రద్రోహం కొత్తేమి కావు. వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలకు వీటి గురించి మరింత ఎక్కువగానే తెలిసుండాలి. గతంలో కేసీఆర్‌ వామపక్షాలను గుండుసూదీలతో పోల్చినప్పుడే ఆ మాటలు వారి గుండెల్లో గుచ్చుకొని ఉండాల్సింది. ఇంతకుముందు బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకుసాగిన వామపక్షాలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యం అంటున్నాయి. ఎప్పుడూ ఒకరి ఓటమి లక్ష్యంగా రాజకీయాల బదులు తమ గెలుపుకు కృషి చేస్తే బాగుంటుంది. ఒకరి సాయంతో లాభపడాలకునే బదులు సొంతంగా బలపడడానికి కృషి చేస్తే 2028 ఎన్నికలకైనా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి. వైఫల్యాలను చారిత్రాత్మక తప్పులుగా ఒప్పుకుంటూ చెంపలేసుకోవడానికి అలవాటు పడిన వామపక్షాలు మరోసారి ఆ తప్పిదాలు చేయకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

 

Exit mobile version